Cm revanth reddy: అమ్ముకుంటే అమ్ముకోని పోర్రి..!

హైదరాబాద్ మహానగరంలో ఎల్ అండ్ టీ సంస్థ నిర్వహిస్తున్న మెట్రో ప్రాజెక్ట సరికొత్త చర్చకు దారితీసింది.

Cm revanth reddy: అమ్ముకుంటే అమ్ముకోని పోర్రి..!
X

మెట్రో ఫర్ సేల్‌పై రేవంత్ వ్యాఖ్యలు..!

ఫ్రీబస్సుతో ఎల్&టీకి భారంగా మారిన మెట్రో నిర్వహణ

సంచలనం సృష్టిస్తున్న ఎల్ అండ్ టీ వ్యాఖ్యలు

సీఎం రేవంత్ రెడ్డి తీరే కారణమా..?

మహాలక్ష్మి పథకంపై ఎల్ అండ్ టీ విమర్శలు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీస్తుందని హెచ్చరిక

సర్కార్‌ను ఇబ్బంది పెడుతున్న సంస్థ వ్యాఖ్యలు

విమర్శలు చేయడం వెనక కారణాలేంటి ?

మేడిగడ్డతో ఏమైనా లింక్ ఉందా ?

ఆర్ఆర్ ట్యాక్సుకి సంబంధం ఉందా ?

హైలెట్ బాక్స్: రేవంత్ సర్కార్ తీరుతో బడా సంస్థలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోతాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల ఎల్ అండ్ టీ సంస్థ చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశమైంది. మెట్రో రైల్‌పై ఆ సంస్థ చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వ పెద్దలు దానిపై స్పందించిన తీరు రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభావం చూపుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటు ఆర్ఆర్ ట్యాక్సుల గోల రాష్ట్ర ప్రభుత్వ గౌరవాన్ని తగ్గిస్తుంటే.. మరో వైపు బడా సంస్థలు ఏకంగా ప్రభుత్వ పాలసీలపై విమర్శలు చేయడం దేనికి సంకేతమన్న సందేమాలు కలుగుతున్నాయి. ఎల్ అండ్ టీతో రేవంత్ రెడ్డి సర్కార్‌కు ఎక్కడ చెడింది? ఎందుకు ఆ సంస్థ తీవ్ర విమర్శలు చేసిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది. ఏ ప్రాజెక్ట్ అయినా అటు ప్రభుత్వానికి, ఇటు చేపట్టే సంస్థకు మధ్య ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లేలా ఉంటుంది. మరి ఇక్కడ విమర్శలు చేసేంత వరకు పరిస్థితులు ఎందుకు వెళ్లాయి?

తెలంగాణం, పొలిటికల్ డెస్క్: హైదరాబాద్ మహానగరంలో ఎల్ అండ్ టీ సంస్థ నిర్వహిస్తున్న మెట్రో ప్రాజెక్ట సరికొత్త చర్చకు దారితీసింది. ప్రాజెక్టును అమ్మేస్తామంటూ ఆ సంస్థ ప్రెసిడెంట్, శాశ్వత డైరెక్టర్‌, సీఎఫ్‌వో ఆర్‌. శంకర్‌ రామన్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. నష్టం వచ్చే ప్రాజెక్టుల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుని, లాభాలు వస్తున్న ప్రాజెక్టులకు పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్టు కుండబద్ధలు కొట్టారు. రేవంత్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకంపై నేరుగా ఆయన విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తోన్న ‘మహాలక్ష్మి’ పథకంతో మహిళలు బస్సుల్లో ఎక్కువగా ప్రయాణిస్తూ, మెట్రో రైలు తక్కువగా ఎక్కుతున్నారని, కానీ పురుషులు మాత్రం రూ.35 ఛార్జితో రైళ్లలో ప్రయాణిస్తున్నారన్నారు. ఇది బాధాకరమని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీస్తుందని హెచ్చరించారు. దీనికి కౌంటర్‌గా సీఎం రేవంత్ రెడ్డి ‘‘అమ్మితే అమ్ముకోండి’’ అంటూ హెచ్చరిక టైపులో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల వెనక అసలు నిజం ఏమై ఉంటుంది? ఎల్ అండ్ టీ ప్రెసిడెంట్ అమ్మేస్తామని ఎందుకన్నారు? సీఎం రేవంత్ మరో ఆలోచన లేకుండా అమ్మేసుకోండని ఎలా అన్నారు? ఏదైనా ఉంటే ప్రభుత్వం మాట్లాడుకుని లోలోపల అన్నీ సర్దుకునే బడా బడా కంపెనీలు.. ఇలా బహిరంగంగా విమర్శించడం వెనక ఉన్న బలమైన కారణం ఏంటి? ఒక రాష్ట్ర ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని వారికి తెలియదా?మరి ఎందుకంత ధైర్యం చేశారు?

