Editor's Column: హంతకుడే సంతాప సభ పెట్టాడట..!

తమ ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటోంది.

Editors Column: హంతకుడే సంతాప సభ పెట్టాడట..!
X

“ఒక నక్క ప్రమాణస్వీకారం చేసిందట ఇంకెవరినీ వంచించనని..” “ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట... తోటి జంతువుల్ని సంహరించినందుకు..” అని అప్పుడెప్పుడో అలిశెట్టి ప్రభాకర్ తన అక్షరాయుధాలు సంధించారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అలాగే ఉన్నాయి. ఒకనాడు అడవి బిడ్డలపై బుల్లెట్ల వర్షం కురిపించిన పార్టీ.. ఇప్పుడు అదే బిడ్డలకు అండగా ఉన్నామని చెప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. తమ ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటోంది. ఎన్నిక ఏదైనా సరే.. వారి ప్రచారానికి ఆనాడు రక్తపుటేరులు పారిన ఇంద్రవెల్లి వేదిక కావడం విస్మయం కలిగిస్తోంది.

ఇంద్రవెల్లిలో ఒకనాడు రక్తపుటేరులు పారాయి. భూమి మీద హక్కు అడిగినందుకు.. అడవి బిడ్డలను పిట్టల్లా కాల్చి చంపారు. పిల్లా జెల్లా అని చూడకుండా విచక్షణారహింతా కాల్పులు జరిపారు. ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా గిరిపుత్రులు పరుగులు పెట్టారు. బుల్లెట్లు తగిలి కొందరు, పరుగెడుతూ కిందపడి మరికొందరు జీవితాంతం గాయాలను తమ శరీరంపైనే కాదు.. గుండెలపైనా మోశారు. ఇప్పటికీ మోస్తూనే ఉన్నారు. కాల్చింది పోలీసులే అయినా ఆదేశాలు ఇచ్చింది మాత్రం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం.

1981 ఏప్రిల్‌ 20న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు అటవీప్రాంతంలోని ఇంద్రవెల్లిలో గోండులపై మారణకాండ జరిగింది. సంత జరుగుతుండటంతో పెద్ద సంఖ్యలో ఆదివాసీలు సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చారు. ఆదివాసీల హక్కుల కోసం అదే రోజు సభ నిర్వహించేందుకు గిరిజన రైతుకూలీ సంఘం బహిరంగ సభకు పిలుపునిచ్చింది. సభకు మొదట అనుమతి ఇచ్చిన పోలీసులు.. చివరిక్షణంలో రద్దు చేశారు. అప్పటికే వేలాదిగా అడవి బిడ్డలు ఇంద్రవెల్లి చేరుకున్నారు. ప్రజలను నియంత్రించాల్సిపోయి వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఏం జరుగుతోందో తెలిసేలోపే చాలామంది శరీరాల్లోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ 60 మంది దాకా మరణించారని స్థానికులు చెబుతుంటారు. మరో 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఒక ఇంగ్లీష్ రిపోర్టర్ అయితే ఏకంగా 250 మంది చనిపోయారని సంచలన కథనాన్ని రాసిర్రు ఆ రోజుల్లో.

ఈ ఘటనను స్వతంత్ర భారతదేశంపు జలియన్ వాలాబాగ్ గా ఆనాటి ప్రజాహక్కుల సంఘాలు గొంతెత్తాయి. దివంగత ప్రజాయుద్ధనౌక గద్దర్.. ఆనాడు ఈ ఘటనకు వ్యతిరేకంగా గళమెత్తారు. కాంగ్రెస్ సర్కారు తీరుకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అనేక వేదికలపై ఇంద్రవెల్లి మారణహోమాన్ని వర్ణిస్తూ తన పాటలతో గుండెల్ని బరువెక్కించారు. ఇప్పుడు అదే ఇంద్రవెల్లిని, అదే ప్రజాయుద్ధనౌక గద్దర్ పేరును వాడుకుని కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది. చరిత్ర మరిచిపోలేని తప్పు చేసి ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చూస్తోంది. ఇది “హంతకులే సంతాపసభ పెట్టడం” కాకుంటే ఇంకేంటి.?

Tags:
Next Story
Share it