Congress Govt: తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవంపై దాడి..!

తెలంగాణ అస్తిత్వ పతాకంపై మరోసారి దాడి జరుగుతుందా ? నాటి సమైక్య పాలనలో జరిగినట్టే మళ్లీ మనం అస్తిత్వం కోసం పోరాడాల్సిందేనా ?

Congress Govt: తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవంపై దాడి..!
X

సమైక్య పాలకులను గుర్తు చేస్తున్న సీఎం రేవంత్ ధోరణి

రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలపై వక్రభాష్యాలు

రేవంత్ సర్కార్ నిర్ణయంపై సర్వత్రా విస్మయం

కాకతీయ కళాతోరణంపై అనాలోచిత నిర్ణయమన్న భావన

నాడు సినిమాలలో యాసకు, భాషకు అవమానాలు

అన్నిటిని దాటుకుని ఆత్మగౌరవంతో నేడు నిలుచున్న వైనం

మళ్లీ వెనకటి రోజులకు తీసుకు వెళుతున్నారా..?

కాంగ్రెస్ పాలనలో ఈ విచిత్ర, నియంతృత్వ పోకడ ఏంటి..?

తెలంగాణం, పొలిటికల్ డెస్క్ :

హైలెట్ బాక్స్ : తెలంగాణ అస్తిత్వ పతాకంపై మరోసారి దాడి జరుగుతుందా ? నాటి సమైక్య పాలనలో జరిగినట్టే మళ్లీ మనం అస్తిత్వం కోసం పోరాడాల్సిందేనా ? అంటే అవుననే సమాధానం వస్తుంది. నిజాం కాలంలో భాష కోసం తండ్లాడాం. సమైక్య పాలనలో గుర్తింపు కోసం కొట్లాడాం. స్వయం పాలనలోనూ మళ్లీ అదే బాట పట్టేలా చేస్తున్నారు నేటి పాలకులు. రాష్ట్ర చిహ్నంలో ఉన్న కాకతీయ కళాతోరణంపై వెళ్లగక్కుతున్న అక్కసు, తెలంగాణ తల్లి విగ్రహంపై విషం చిమ్ముడు దేనికి సంకేతం..? మన ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ గుర్తులు లేకండా చేయడానికా..? పాలనలో చెరగని ముద్రల్లాంటి గొలుసుకట్టు చెరువులు, చారిత్రక నిర్మాణాలతో చిరస్మరణీయమైన కీర్తిని సాధించిన కాకతీయుల గుర్తులను శాశ్వతంగా చెరిపివేయడానికా..? అసలు కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? రేవంత్ సర్కార్ ఆలోచనలు ఏంటి? రాష్ట్ర చిహ్నాలనేవి ప్రభుత్వం మారినప్పుడల్లా మార్చుకునేవా? ఇలా వచ్చిన ప్రతి కొత్త ప్రభుత్వం మార్చుకుంటూ పోతే జరిగే అనర్థాలకు ఎవరు బాధ్యత వహిస్తారు?

పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ. ఈ నేలతల్లి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో అసువులు బాసారు ఎంతో మంది. ఆ తర్వాత తొలి దశ, మలి దశ ఉద్యమాలలోనూ ప్రాణాలకు తెగించి జై తెలంగాణ ఉద్యమాన్ని ఇక్కడి ప్రజలు నడిపించారు. పోలీసు నిర్బంధాలకు వెరవకుండా, తుపాకీగుళ్లకు వెనకడుగు వేయకుండా అస్థిత్వం కోసం పోరు సల్పారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. నాటి నిజాం పాలనలోనైనా, నిన్నటి సమైక్యాంధ్ర పాలనలోనైనా అస్థిత్వాన్ని కాపాడుకోవడమే ప్రధాన అజెండా. బానిసత్వపు సంకెళ్లను తెంచుకోవడం, మనదైన యాసకు, భాషకు, సంస్కృతికీ పట్టం గట్టుకుని స్వయం పాలన చేయాలన్నదే ప్రధాన ఆకాంక్ష.

