తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు..!

రెండడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి. ఇదీ తెలంగాణ బీజేపీ పరిస్థితి. 2019 సార్వత్రిక ఎన్నికల నుంచి మునుగోడు ఉప ఎన్నిక వరకు గ్రాఫ్ రాకెట్‌లా‌ దూసుకెళ్లింది.

తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు..!
X

తెలంగాణలో గెలుపు అనివార్యమా ?

గెలువకుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా ?

టీబీజేపీలో నాయకత్వం లోపం ?

వరుసగా వెనుదిరుగుతున్న వలస నేతలు

చేరికల కంటే చీలికలతోనే ఎక్కువ నష్టం

ప్రత్యామ్నయం మేమే అనే స్థితి నుంచి

ఉనికి కోసం పోరాడే స్థితికి తెలంగాణ బీజేపీ

న్యూస్ లైన్ పొలిటికల్ డెస్క్ : రెండడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి. ఇదీ తెలంగాణ బీజేపీ పరిస్థితి. 2019 సార్వత్రిక ఎన్నికల నుంచి మునుగోడు ఉప ఎన్నిక వరకు ఆ పార్టీ గ్రాఫ్ రాకెట్‌లా‌ దూసుకెళ్లింది. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నయం మేమే అని చెప్పుకొచ్చారు ఆ పార్టీ నేతలు. తీరా ఎన్నికల ముంగిట బీజేపీ నేతల పరిస్థితి చూస్తుంటే వాళ్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గినట్టు కనిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్నా తెలంగాణలో అధికారం వైపు అడుగులేస్తామన్న ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపించడం లేదు. కేవలం హిందుత్వ ఎజెండాతో ముందుకు సాగడంతో వలస నేతల్లో పలుచనైపోయింది. దాంతో గోడకు కొట్టిన బంతిలా వచ్చిన నేతలు వచ్చినట్టే వెనక్కి మళ్లుతున్నారు. దానికి తాజా ఉదాహరణ రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు.

బీజేపీ కేంద్రంలో అధికారంలో వరుసగా రెండుసార్లు 2014, 2019 ఏ పార్టీ సహకారం లేకుండా పూర్తి మెజారిటీ సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో అంతా బాగానే ఉన్నా తెలంగాణలో మాత్రం అధికారం బీజేపీకి అందని ద్రాక్షే అన్నట్టుంది. అయితే దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో విజయం, జీహెచ్ఎంసీలో బీజేపీ అనూహ్యమైన స్థాయిలో భారీగా స్థానాలు గెలుపొందడం ఆ పార్టీ శ్రేణుల్లో ఊపు తీసుకొచ్చింది. ఇక అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమన్నట్టుగా పార్టీ నాయకత్వం నడిచింది. పెద్ద ఎత్తున చేరికలు కూడా సాగాయి. అన్ని పార్టీల నుంచి నాయకులు కమలం తీర్థం పుచ్చుకోవడం మొదలుపెట్టారు. భారీ చేరికలతో ఆ పార్టీ అధినాయకత్వం ఉబ్బితబ్బిబయ్యింది. గెలుపే ఇక మిగిలి ఉంది అనే స్థాయిలో పార్టీలో పరిస్థితి నెలకొంది. అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో అనూహ్యమైన మార్పు చోటు చేసుకుంది. గ్రూప్ పాలిటిక్స్‌తో సంజయ్‌ను తప్పించి రాష్ట్ర బాధ్యతలు కిషన్ రెడ్డికి అప్పగించింది అధిష్ఠానం. ఒకరి నాయకత్వంలో మరొకరు పని చేయకపోవడంతో కొన్ని నెలల క్రితం ఆ పార్టీ అధ్యక్ష మార్పు బీజేపీలో అనివార్యమైంది. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. టీబీజేపీలో గ్రూప్ వార్ తగ్గలేదు. దాంతో పార్టీ క్యాడర్ ‘ఎవరికీ వారే యమున తీరే’ అన్నట్టుగా పరిస్థితి మారింది.

పోరాటాల పురిటిగడ్డలో బీజేపీ ఏజెండా పని చేస్తుందా ?

పోరాటాల పురిటిగడ్డ, గంగాజమునా తెహజీబ్‌గా పిలుచుకునే తెలంగాణలో అధికారంలోకి రావాలి అంటే ఒక వర్గం ఓట్లు పడితే సాధ్యం అనుకుంటే పొరపాటే. హిందుత్వ సిద్ధాంతంతో తెలంగాణలో అధికారంలోకి సులువుగా వస్తామని కలలు కంటున్న బీజేపీకి ఇక్కడ గెలుపు అంత సులువు కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు. బీజేపీ ఎజెండాకి పూర్తి వ్యతిరేకంగా తెలంగాణలో పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ ప్రజలను ఒప్పించడం బీజేపీకి పెద్ద సవాలే. ఇప్పటిదాకా మేనిఫెస్టోలో తెలంగాణ ప్రజల కోసం ఏం చేస్తానన్నది ఆ పార్టీ చెప్పలేదు. ఎంతసేపూ ‘శవాలొస్తే మీకు, శివాలొస్తే మాకు’ అన్న మత కల్లోలాలు రేపే డైలాగులు తప్ప ప్రజల కోణంలో ఆ పార్టీ నిర్మాణం జరగలేదు.

ఈ ఎన్నికల్లో గెలిస్తేనే బీజేపీకి భవిష్యత్తు ?

తెలంగాణ లో 2023 నవంబర్30 న జరిగే సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా గెలిస్తే, లేదంటే ప్రతిపక్షంగానైనా అవతరిస్తే తప్ప తెలంగాణలో ఆ పార్టీకి ఉనికి ఉండదు. ఈ రెండు జరగకపోతే తెలంగాణలో బీజేపీకి నూకలుండవు అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీజేపీ సిద్ధాంతానికి పూర్తిగా భిన్నంగా ఉండే తెలంగాణ రాజకీయ వాతావరణం, ఆ పార్టీ నేతలకు ఇంకా వంటబట్టినట్టి లేదు. బీజేపీ సిద్ధాంతాన్ని తెలంగాణ ప్రజల మీద రుద్దుతామంటే ఇక్కడ కుదరదు. దళిత, బహుజన, ముస్లిం, క్రిస్టియన్ సమాజంతో పాటు మానవతా వాదులు, మేధావులు, రచయితలు, కవులు కళాకారులు ఆ పార్టీ ఉనికినే సహించరు. అలాంటిది తెలంగాణలో బీజేపీకి గెలుపు ఎలా సాధ్యమన్నది తేలాల్సి ఉంది. రిజల్ట్స్ తర్వాత బీజేపీ పరిస్థితి ఏంటన్నది తేలనుంది.

Tags:
Next Story
Share it