Tirumala: విషాదం.. తిరుమల నడకదారిలో గుండెపోటుతో డీఎస్పీ మృతి

తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ గుండెపోటుతో మృతి చెందారు. 1,805వ మెట్టు వద్ద ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు.

Tirumala: విషాదం.. తిరుమల నడకదారిలో గుండెపోటుతో డీఎస్పీ మృతి
X

Tirumala: తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ గుండెపోటుతో మృతి చెందారు. 1,805వ మెట్టు వద్ద ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడి స్థానికులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. కృపాకర్ స్వస్థలం విజయవాడ సమీపంలోని పోరంకి. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించిన భద్రతా విధుల నిమిత్తం కృపాకర్ తిరుమల వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నెల 26, 27 తేదీల్లో తిరుమలలో పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్ జవహర్ రెడ్డి విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 26వ తేదీ సాయంత్రం వాయుసేన విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని తిరుమల చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.

మర్నాడు అనగా 27వ తేదీ ఉదయం వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం తిరుపతి నుంచి ప్రధాని హైదరాబాద్‌కు బయలుదేరుతారు. ప్రధాని పర్యటనకు సంబంధించి సమగ్ర, పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. 27న ఉదయం తిరుమలలో స్వామివారి దర్శనం సందర్భంగా వీవీఐపీల పర్యటనల నిబంధనల మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈఓను ఆదేశించారు.

Tags:
Next Story
Share it