Congress party: కాంగ్రెస్ కుటుంబ పాలన!

కాంగ్రెస్ పార్టీలో వారసులకు కొదవలేదు. తమ పిల్లలను అందలం ఎక్కించడానికి ఆ పార్టీ నేతలు చేస్తున్న కృషి మామూలుగానూ లేదు.

Congress party: కాంగ్రెస్ కుటుంబ పాలన!
X

పార్లమెంట్ ఎన్నికల్లో కుటుంబ సభ్యులకే టికెట్లు

వారసుల కోసం నేతల పాట్లు

పెద్దపల్లి, నల్లగొండ, ఖమ్మం, వరంగల్..

స్థానం ఏదైనా తమ వాళ్లకే టికెట్లు

కుటుంబ పాలనకు అసలైన చిరునామా కాంగ్రెస్

నెహ్రూ నుంచి రాహుల్ వరకు అందరూ వారసులే

వారసత్వ రాజకీయాల్లో కాంగ్రెస్ తర్వాతే ఎవరైనా!

హైలెట్ బాక్స్: కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. వారసత్వ రాజకీయాలను ప్రేరేపిస్తూ, కుటుంబ రాజకీయాలకు కొత్త మెరుగులు అద్దడంలో తనకు తానే సాటి. ఆ పార్టీ హైకమాండ్‌లో నెహ్రూ నుంచి రాహుల్ వరకు అందరూ రాజకీయ వారసులే. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌లోనూ అదే తరహా రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్ నాయకులు తమ వారసులను తెరమీదకు తెస్తూ కుటుంబ పాలనకు, వారసత్వ రాజకీయాల్లో తమను మించిన వాళ్లు లేరని మరోసారి నిరూపించుకున్నారు. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవారికంటే, వారసులకు మాత్రమే అవకాశాలు ఇవ్వడంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుంది. తమ కుటుంబాలు మాత్రమే రాజకీయాలు చేయాలన్నట్టుగా వ్యవహరిస్తుంటారు హస్తం పార్టీ నాయకులు. దీనికి తాజా పార్లమెంట్ ఎన్నికలు మరో నిదర్శనంగా నిలుస్తున్నాయి.

తెలంగాణం, పొలిటికల్ డెస్క్: కాంగ్రెస్ పార్టీలో వారసులకు కొదవలేదు. తమ పిల్లలను అందలం ఎక్కించడానికి ఆ పార్టీ నేతలు చేస్తున్న కృషి మామూలుగానూ లేదు. అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, తాజా పార్లమెంట్ ఎన్నికలే దీనికి సజీవ సాక్ష్యం. తమ వారసులకు టికెట్లు ఇప్పించుకుని బరిలోకి దింపారు నేతలు. పెద్దలు జానారెడ్డి నుంచి మొదలు పెట్టుకుని నిన్న మొన్న కాంగ్రెస్ కండువా వేసుకున్న కడియం వరకు అందరిదీ అదే బాట. అసలైన కుటుంబ పాలనకు నిర్వచనం కాంగ్రెస్. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తూ తనేంటో చాటుకుంది. అయితే వీళ్లు కుటుంబ పాలన అంటూ గతంలో బీఆర్ఎస్ నేతలను విమర్శించడం విశేషం. కానీ, ఇప్పుడు ఆ పార్టీయే కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వడంలో ముందుంది.

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఇద్దరు రాజకీయ నాయకుల వారసులు బరిలో నిలిచారు. పెద్దపల్లి బరిలో మాజీ ఎంపీ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీ నిలిచారు. వంశీ తాత, వివేక్ తండ్రి కాకా నుంచి ఆ కుటుంబం రాజకీయాల్లో ఉంది. కాంగ్రెస్‌లో దళిత నేతల్లో కాకాది ప్రత్యేక స్థానం. ఆయన వారసులుగా వివేక్, వినోద్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి వారసుడిగా వంశీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వంశీపై స్థానిక నేతల నుంచి వ్యతిరేకత వచ్చినా.. వాటిని పట్టించుకోకుండా టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఇక కరీంనగర్‌లోనూ వారసత్వ రాజకీయమే. మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు తనయుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ రాజేందర్ రావు పోటిపడ్డారు.

నల్లగొండ నుంచి కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరైన రఘువీర్‌ రెడ్డి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. 2018లోనే మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుంచి, నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని రఘువీర్‌ ప్రయత్నించారు. అప్పట్లో అవకాశం రాకపోవడంతో ఈ సారి బరిలో దిగారు. మరో కుమారుడు జైవీర్ రెడ్డి 2023లో నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక వరంగల్ ఎంపీగా పోటీ చేసిన కావ్య కూడా రాజకీయ వారసురాలే. సీనియర్ నాయకుడు, స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనయురాలిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది. కాంగ్రెస్‌లోకి కావ్య ఎంట్రీ కూడా ఆశ్చర్యకరంగా జరిగింది. ఖమ్మం బరిలో ఉన్న రామసహాయం రఘురామ్ రెడ్డి కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెందినవారే. తన వియ్యంకుడికి టికెట్ ఇప్పించుకున్నారు పొంగులేటి. ఇదిలా ఉంటే, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి రాజకీయం బాగా పేరున్న కుటుంబం నుంచి వచ్చిన యువతి. ఆమె తాత, తండ్రులు ఇద్దరూ కాంగ్రెస్‌లో పేరున్న నాయకులు. ఆమె వారసురాలిగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా కాంగ్రెస్ రాజకీయాలన్నీ కులం, వారసత్వం అనే అంశాల చుట్టూనే తిరుగుతుంటాయనడానికి ఈ లోక్‌సభ ఎన్నికలు, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలే నిదర్శనం.

Tags:
Next Story
Share it