TS Assembly: సీఎం రేవంత్ వర్సెస్ అక్బర్

సీఎం రేవంత్ రెడ్డి విమర్శలపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ తీవ్రస్థాయిలో స్పందించారు.

TS Assembly: సీఎం రేవంత్ వర్సెస్ అక్బర్
X

మాటల తూటాలు పేల్చిన అక్బరుద్దీన్

రేవంత్ రెడ్డిపై అక్బర్ ఫైర్

బీజేపీకి ముడిపెడుతూ మాట్లాడటంపై ఆగ్రహం

పాతబస్తీలో కరెంట్ బకాయిలనడంపై నిలదీత

అవసరానికో పార్టీతో పొత్తు అనడంపైనా స్ట్రాంగ్ కౌంటర్

ముస్లింలకు 4% రిజర్వేషన్లపైనా

సీఎం రేవంత్ వ్యాఖ్యలకు దీటుగా సమాధానం

తెలంగాణం, పొలిటికల్ డెస్క్: విద్యుత్ శ్వేతపత్రం‌పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎంగా మాటల యుద్ధం నడిచింది. సీఎం రేవంత్ రెడ్డి విమర్శలపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ తీవ్రస్థాయిలో స్పందించారు. సీఎం ఆరోపణలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో విద్యుత్‌పై చర్చ కాస్త ఇరుపక్షాల వాగ్యుద్దానికి దారితీసింది. ముస్లింల గొంతుకగా తమ పోరాటం అలుపెరుగనిదని స్పష్టం చేశారు అక్బర్. వారి అభివృద్ధికి కట్టుబడిన పార్టీగా తమది వేలెత్తి చూపలేని ప్రస్థానమని సూటిగా చెప్పారు. అధికార, ప్రతిపక్షాలు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు మారుతుంటారని, కానీ తామెప్పుడూ ఒకేస్థానంలో ఉన్నామని, అధికారంలో ఎవరున్నా ప్రతిపక్షంగా తమ గొంతు వినిపించామని అక్బర్ అన్నారు.

బీఆర్ఎస్‌తో మైత్రి ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, మజ్లిస్ పార్టీలు కలిసి పని చేశాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్‌ అర్బన్‌లో షబ్బీర్ అలీని, జూబ్లీహిల్స్‌లో అజారుద్దీన్‌ను ఓడించేందుకు కేసీఆర్‌తో కలిసి మజ్లిస్ పని చేసిందని విమర్శించారు. దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అక్బరుద్దీన్. తాము ఎక్కడ పోటీ చేయాలన్నది తమ పార్టీ నిర్ణయమని, అది తమ ఇష్టమని స్పష్టం చేశారు. షబ్బీర్ అలీని ఓడించేందుకు ప్రయత్నించామని చెబుతున్నారని, తాము నిజామాబాద్ అర్బన్‌లో పోటీయే చేయలేదన్నారు.

ఇక విద్యుత్ బకాయిలపై సీఎం రేవంత్ మాట్లాడుతూ హైదరాబాద్ సౌత్‌లో బకాయిలు ఉన్నాయంటూ పరోక్షంగా అక్బరుద్దీన్‌ వైపు వేలెత్తి చూపారు. దీనిపై అక్బర్ ఘాటుగా స్పందించారు. విద్యుత్ బకాయిల గురించి మాట్లాడుతున్నారో, విద్యుత్ చౌర్యం గురించి మాట్లాడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పాత బస్తీలో కరెంట్ సరిగ్గా లేదని, ఓల్డ్ సిటీ నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్వేతపత్రం తప్పుల తడక అని విమర్శించారు. అప్పులు చేయకుండా, ఛార్జీలు పెంచకుండా కాంగ్రెస్ సర్కార్ ఉచిత కరెంట్ ఎలా ఇస్తుందో చెప్పాలని నిలదీశారు.

నాదెండ్ల భాస్కర్‌ రావుతో, ఎన్టీఆర్‌తో, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌తో ఇలా అందరితో ఎంఐఎం పొత్తుపెట్టుకుందన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. నాదెండ్ల భాస్కర్ రావు పక్షాన నిలిచింది ముస్లింల విద్యాభివృద్ధి కోసమేనన్నారు. అంతేగాక ఎవరితో కలిసి నడిచినా మైనార్టీల సంక్షేమం కోసమేనని తేల్చి చెప్పారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. ఆ క్రెడిట్ రాజశేఖర్ రెడ్డికి, తమకు మాత్రమే దక్కుతుందన్నారు. బీజేపీకి తమ బీటీమ్‌గా చెప్పడాన్ని ఖండించారు. ముస్లింల గొంతుకగా తాము ఇక్కడ నిల్చున్నామని, తమను సహించే స్థితిలో కాంగ్రెస్ సర్కార్ లేదని విమర్శించారు. తాము ఎవరికీ భయపడమని, కిరణ్ కుమార్ రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదన్నారు. కాంగ్రెస్ తమను అణచివేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

Tags:
Next Story
Share it