TPCC: కాంగి"రేసు"లో సీఎం పోస్టు..!

తెలంగాణ ఎన్నికలు ముగియనే లేదు. అప్పుడే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టు, తామే సీఎం అయినట్టు చాలా మంది కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారు.

TPCC: కాంగిరేసులో సీఎం పోస్టు..!
X

సీఎం రేసులో నేనున్నానన్న జగ్గారెడ్డి

జనం ఆశీర్వదిస్తే సీఎం సీటు నాదే : మల్లు భట్టి విక్రమార్క

సీఎం కుర్చీయే నా రేసులో ఉంది : జానారెడ్డి

న్యూస్ లైన్ పొలిటికల్ డెస్క్ : తెలంగాణ ఎన్నికలు ముగియనే లేదు. అప్పుడే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టు, తామే సీఎం అయినట్టు చాలా మంది కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారు. మొన్నటికి మొన్న పెద్దలు జానారెడ్డి "సీఎం రేసులో నేనుండటం కాదు, నా రేసులోకే సీఎం కుర్చీ వస్తుంది" అని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు ప్రజాసంకల్ప యాత్రలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రజలు ఆశీర్వదిస్తే "నేనే సీఎం" అని చెప్పుకున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం "అధికారంలోకొచ్చాక, నేను సీఎం అయినంక బెల్టు షాపులు బంద్ చేపిస్తా.. నేను కాకపోతే ఇద్దరు ముగ్గురు పేర్లున్నై, వాళ్లెవరైనా.. వాళ్లతో మాట్లాడి బంద్ చేపిస్తా" అన్నారు.

ఇలా సీఎం కుర్చీపై కన్నేసిన కాంగ్రెస్ నేతల లిస్టు చాలా పెద్దదే. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం ఇవే కామెంట్స్ చేశారు. దసరా రోజున జగ్గారెడ్డి.. తాను కచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతానని వ్యాఖ్యానించారు. "ప్రజలు ఇలాగే ఆశీర్వదిస్తుంటే ఇంకో పదేళ్లకు తెలంగాణకు ముఖ్యమంత్రిని అయ్యి తీరుతా. విజయ దశమి రోజు నా మనసులోని మాటను బయటపెట్టా. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నా నోరు, చేతులు కట్టేశారు, లేకపోతే మరిన్ని విషయాలు చెప్పేవాడిని. అదృష్టం తలుపు తట్టాలే కానీ, కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి ఎవరినైనా వరించే అవకాశం ఉంది" అని అన్నారు.

ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కానీ ఈ నేతలంతా కాబోయే సీఎం నేనే అని చెప్పుకోవడంలో లాజిక్ ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారు. దీని వెనుక పెద్ద ప్లానే ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఓటమి భయం కావచ్చు. లేదంటే గెలుపు కోసం వాడే సెంటిమెంట్ అస్త్రమైనా అయ్యుండొచ్చని అంటున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో జరిగిన ఉప ఎన్నికల్లో భాగంగా డి. శ్రీనివాస్ కూడా ఇలాంటి అస్త్రాన్నే ప్రయోగించారు. "గెలిపించండి, ముఖ్యమంత్రినై తిరిగొస్తా" అన్నారు. కానీ నాటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మినారాయణను గెలిపించారు. నాగార్జున సాగర్ ఎన్నికల్లోనూ జానారెడ్డి పలుమార్లు అదే సెంటిమెంటు అస్త్రాన్ని ప్రయోగించారు. అయినా ఓటమి చవిచూశారు. మరి ఈ నేతల "నేనే సీఎం" ప్రచారాస్త్రం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో రాబోయే ఎన్నికల్లో తేలనుంది.

Tags:
Next Story
Share it