minister uttam kumar : నిండు సభలో అబద్ధాలు..!

కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు అప్పగించే ప్రసక్తే లేదని రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది

minister uttam kumar : నిండు సభలో అబద్ధాలు..!
X

కృష్ణా నీళ్లపై అసెంబ్లీలో మాటల యుద్ధం

కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇయ్యం

తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్

ఏకగ్రీవంగా అసెంబ్లీ తీర్మానం

సర్కారువన్నీ అబద్ధాలేనన్న హరీష్ రావు

ఒక్కో అవాస్తవానికి సవివరంగా క్లారిఫికేషన్

299 టీఎంసీ వాటాకు ఎలా ఒప్పుకున్నారని సర్కారు ప్రశ్న

కాంగ్రెస్ హాయంలోనే చేశారని బీఆర్ఎస్ కౌంటర్

తెలంగాణం, హైదరాబాద్ : కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు అప్పగించే ప్రసక్తే లేదని రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. కొన్ని సలహాలు, సూచనలతో అన్ని పార్టీలు తీర్మానానికి అంగీకారం తెలిపాయి. అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు అప్పగించే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పింది. ప్రాజెక్టులు అప్పగించేందుకు తాము బోర్డు మీటింగ్ లో సంతకాలు పెట్టలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పదే పదే సభలో చెప్పుకొచ్చారు.

తీర్మానంపై అసెంబ్లీలో చర్చ వాడీవేడిగా జరిగింది. తప్పంతా బీఆర్ఎస్ పార్టీదేనని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తర్వాత మాట్లాడిన మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు. కేఆర్ఎంబీ మీటింగ్ లో ప్రాజెక్టులు అప్పగిస్తామని సంతకాలు పెట్టి వచ్చి.. రాష్ట్రంలో అబద్దాలు చెప్పడం సరికాదన్నారు. కృష్ణా నీళ్ల కోసం కేసీఆర్ గారు నల్లగొండలో సభకు పిలుపునివ్వడంతోనే కాంగ్రెస్ సర్కారు హడావుడి చేస్తోందని మండిపడ్డారు. ఇది ప్రజల విజయమని, బీఆర్ఎస్ పార్టీ విజయమని ఆయన అన్నారు. బోర్డు మీటింగులు, 299 టీఎంసీ నీటికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకున్న అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. కృష్ణా ప్రాజెక్టులపై రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ నాలుగు అబద్ధాలు చెప్పిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టింది కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాల పుస్తకం కాదని.. అవాస్తవాల పుస్తకం అని మండిపడ్డారు. చివరగా అన్ని పార్టీల అంగీకారంతో తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది.

అబద్ధాలు వర్సెస్ నిజాలు...

ప్రభుత్వం : 06.10.2010న అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ప్రాజెక్టులు అప్పగించేందుకు కేసీఆర్ ఒప్పుకున్నారు. .

హరీష్ రావు : రెండు రాష్ట్రాలకు శాశ్వత నీటి వాటాలను ట్రిబ్యునల్ తేల్చే వరకు ప్రాజెక్టులనుబోర్డు పరిధిలోకి ఇచ్చేందుకు ఒప్పుకోం అని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో చెప్పారు. ట్రిబ్యునల్ ఏర్పాటు కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి అంశం కోర్టు పరిధిలో ఉండగా కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు ప్రాజెక్టులు ఇచ్చేందుకు ఒప్పుకోబోమని చెప్పారు.

ప్రభుత్వం : కృష్ణా నది పరిధిలోని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయలేదు. అంటే ప్రాజెక్టులు అప్పగించేందుకు అంగీకరించినట్టే కదా.?

హరీష్ రావు : కేఆర్ఎంబీ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ను ఒప్పుకునేది లేదని.. గెజిట్ ను సమీక్ష చేసి సవరించాలని బోర్డు మీటింగ్ లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ చెప్పారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ను అప్పగించబోమని గెజిట్ ను రివ్యూ చేయాలని తెలిపారు. ప్రాజెక్టులను అప్పగించే అంశాన్ని అపెక్స్ కౌన్సిల్ కు రిఫర్ చేయాలని స్పెషల్ సీఎస్ సూచించారు. అలాగే.. ఈ ఏడాది జనవరి 27న కేంద్రానికి ప్రస్తుత ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖ రాశారు. గతంలో 2021లో సవరణలు కోరిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు.

ప్రభుత్వం : నీటి నిర్వహణ నియమావళిని ఖరారు చేసి ప్రాజెక్టులు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తుందని ఆనాటి ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్పారు.

హరీష్ రావు : ఆపరేషన్ ప్రోటోకాల్స్ పై తుది నిర్ణయం తీసుకున్నాకే ప్రాజెక్టులు అప్పజెబుతామని 16వ బోర్డు మీటింగ్ లోనే చెప్పారని ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కేంద్రానికి గత నెలలో రాసిన లేఖలో ప్రస్తావించారు. 17వ బోర్డు మీటింగ్ లో ప్రాజెక్టులు ఇచ్చేది లేదని... అపెక్స్ కౌన్సిల్ రిఫర్ చేయాలని తేల్చి చెప్పాం.

ప్రభుత్వం : కేసీఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కృష్ణా ప్రాజెక్టులను పట్టించుకోలేదు. ప్రాజెక్టుల అప్పగింతను ఏనాడు వ్యతిరేకించలేదు.

హరీష్ రావు : రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో స్వయంగా కేసీఆరే ప్రాజెక్టుల అప్పగింతను వ్యతిరేకించారు. అంతేకాదు.. కృష్ణా నీటిని 50:50 వాటాలుగా కేటాయించాలని 2018లోనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం.

ప్రభుత్వం : గత ప్రభుత్వమే ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు అంగీకరించింది. బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించింది.

హరీష్ రావు : ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు అంగీకరించలేదు. గెజిట్ లో చెప్పిన అన్ని ప్రాజెక్టులు కాకుండా కామన్ ప్రాజెక్టులను బోర్డు పరిధికి ఇచ్చేందుకు ఒప్పుకుంటూ.. దానికి కొన్ని షరతులు పెట్టాం. ప్రతీ బోర్డు మీటింగ్ లో మా అభ్యంతరాలు తెలియజేస్తూ వచ్చాం. షరతులకు ఒప్పుకుంటేనే ఒప్పుకుంటామని బడ్జెట్ లో నిధులు ప్రతిపాదించాం. కానీ షరతులకు కేంద్రం ఒప్పుకోలేదు. మేం నిధులు ఇవ్వలేదు.

ప్రభుత్వం : 299 టీఎంసీకి ఎందుకు ఒప్పుకున్నారు.? రాష్ట్రంలోని పరివాహక ప్రాంతాన్ని లెక్కలోకి తీసుకుని 68 టీఎంసీ అడగాలి. కానీ గత ప్రభుత్వం రాష్ట్ర నీటి హక్కులను నిర్లక్ష్యం చేసింది.

కడియం శ్రీహరి : 299 టీఎంసీ నీటి వాటా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కేటాయింపులు జరిగాయి. బచావత్ ట్రిబ్యునల్ ఈ కేటాయింపులు చేసింది. 2014 వరకు ఉన్న నీటి వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ కేటాయింపులు చేశారు. ఆ తర్వాత తాత్కాలికంగా ఇది కొనసాగింది. దీనికి శాశ్వత కేటాయింపులకు ఎలాంటి సంబంధం లేదు.

Tags:
Next Story
Share it