సమైక్య పాలనలో యాసను అవమానిస్తూ, తెలంగాణ అంటే తాగుడు, తిరుగుడు అన్నట్టుగా ప్రచారం చేసినవాళ్లు ఎంతో మంది. తెలంగాణ యాసలో మాట్లాడాలంటే అదో చిన్నతనంగా భావించేలా చేశారు నాటి పాలకులు. సినిమాలలో రౌడీలకు తెలంగాణ భాషను వినియోగిస్తూ అవమానించారు. అలాంటి సమయంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ జెండా ఎత్తడంతో ఇక్కడి కవులు, కళాకారులకు ప్రత్యేక గుర్తింపురావడమే గాక, భాషకు సినిమాలలో పెద్దపీట వేశారు. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను గత పాలకులు నిర్లక్ష్యం చేస్తే స్వయం పాలనలో దానికి ప్రాధాన్యత ఇచ్చి మళ్లీ కళకళలాడేలా చేసుకున్నాం. మనదైన సంస్కృతీ, సంప్రదాయానికి ప్రతిబింబమైన బతుకమ్మను రాష్ట్ర పండుగగా సగర్వంగా జరుపుకుంటున్నాం. అంతగా ఆత్మగౌరవాన్ని చాటుకుంటుంటే నేటి కాంగ్రెస్ పాలన దానికి విరుద్ధంగా, మళ్లీ పాతరోజులను గుర్తు చేసేలా చేస్తోంది.

తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదంటోంది. రాష్ట్ర చిహ్నం రాచరికపు పోకడలు ఉన్నాయంటూ మనందరికీ గర్వకారణమైన కాకతీయుల కళాతోరణాన్ని కాదంటోంది. గంగాజమునా తెహజబీన్‌కు ప్రతీకగా నిలిచే హైదరాబాద్ నగరానికి సూచిక అయిన చార్మినార్‌ను వద్దంటోంది. సీఎం రేవంత్ రెడ్డి వాటిని రాచరికానికి గుర్తులుగా చెబుతున్నారు. వాటినే చెరిపేస్తామంటున్నారు. గతానికి సంబంధించిన గుర్తులు ఏవీ లేకుండా చేస్తామంటున్నారు. కాకతీయులపై ఆయనకు కోపమా ? లేక ముస్లిం చక్రవర్తులపై ద్వేషమా ? తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉంటే దాన్ని సహించలేని రెడ్డి రాజ్యపు అహంకారమా ? దేని కోసం ఆయన ఆ నిర్ణయం వైపుగా అడుగులు వేస్తున్నారనేది పెద్ద ప్రశ్నగా మారింది. భారతమాత శిరస్సున కిరీటం ఉంటుంది. అంతమాత్రాన ఆమె పూజనీయురాలు కాదా? సీఎం రేవంత్ రెడ్డి సిద్ధాంతం ప్రకారం కిరీటం రాచరికానికి ప్రతీక అయితే.. ఆమె పూజనీయురాలు కానట్టే. దీన్ని సమాజం అంగీకరిస్తుందా.? స్త్రీ దేవతలకు కిరీటాలు ఉండటం సహజం కదా ! మరి ఆ విగ్రహాలను రాచరికపు ఆనవాళ్లు అనగలమా ? సర్వాభరణ శోభితంగా తెలంగాణ తల్లిని చిత్రీకరించుకుంటే తప్పు ఎలా అవుతుంది ?

సీఎం రేవంత్ రెడ్డి తన ఆలోచనలతో తెలంగాణ సమాజంలో విద్వేషపు విషాన్ని చిమ్మే ప్రయత్నం చేస్తున్నారా? అనిపిస్తోంది. సమైక్యపాలకుల ధోరణిలో వెళుతున్న ఆయన పాలనను జనం ఏమాత్రం సహించలేరు. అది హర్షించదగ్గ పరిణామం కూడా కాదు. సమైక్యవాదుల్లో కూడా కొంతమంది కాకతీయ కళాతోరణం పట్ల సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. కాకతీయుల ఘనత తెలిసిన వారు ఎవరూ ఆ విధంగా చేయరని అంటున్నారు. ఏ అస్తిత్వం కోసమైతే పోరాటాలు చేశామో.. వాటిపైనే దాడి జరుగుతున్నట్టుగా సర్కార్ వ్యవహరిస్తుండటం తెలంగాణ వాదులను విస్మయానికి గురి చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చింది పాలనలో కొత్తదనం ఉంటుందని కానీ, ఇలా పాలనను పూర్తిగా కక్షపూరిత ధోరణిలో తీసుకు వెళతారని కాదంటున్నారు. ఇప్పటికైనా మేలుకోకపోతే ప్రజల నుంచి మరోపోరాటం కచ్చితంగా వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Tags:
Next Story
Share it