Gurkula Hostel: మరో స్టూడెంట్ బలి

గురుకుల కాలేజ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది

Gurkula Hostel: మరో స్టూడెంట్ బలి
X

సూర్యాపేట జిల్లా ఇమాంపేట గురుకులంలో విషాదం

ఉరి వేసుకొని ఇంటర్ విద్యార్థిని వైష్ణవి మృతి

మరణంపై తల్లిదండ్రుల అనుమానాలు

మృతదేహాంపై గాయాలు.. హత్యే అంటున్న పేరెంట్స్

నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

తెలంగాణం, సూర్యాపేట: గురుకుల కాలేజ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. భువనగిరిలో ఇద్దరు టెన్త్ విద్యార్ధినిల మృతి సంఘటన మర్చిపోకముందే, సూర్యాపేట జిల్లాలో మరో విద్యార్ధిని అనుమానాస్పదంగా మృతి చెందింది. సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న దగ్గుపాటి వైష్ణవి శనివారం రాత్రి హస్టల్ గదిలో ఉరివేసుకొని చనిపోయింది. అయితే వైష్ణవి మృతిపై ఆమె పేరెంట్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు .

శనివారం జరిగిన ఫేర్‌వెల్ పార్టీలో వైష్ణవి పాల్గొంది. కాలేజీలో జరిగిన సెలబ్రేషన్ష్ గురించి ఫోన్ చేసి చెప్పిందని తల్లిదండ్రులు అంటున్నారు. అయితే రాత్రి వరకే అమ్మాయి సూసైడ్ చేసుకుందని ఫోన్ వచ్చిందన్నారు. ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఇటీవల వైష్ణవి ఇంటికి వచ్చిందని, ఆ సమయంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ అన్నపూర్ణ అమ్మాయి చదువు గురించి అడిగి తెలుసుకుందన్నారు. హాస్టల్‌లో అన్నం బాగుండటం లేదని, రాళ్లు వస్తున్నాయని అన్నపూర్ణతో వైష్ణవి చెప్పిందన్నారు. దీంతో వెంటనే ఆమె ప్రిన్సిపల్‌తో మాట్లాడారని, ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని తమ కూతురును వేధించారని ఆరోపించారు. వైష్ణవి మృతదేహంపై గాయాలు ఉన్నాయని, తమ కూతురును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆమె పేరెంట్స్ అంటున్నారు.

విద్యార్థి సంఘాల ఆందోళన..

వైష్ణవి మృతిని నిరసిస్తూ విద్యార్ధి సంఘాలు, వివిధ పార్టీల నేతలతో పాటు పేరెంట్స్ ఆందోళనకు దిగారు. కాలేజీ గేట్ ముందు నిరసన తెలిపారు. వైష్ణవి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వైష్ణవి సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదని, ఆమెను హత్య చేసి ఇలా ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్ధిని మృతిపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. బాధిత కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

బిడ్డల ప్రాణాలకైనా ‘‘గ్యారంటీ‘‘ ఇవ్వండి : ఆర్ఎస్ ప్రవీణ్

వైష్ణవి మృతిపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. మీ ‘‘ ఆరు గ్యారంటీల మాట దేవుడెరుగు కానీ, దయచేసి మా బిడ్డల ప్రాణాలకైనా ‘‘గ్యారంటీ‘‘ ఇవ్వండి అంటూ ట్వీట్ చేశారు. వసతి గృహాల్లో విద్యార్ధినిల మృతి పట్ల ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరపాలన్నారు. ప్రతి హాస్టల్‌లో సైకాలజిస్టును నియమించాలని, మృతిరాలి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటిచాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Tags:
Next Story
Share it