Journalist Shankar: జర్నలిస్ట్ శంకర్‌పై హత్యాయత్నం

అనుకున్నదే అయింది. దాడి చేస్తారని ఊహించినట్లుగానే జరిగింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకొచ్చిన నాటి నుంచి రేవంత్ సర్కారు వైఫల్యాలపై వరుస కథనాలు రాస్తూ వస్తోంది.

Journalist Shankar: జర్నలిస్ట్ శంకర్‌పై హత్యాయత్నం
X

ప్రజాపాలనలో పాశవిక దాడి

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడనే అక్కసుతో..

జర్నలిస్ట్ శంకర్‌పై అరాచక మూక దాడి

రేవంత్ సర్కారు వైఫల్యాలపై నిత్యం ప్రశ్నిస్తున్న గళం

ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నాడన్న కోపంతో

గూండాలతో దాడి చేయించినట్టుగా అనుమానం!

తెలంగాణం, హైదరాబాద్ (ఫిబ్రవరి 22) : అనుకున్నదే అయింది. దాడి చేస్తారని ఊహించినట్లుగానే జరిగింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకొచ్చిన నాటి నుంచి రేవంత్ సర్కారు వైఫల్యాలపై వరుస కథనాలు రాస్తూ వస్తోంది తెలంగాణం పత్రిక/న్యూస్ లైన్ తెలుగు ఛానెల్. అడుగడుగునా ప్రశ్నిస్తూ, ప్రజాగళంగా పేరొందాడు జర్నలిస్ట్ శంకర్. రైతుబంధు దగ్గర్నించి కరెంటు కోతల దాకా.. కాళేశ్వరంపై కుట్రల నుంచి రుణమాఫీ అంశం దాకా ప్రతీదాన్ని అంశాల వారీగా ప్రశ్నిస్తూ వచ్చాడు. ప్రజల తరఫున, ప్రజాగళంగా సమస్యలు వినిపిస్తూ వచ్చాడు. అదే తన తప్పై పోయింది. ఇటీవల కొడంగల్ అభివృద్ధి కోసం రైతుల భూములను సర్వే పేర్లతో తీసుకుంటున్న వైనాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. దాంతో రేవంత్ సర్కారుకు టార్గెట్‌గా మారాడు. గురువారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సుమారు 15 మంది అల్లరి మూక ఒక్కసారిగా చుట్టుముట్టి దాడి చేశారు. మొహంపై, ఛాతిపై పిడిగుద్దులు గుద్ది, ఇటుక పెళ్లలతో దాడి చేశారు. దాంతో మొహంపై తీవ్ర గాయాలయ్యాయి. ఛాతి భాగంలో తీవ్రమైన దెబ్బలు తగలడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. జర్నలిస్ట్ శంకర్‌పై దాడి జరుగుతున్న క్రమంలో అడ్డుకోబోయిన అతని ఆఫీసు సిబ్బందిపైనా దుండగులు దాడి చేశారు. దాడి ఘటనపై వీడియో తీస్తున్న శివ అనే ఉద్యోగి ఫోన్‌ను దుండగులు పగలగొట్టారు. చుట్టుపక్కల జనం రావడంతో అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు.

అసలేం జరిగింది..!

గురువారం రాత్రి 10.30గంటల ప్రాంతంలో జర్నలిస్టు శంకర్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు. ఆఫీస్ నుంచి కారు బయల్దేరే సమయంలో అడ్డుగా ఎర్ర టీషర్టు వేసుకున్న వ్యక్తి వచ్చాడు. దీంతో కారును స్లో చేశారు. ఆ వెంటనే స్కూటీపై వచ్చిన ఇద్దరు అమ్మాయిలు శంకర్ ప్రయాణిస్తున్న కారును వెనక నుంచి ఢీ కొట్టారు. దీంతో శంకర్ కారు దిగి ఏం జరిగిందో చూసే లోపే రివర్స్‌లో శంకర్‌ను బండ బూతులు తిట్టడం మొదలు పెట్టారు. వాళ్లను సముదాయించే లోపే వాళ్ల అనుచరులను పిలిపించుకున్నారు. వచ్చినవాళ్లు సైతం అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా శంకర్‌పై మూకుమ్మడి దాడి చేశారు. రాళ్లతో విచక్షణ రహితంగా కొట్టారు. దీంతో అక్కడి నుంచి ప్రాణభయంతో ఘటనా స్థలానికి కొద్ది దూరంలోని ఓ ఇంట్లోకి శంకర్ వెళ్లాడు. ఈ సమయంలో శంకర్ కు సంబంధించిన రెండు ఫోన్లు రౌడీ గ్యాంగ్ ఎత్తుకుపోయింది.

