Cm revanth reddy: బోనస్‌నూ బొంద పెట్టిండు..!

పంటకు రూ.500 బోనస్.. ఎన్నికల ముందు వరకు ఇదిగో ఇస్తాం.. అదిగో ఇస్తామంటూ కాంగ్రెస్ సర్కార్ ఊరించింది.

Cm revanth reddy: బోనస్‌నూ బొంద పెట్టిండు..!
X

సన్నాలకే రూ.500 బోనస్

పంట బోనస్‌కు సర్కార్ కొత్త మెలిక

ఎన్నికల్లో వరికి రూ.500 బోనస్ అన్న కాంగ్రెస్

అధికారంలోకి వచ్చాక మాటమార్చిన ప్రభుత్వం

రాష్ట్రప్రభుత్వంపై మండిపడుతున్న రైతులు

సన్నాలకే అంటే ఊరుకునేది లేదని హెచ్చరిక

రైతులకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసా

హైలైట్ బాక్స్: రైతులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి రేవంత్ సర్కార్ ఆపసోపాలు పడుతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ ఇటు రైతులు, అటు ప్రతిపక్షం వెంటబడుతుంటే ఊపిరాడని పరిస్థితి నెలకొంది. అన్నీ తానే అన్నట్టు ప్రతి నిర్ణయంపై తన మాటగా చెప్పుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డికి హామీలన్నీ మెడకు చుట్టుకుంటున్నాయి. సహచర మంత్రుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఈ హామీల నుంచి సీఎం రేవంత్ ఎలాగైనా గట్టెక్కాలని చూస్తున్నారు. తాజాగా పంట బోనస్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. సన్నాలకు మాత్రమే ఇస్తామనడంతో రైతాంగం ఆందోళనకు గురవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చిందంటూ ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది.

తెలంగాణం, పొలిటికల్ డెస్క్: పంటకు రూ.500 బోనస్.. ఎన్నికల ముందు వరకు ఇదిగో ఇస్తాం.. అదిగో ఇస్తామంటూ కాంగ్రెస్ సర్కార్ ఊరించింది. ఆ తర్వాత షెడ్యూల్ పేరుతో బోనస్ హామీని పక్కన పెట్టింది. ఇప్పుడు ఏకంగా ఓ ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సన్నాలు పండిస్తేనే రూ. 500 బోనస్ అంటూ మీడియాతో జరిపిన చిట్ చాట్‌లో చెప్పారు. ఇదెక్కడి మెలిక అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హామీలు ఇచ్చినప్పుడు ఇచ్చేసి ఇప్పుడు పూటకో మాట చెబుతున్నారని మండిపడుతున్నారు. సర్కార్ మోసం చేస్తుందంటూ ప్రతిపక్షం మండిపడుతోంది. ఏ పంట వేసినా బోనస్ ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ ఇప్పుడు సన్నాలకు మాత్రమే ఇస్తామనడం సమంజసం కాదంటున్నారు. రైతులకు ఎగనామం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు.

రైతులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని.. మీ తరఫున కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ యంత్రాంగం మొత్తం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధైర్యం చెప్పారు. రైతులు ఎప్పుడు పిలిచినా.. ఎక్కడికి పిలిచినా వస్తామని అన్నారు. రైతులకు న్యాయం జరిగేవరకు వాళ్ల తరఫున ఉంటామని తెలిపారు. రైతులకు రుణమాఫీ జరిగే వరకు, పంట బోనస్‌ వచ్చే వరకు, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ప్రజల తరఫున, రైతుల తరఫున నిలబడి మాట్లాడతామని తెలిపారు. ఎవరూ అధైర్యపడొద్దని, ఎవరూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి న్యూస్ లైన్ తెలుగు/తెలంగాణంతో మాట్లాడుతూ, ఎలక్షన్ ముందు ధాన్యానికి బోసన్ రూ. 500 అని చెప్పింది కాంగ్రెస్ పార్టీయేనని, వాటిని అమలు చేసేందుకు మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్ అన్నారని, ఇప్పుడు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేరళ, కర్ణాటక, తమిళనాడులలో ఇస్తున్నారని అన్నారు. బోనస్ కేవలం సన్నాలకే అంటే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణలో అత్యధికంగా పండించేది దొడ్డుబియ్యమని, కేవలం 30 శాతం వరకు ఉన్న సన్నాలకే ఇవ్వడంతో దొడ్డు బియ్యం పండించే రైతులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. సన్నకారు, చిన్నకారు రైతులు దొడ్డుబియ్యాన్ని పండిస్తారని, వారే తీవ్రంగా నష్టపోతారన్నారు. యాసంగి టైమ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బోనస్ అమలు చేయకపోవడంతో నష్ట పోతున్నారన్నారు. గద్దెనెక్కిక తర్వాత బోనస్‌ని కుదించడం అనేది సరియైనది కాదన్నారు. సన్నాలకు మాత్రమే బోసన్ అని ప్రకటిస్తే రైతు సంఘం నేతలుగా రైతులను కూడగట్టి పోరాటాలను చేస్తామన్నారు. రైతాంగం తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిన చరిత్ర మనదన్నారు. బోసన్ కుదింపు ఆలోచన చేయకుండా ఎలక్షన్ కంటే ముందు ఇచ్చిన హామీపై నిలబడాలని డిమాండ్ చేశారు. వరి పండించే రైతాంగానికి ఈ యాసంగి నుంచే రూ. 500 బోసన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

Tags:
Next Story
Share it