Mandakrishna madiga: మాదిగలకు అన్యాయం..!

సీఎం రేవంత్ రెడ్డిపై మంద కృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాట మీద నిలబడే వ్యక్తి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు

Mandakrishna madiga: మాదిగలకు అన్యాయం..!
X

మాలలతో రేవంత్ కుమ్మక్కయ్యిండు

ఎన్నికల ముందో మాట.. తర్వాతో మాట

కడియం శ్రీహరి సిగ్గులేనోడు

రాళ్లతో కొట్టాల్సింది ఎవరిని..?

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా..

మాదిగలను, బీసీలను కూడగడతాం

మంద కృష్ణ మాదిగ తీవ్ర వ్యాఖ్యలు

తెలంగాణం, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై మంద కృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాట మీద నిలబడే వ్యక్తి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాలలతో కుమ్మక్కై మాదిగలకు అన్యాయం చేశారని ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ మాదిగలను చిన్నచూపు చూస్తోందన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీడబ్ల్యూసీలో చక్రం తిప్పుతున్న కొప్పుల రాజు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీళ్లందరూ మాల సామాజిక వర్గం కావడంతో కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఊరికి ఒక్కరు కూడా లేని బైండ్ల సామాజిక వర్గం వారికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న విలువ, గౌరవం, తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాలలో 75 శాతం ఉండే మాదిగలకు లేదని వాపోయారు. కడియం శ్రీహరి సిగ్గులేనోడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారుతుంటే 75 ఏండ్ల వయసులో పార్టీ మారడం ఏంటని, సిగ్గులేనోడని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారని, మరి ఇప్పుడు అదే 75 ఏండ్ల కడియం శ్రీహరి పార్టీలోకి వస్తుంటే రేవంత్ రెడ్డి ఆ సిగ్గులేనోడిని ఎలా పక్కన కూర్చోబెట్టుకున్నాడని ప్రశ్నించారు.

రెడ్డి సామాజిక వర్గానికి రేవంత్ రెడ్డి పెద్ద పీట వేయించుకున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సింహభాగం వారికే సీట్లు దక్కాయన్నారు. మాదిగలకు పూర్తిగా మొండి చేయి చూపించారని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ , చేవెళ్ల, మల్కాజిగిరి, నల్లగొండ, భువనగిరి, నిజామాబాద్‌లలో రెడ్లకు అవకాశం ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీలకు 5 సీట్లు ఇచ్చారని, మెదక్, సికింద్రాబాద్ రెండు చోట్ల మాత్రమే బీసీలకు దక్కాయన్నారు. 5 శాతం లేని రెడ్లకు 50 శాతం ఇచ్చారన్నారు. ఇంకా ప్రకటించని కరీంనగర్, ఖమ్మంలలో కూడా రెడ్ల పేర్లే వినపడుతున్నాయన్నారు. హైదరాబాద్ ఇచ్చినా ఇవ్వకున్నా ఒకటేనని తెలిపారు. బీసీల లెక్క చెప్పడానికి హైదరాబాద్ కూడా లెక్క చూపెడుతుందేమోనని ఎద్దేవా చేశారు. పక్కా మాదిగలకు, బీసీలకు వ్యతిరేకమని రుజువవుతుందన్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాదిగలను, బీసీలను కూడగడతామన్నారు. రాబోయే రోజుల్లో మాదిగల, బీసీల సంఘటిత శక్తి ద్వారా బలమైన ఉద్యమాలు నిర్మిస్తామని స్పష్టం చేశారు.

‘‘రేవంత్ రెడ్డి.. ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారో.. ఎన్నికల తర్వాత ప్రతి మాటను విస్మరిస్తున్నారు. ఆ మాటలకు విలువలు ఇవ్వడం లేదు. మాదిగల మద్దతుతోనే జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, పీసీసీ చీఫ్ అయ్యానంటూ నాడు చెప్పిన ఆయన.. ఇవాళ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మాదిగలకు అన్యాయం చేశాడు. ఆయన పట్టుబడితే కచ్చితంగా ఒక సీటు వచ్చేది, మాట మీద నిలబడే వ్యక్తి కాదు, కృతజ్ఞత లేనోడు అని రుజువైంది. రాజీనామా చెయ్యకుండా పార్టీలో చేరితే రాళ్లతో కొట్టండన్న ఆయనే.. కడియం శ్రీహరిని పార్టీలో చేర్చుకున్నాడు. ఏ పార్టీలో గెలిచి ఎమ్మెల్యే అయ్యిండు.? ఏ పార్టీని కూలగొడతామని చెప్పాడు. కడియం ఎమ్మెల్యే అయ్యింది బీఆర్ఎస్ నుంచే కదా.. ఆయనకు నువ్వే కండువా కప్పావు కదా.. రాజీనామా చేయకుండా పార్టీలోకి చేర్చుకున్నది నువ్వే కదా.. రాళ్లతో కొట్టాల్సింది ఎవరిని? నిన్నా.. కడియంనా.. ? విలువల్లేని రాజకీయాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. విధానాలు లేని రాజకీయాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు’’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంద కృష్ణ మాదిగ.

Tags:
Next Story
Share it