పోలీస్ స్టేషన్‌లో శంకర్ పై రివర్స్ కేసు..?

పక్కా ప్లాన్‌తో వచ్చిన గుండాలు జర్నలిస్టు శంకర్‌పై పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు అమ్మాయిలు రివర్స్‌లో ఫిర్యాదు చేశారు. తమతో జర్నలిస్ట్ శంకర్ అసభ్యంగా ప్రవర్తించాడంటూ కంప్లైట్ ఇచ్చారు. శంకర్‌పై దాడి చేసిన మహేష్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ లో పోలీసులకు మూడు సార్లు మూడు స్టోరీలు చెప్పాడు. కేసులో భాగంగా సీన్ రీ కన్ స్ట్రక్షన్‌కు వచ్చిన పోలీసులు సైతం మహేష్ చెప్పిన దానికి ఇక్కడ జరిగిన సీన్‌కు పొంతన లేదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

దాడి వెనుక ఉన్నదెవరు..?

తెలంగాణ గొంతుగా మొదటి నుంచి ప్రశ్నించడం జర్నలిస్టు శంకర్ నైజం. దీనిలో భాగంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సైతం ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నాడు. అన్నదాతలకు రైతుబంధు రాక ఇబ్బందులు పడుతుంటే రైతు గొంతుకగా ప్రభుత్వాన్ని నిలదీశాడు. ఇంకెన్ని రోజులకు రైతుబంధు ఇస్తారు అంటూ ప్రశ్నించారు. ఎండిన పంట పొలాలు, రైతన్నల సాదకబాధలు చూపించాడు. కరెంటు కష్టాలు, తాగు నీటి బాధలు, ఆటో డ్రైవర్ల ఆవేదనలు, కాళేశ్వరంపై కుట్రలను ఇలా అన్నివర్గాల వారి బాధలను చూపించాడు. ప్రభుత్వం అమలు చేస్తామన్న పథకాల గురించి నిత్యం నిలదీస్తూనే ఉన్నాడు. ఇటీవల ఇసుక దందాలో మంత్రుల పాత్రపై వరుస కథనాలు రాశారు. రేవంత్ రెడ్డి ఫోటోలతో ఇసుక దందా, పోలీస్ స్టేషన్ నుంచి మాయమైన లారీలు మంత్రి సీతక్కవేనా..? అంటూ వరుస స్టోరీలు రాశారు. శంకర్‌పై దాడి జరిగిన రెండు రోజుల ముందు కొడంగల్ అభివృద్ధి పేరుతో రైతుల భూములను సర్వే పేర్లతో తీసుకుంటున్న వైనాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇలా వరుస కథనాలతో ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపిస్తూ ప్రజల పక్షాన ప్రశ్నించాడు. ఈ వరుస కథనాలతో అనేక మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జర్నలిస్టు శంకర్‌కు మరియు ఆఫీస్ సిబ్బందికి ఫోన్ చేసి బెదిరించారు. ‘‘మీ అంతూ చూస్తాం‘‘, ‘‘చంపుతామంటూ హెచ్చరించారు‘‘. అయినా భయపడని జర్నలిస్టు శంకర్ ప్రజా గొంతుకగా నిలిచాడు. ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడనే ఈ దాడి చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు..!

నడిరోడ్డుపై శంకర్‌పై దాడి జరిగిన సమయంలో చుట్టుపక్కల జనాలు చాలా మంది ఉన్నారు. ప్రత్యక్షసాక్షులు చెబుతున్న కథనం ప్రకారం ఇద్దరు ఆడవాళ్లు మాస్క్ పెట్టుకొని వచ్చారని, కారు వెనుక నుంచి స్కూటీతో కావాలని ఢీ కొట్టిన తర్వాత గొడవ పడ్డారని, వెంటనే 10మంది వరకు వచ్చి జర్నలిస్టు శంకర్‌ను కొట్టారని, దారుణంగా లాక్కెళ్లి మరీ ఇష్టానుసారంగా దాడి చేశారని సాక్షులు చెబుతున్నారు. దాడి చేస్తున్నవాళ్లని వీడియో తీస్తుండగా ఫోన్ పగులగొట్టి ఆ వ్యక్తిని కూడా చితకబాదారని తెలిపారు. వాళ్లను చూస్తే కావాలనే కొట్టినట్లుగా అనిపిస్తుందని చెబుతున్నారు. జరుగుతున్న గొడవను చూసి ఓ మహిళ 100 నెంబర్ కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.

Tags:
Next Story
Share it