KTR: 2004 నుంచి చిట్టా తీయాలి

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

KTR: 2004 నుంచి చిట్టా తీయాలి
X

ఫోన్లు ట్యాప్ అయ్యాయని కాంగ్రెస్ ఎంపీలే అన్నరు

గతంలో పనిచేసిన పోలీసు ఆఫీసర్లందరినీ విచారించాలె

ఫోన్ ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదు

ఖైరతాబాద్, స్టేషన్ ఘన్ పూర్ లో బై ఎలక్షన్ పక్కా

రాష్ట్రంలో ప్రజల గొంతులు ఎండుతున్నయ్

ఫోన్ ట్యాపింగ్ పై కాదు వాటర్ ట్యాప్లపై దృష్టి పెట్టాలి

చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. 25లక్షలు ఇవ్వాలి

కేసీఆర్ అంటే నీళ్లు.. కాంగ్రెస్ అంటే కన్నీళ్లు

రేవంత్ సర్కారుపై కేటీఆర్ ఫైర్

తెలంగాణం, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తనను అప్రతిష్టపాలు చేసేవారిపై లీగల్ గా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. 2011 నుండి జరిగిన ఫోన్ ట్యాపింగ్ వివరాలన్నీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 2011లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర సీఎం, తెలంగాణ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా చెప్పారని వెల్లడించారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాటి నుండి ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలు తీస్తే ఎవరి బొక్కలు ఏంటో తెలుస్తాయని అన్నారు. గతంలో పనిచేసిన పోలీసు ఉన్నతాధికారులందరిని విచారించాలన్నారు.

ఒక పార్టీ గుర్తుతో గెలిచి మరో పార్టీలో చేరి మళ్లీ పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ పై కచ్చితంగా కోర్టుకు వెళతామని చెప్పారు. ఖైరతాబాద్, స్టేషన్ ఘన్ పూర్లో ఉపఎన్నిక ఖాయమని తెలిపారు. నీటి సమస్యపై మాట్లాడుతూ..మిషన్ భగీరథను సక్రమంగా నిర్వహించడం ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గొంతులు ఎండిపోయి మంచినీళ్లు మహాప్రభో అని అల్లాడుతున్నారని చెప్పారు. మహిళలు మళ్లీ బిందెలు పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని కేసీఆర్ పాలనలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు. ట్యాంకర్ల దందా జోరుగా సాగుతోందని మూడు, నాలుగు రెట్లు అధికంగా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని...అందుకే కేసీఆర్ అంటే నీళ్లు కాంగ్రెస్ అంటే కన్నీళ్లని అన్నారు. ఇది ప్రకృతి వల్ల వచ్చిన విపత్తు కాదని కాంగ్రెస్ అసమర్దత వల్ల వచ్చిన విపత్తు అని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ మీద కాకుండా వాటర్ ట్యాపుల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. చేరికల కోసం గేట్లు ఎత్తడం కాదని రైతుల కోసం గేట్లు ఎత్తాలని అన్నారు. ప్రభుత్వానికి ధన వనరులను ఢిల్లీకి తరలించడం పై ఉన్న శ్రద్ద జలవనరులను తీసుకురావడంపై లేదని విమర్శించారు.

కేసీఆర్ జనగామ, సూర్యాపేట వెళ్లగానే అదే కాళేశ్వరం నీళ్లను వదిలారని, కాళేశ్వరం పంపులను ఆన్ చేసి మేడిగడ్డకు మరమ్మతులు చేస్తే ఈ పరిస్థితి వచ్చేదా..? అని ప్రశ్నించారు. పంటలు పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే కాంగ్రెస్ సాగునీరు ఇవ్వడం లేదని విమర్శించారు. బెంగుళూరులో నీళ్లు వృథా చేస్తే జరిమానా విధిస్తామని అక్కడి ప్రభుత్వం అంటుందని..వందరోజులుగా నీళ్లు ఎత్తిపోయని ఈ ప్రభుత్వానికి ఏ జరిమానా విధించాలని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.25 లక్షలు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 218మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వారి వివరాలు రేవంత్ రెడ్డికి పంపిస్తామని చెప్పారు.

Tags:
Next Story
Share it