పెట్టుబడులు పెట్టేవాళ్లు ఎప్పుడూ వ్యాపార ప్రయోజనాల కోణంలోనే ఆలోచిస్తారు. లాభాపేక్ష లేకుండా ఏమీ చేయరు. ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంలో నడిచే ప్రాజెక్టులలోనూ ఆయా సంస్థలు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించే పెట్టుబడులు పెడుతుంటాయి. దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులను చేపట్టే ఎల్ అండ్ టీ సంస్థ దీనికి మినహాయింపు ఏమీ కాదు. వేల కోట్లతో పెట్టుబడులు పెడుతూ నష్టాలతో ఏ ప్రాజెక్టును నిర్వహించాలని అనుకోదు. అయితే మెట్రో రైల్‌ ప్రాజెక్టులోనే ఎందుకు ఇంత పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చింది? ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని నేరుగా ఢీ కొట్టడమన్నట్టే కదా. మరి ఎల్ అండ్ టీ ఎందుకంత ప్రకటన చేసింది? అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. దీని వెనక ‘మేడిగడ్డ’ అంశముందని పలువురు సరికొత్త వాదనను తెరపైకి తీసుకు వస్తున్నారు. గతంలో మేడిగడ్డ విషయంలో ఎల్ అండ్ టీ సంస్థతో ప్రభుత్వానికి ఉన్న విభేదాలను దృష్టిలో పెట్టుకునే ఎల్ అండ్ టీ సంస్థ ఈ ఝలక్ ఇచ్చిందంటున్నారు. మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లు, కాఫర్డ్యాం నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించాలంటూ నాడు మడతపేచీ పెట్టింది. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లోనే బ్యారేజీని నిర్మించామని, అలాంటప్పుడు అందులో తలెత్తిన లోపాలకు తాము బాధ్యులం కాదని స్పష్టం చేసింది. అయితే, కొద్దికాలంలోనే ప్రాజెక్టు మర్మత్తులు చేస్తామని మళ్లీ ముందుకు వచ్చింది. ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వం, ఎల్ అండ్ టీ సంస్థ మధ్య గ్యాప్ పెరిగిందన్న టాక్ వినిపిస్తోంది.

అలాగే ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపిస్తున్నట్టు రాష్ట్రంలో ఆర్‌ఆర్ ట్యాక్సులు కూడా వీళ్ల మధ్య గ్యాప్ పెంచాయన్న చర్చ కూడా జరుగుతోంది. రేవంత్ టీమ్ సంస్థను ట్యాక్సుల కోసం ఇబ్బంది పెడుతోందని, దీంతో ఆ సంస్థ నేరుగా ఆ విషయం చెప్పకుండా ఈ విధంగా మహాలక్ష్మి పథకాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిందంటున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ వ్యహరించిన తీరుతో విసుగు చెందిన ఈ సంస్థ డైరెక్టుగానే టార్గెట్ చేసిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఎల్ అండ్ టీ వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ ‘‘అమ్ముకుంటే అమ్ముకోమను! ఎవరిని బెదిరిస్తున్నారు’’ అంటూ సీరియస్‌గా రియాక్ట్ అవ్వడం వారి మధ్య సత్సంబంధాలు లేవని తెలియజేస్తుంది. ఒక ప్రభుత్వాన్ని నడిపే స్థానంలో ఉంటూ ఇంత అసహనం వ్యక్తం చేయడం, అటు ప్రభుత్వ ప్రాజెక్టులు చేపట్టే బడా సంస్థ నేరుగా విమర్శలు చేయడం రాష్ట్ర ప్రగతికి కూడా శ్రేయస్కరం కాదన్న చర్చ జరుగుతోంది. బెదిరింపు ధోరణిలో వెళితే.. అది ఇరు వర్గాలకే చేటు చేయడంగాక, అంతిమంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:
Next Story
Share it