Pension: మండుటెండలో పింఛన్ కోసం పడిగాపులు

పోస్ట్ ఆఫీస్ వద్ద సరైన వసతులు లేకపోవడంతో ఎండలోనే పెన్షన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది.

Pension: మండుటెండలో పింఛన్ కోసం పడిగాపులు
X

న్యూస్ లైన్ డెస్క్: వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో ఈరోజు ఉదయం 8 గంటల నుంచే వృద్ధులు, వికలాంగులు పెద్ద మొత్తంలో పింఛన్‌ కోసం తరలివచ్చారు. పోస్ట్ ఆఫీస్ వద్ద సరైన వసతులు లేకపోవడంతో ఎండలోనే పెన్షన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. కొంతమంది ఎండవేడికి తట్టుకోలేక ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే పింఛన్ కోసం వచ్చిన ఒక వృద్ధుడు ఎండలో నిలబడి సొమ్మసిల్లి పడిపోయాడు. ఒక్క ఖానాపురం మండల కేంద్రంలోనే దాదాపు 888 మంది లబ్ధిదారులు ఉన్నారు. మండల వ్యాప్తంగా 5133 లబ్ధిదారులు ఆసరా పథకం కింద ప్రభుత్వం అందించే పెన్షన్ ద్వారా జీవనాన్ని సాగిస్తున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు కూడా పెన్షన్ కేంద్రాల వద్ద నిలువ నీడ ఏర్పాటు చేయకపోవడం, మంచినీటిని కూడా ఏర్పాటు చేయకపోవడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు వేలిముద్రలు పడక, సర్వర్ పనిచేయక.. మరోవైపు ఎండల వేడిమి తాళలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ పింఛన్లు తీసుకుంటున్నారు. ఈ సమస్యలన్నీ నిత్యం పోస్ట్ ఆఫీస్ మీదుగా వెళ్లే మండల పరిషత్, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.

Tags:
Next Story
Share it