Cm Revanth Reddy: కేసీఆర్ ముందు చెప్పలే.. అందుకే నీళ్లియ్యలే..!

రైతుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అవహేళన చేశారు

Cm Revanth Reddy: కేసీఆర్ ముందు చెప్పలే.. అందుకే నీళ్లియ్యలే..!
X

పంటలకు నీళ్లివ్వడంపై రేవంత్ రెడ్డి కామెంట్స్

నష్టపరిహారం గురించి మా చేతుల్లో ఏం లేదు

చనిపోయిన రైతుల వివరాలు కేసీఆర్ ఇస్తే..

మేం ఎలక్షన్లు ఐనంక పరిహారం ఇస్తం

ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం అమలు చేసినం

ఆడబిడ్డలందరికి 500కే సిలిండర్ ఇస్తున్నం

మా కొడంగల్ లో పోరలు మందుకల్లు తాగుతరు

మంచినీళ్ల కోసం మీడియా ప్రతినిధుల అగచాట్లు

తెలంగాణం, హైదరాబాద్: రైతుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అవహేళన చేశారు. ఈ నెల 6వ తేదీన తుక్కుగూడలో కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో విడుదల సభ సందర్భంగా.. ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారని ఇటీవల పొలంబాట కార్యక్రమంలో మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన రేవంత్ రెడ్డి.. చనిపోయిన రైతుల ఊర్లు, పేర్లు కేసీఆర్ తమకు ఇవ్వాలని సూచించారు. కేసీఆర్ తమకు వివరాలు ఇస్తే ఎన్నికలు అయిపోయాక వారికి పరిహారం ఇస్తామని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీనే పంటనష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. అధికారులతో వివరాలు తెప్పించుకోవాల్సిందిపోయి.. రైతుల అంశంలో కూడా ఇలా వెటకారాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంటలకు నీళ్ల విషయంలోనూ ఇదేవిధంగా మాట్లాడారు. కేసీఆర్ ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు.? ఎండిపోకముందే చెప్పాలని కదా అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. రైతులకు సంబంధించి తమ చేతుల్లో ఏం లేదని.. కేంద్ర ఎన్నికల సంఘమే రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నానన్నారు. కేసీఆర్ జిల్లా పర్యటనకు ప్రభుత్వమే ఏర్పాట్లు చేసిందని.. తాము తలుచుకుంటే కేసీఆర్ ఇంట్లోంచి బయటకు వెళ్లేవారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో మిషన్ భగీరథ ద్వారా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే తాగునీరు ఇస్తున్నామని చెప్పారు. ప్రజల ఇతరత్రా రోజువారి అవసరాల కోసమే ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నామని చెప్పారు. 2000 ట్యాంకర్లతో, బుక్ చేసిన 12 గంటల్లోనే నీరు అందేలా చర్యలు చేపట్టామని వివరించారు.

రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇల్లులేని పేదలకు ఆదుకునే కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిందని రేవంత్ రెడ్డి చెప్పారు. తాము ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామని చెప్పామని.. ఆ భరోసాతోనే వాళ్లు తమ మీటింగులకు వస్తరని ఆయన అన్నారు. తాము రోజుకు 18 గంటలు పనిచేస్తున్నామని చెప్పిన సీఎం.. ఇప్పుడు దాన్నిమరో 2 గంటలు పెంచారు. తాము రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేస్తోంటే.. వంద రోజులు కాకముందే అది చేయలే.. ఇది చేయలేదని.. అంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తాయని.. జూన్ 9నాడు ఇండియా కూటమి రామ్ లీలా మైదానంలో ప్రమాణస్వీకారం చేస్తుందని చెప్పారు.

నీళ్లకోసం జర్నలిస్టుల గోస..!

తుక్కుగూడలో సీఎం ప్రెస్ మీట్ లో మంచినీళ్లకు జర్నలిస్టులు అరిగోసపడ్డారు. ఎండతీవ్రత ఎక్కువగా ఉండటంతో తాగునీటికి అల్లాడిపోయారు. సీఎం ప్రెస్ మీట్ కు రావడం ఆలస్యం కావడం, అక్కడున్న వారు ఎవరూ పట్టించుకోకపోవడంతో జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కొద్దిమంది వేదికపై ఉన్న నాయకులను బాటిళ్లు అడుక్కుని తాగాల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు రేవంత్ రెడ్డి అక్కడకు వచ్చే కొద్ది నిమిషాల ముందు సీపీఆర్వో అయోధ్యరెడ్డి రావడంతో.. మీడియా ప్రతినిధులు ఆయనను నిలదీశారు. మిగతావాళ్లు చేతులు చాస్తున్నా.. పట్టించుకోకుండా వెనక ఉన్నవాళ్లకు ఇచ్చారు. దీనిపై మిగతావాళ్లు ఆగ్రహం వ్యక్తంచేయడంతో.. మరో నాలుగైదు బాటిళ్లు తీసుకొచ్చి ఇచ్చారు.

Tags:
Next Story
Share it