Cm Revanth reddy: ఒట్లకు ఓట్లు పడ్తయా?

‘‘పెద్దమ్మతల్లి సాక్షిగా చెబుతున్నా .. ఆగస్ట్ 15లోగా రైతులకు రుణమాఫీ చేస్తా’’ ఇది తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన.

Cm Revanth reddy: ఒట్లకు ఓట్లు పడ్తయా?
X

రేవంత్ రెడ్డి తారకమంత్రం

ఊరికో దేవుడిపై ఒట్టు

ఓట్ల కోసం నయా ప్లాన్

ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా..

ఒట్టును వదిలిపెట్టని సీఎం

హైలెట్ బాక్స్: ‘ఒట్టేసి ఒక మాట.. వేయకుండా ఒక మాట చెప్పనమ్మా!’ అంటాడు ఓ సినీ హీరో. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే స్టయిల్లో స్పీచ్‌లు దంచికొడుతున్నారు. రైతు రుణమాఫీపై ఒట్ల మీద ఒట్లు వేస్తున్నారు. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయంలో విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి.. ఎంపీ ఎన్నికలపై దాని ప్రభావం పడకుండా చేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఒట్టు వేయకుండా రేవంత్ రెడ్డి ప్రసంగం ముగించలేని పరిస్థితి నెలకొంది నేడు. ఊరికో దైవం పేరు చెప్పుకుంటూ ఆ దేవత సాక్షిగా ఒట్టేసి మరీ రైతు రుణమాఫీపై హామీ ఇస్తున్నారు. తనపై ప్రజల్లో నమ్మకం ఎలాగో పోయిందని.. ఇక దేవుడిపైన అయినా ఒట్టేసి చెబితే ప్లాన్ వర్కవుట్ అవుతుందనే ఆలోచనల్లో రేవంత్ ఉన్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఒట్టేసి చెబుతున్నా అంటూ రేవంత్ రెడ్డి నయా డ్రామా షురూ చేశారని ఎద్దేవా చేస్తున్నారు.

తెలంగాణం, పొలిటికల్ డెస్క్: ‘‘పెద్దమ్మతల్లి సాక్షిగా చెబుతున్నా .. ఆగస్ట్ 15లోగా రైతులకు రుణమాఫీ చేస్తా’’ ఇది తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి సాక్షిగా మాట ఇస్తున్నానని మరోసారి ఒట్టేశారు. కాంగ్రెస్ హామీలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఒట్టు కాన్సెప్ట్‌ను ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. ఏ ఊరికి వెళ్లినా ఊరి దైవం సాక్షిగా ఒట్టు వేసి మరీ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క ముంచుకొస్తున్న లోక్‌సభ ఎన్నికలు.. మరోపక్క తన పదవికి గండం లేకుండా చేసుకోవాలనే తాపత్రయం.. వెరసీ రేవంత్ రెడ్డిని టెన్షన్‌లోకి నెట్టేశాయి. దీంతో దేవుళ్లపై ఒట్టేసి రుణమాఫీ చేస్తానంటున్నారు. దేవుళ్లపై ఆయన చేస్తున్న ప్రమాణాలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ నెల 19న మహబూబా బాద్ పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డి భద్రాద్రి రాముడిపై ఒట్టేసి ఆగస్ట్ 15 లోపు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని, రూ.500 బోనస్‌తో వడ్లు కొంటామని చెప్పారు. 20న మెదక్ పర్యటనలో మెదక్ చర్చ్, ఏడుపాయల దుర్గమ్మపై, ఈ నెల 21న భువనగిరిలో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిపై, 24న వరంగల్‌లో మేడారం సమ్మక్క, సారలమ్మ, రామప్ప, వేయిస్థంభాల గుడి సాక్షిగా ప్రమాణాలు చేశారు. ఇలా ఏ ఊరికి వెళితే ఆ ఊరిలో ఒట్టేసి చెబుతున్నారు. రైతులను నమ్మించడానికి అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ప్రమాణాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు తీవ్రంగానే విమర్శిస్తున్నారు. దేవుడిపై ఒట్టు పెట్టడం కాదని, కుటుంబ సభ్యులపై ఒట్టేసి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం వారి మాటలను పట్టించుకోకుండా తన దారిలో తాను వెళ్లిపోతున్నారు. దేవుళ్ల సాక్షిగా అన్నదాతలకు హామీ ఇస్తున్నానని, ఆగస్ట్-15లోపు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ అమలు చేసి తీరతానంటున్నారు.

లోక్ సభ ఎన్నికల్లో గెలుపు రేవంత్ రెడ్డికి కీలకం కావడంతో ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. జనజాతర సభల్లో ప్రతిపక్షాలపై మాటల దాడి చేయడమే కాక, రైతురుణమాఫీ అంశాన్ని పెద్ద ఎత్తున తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈసారి తమకు ఓట్లు రాల్చే అంశంగా దాన్నే ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన దేవుళ్లపై ప్రమాణాలు చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు చూస్తున్నారు. సర్వేలలో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొనడంతో ఆయన రుణమాఫీ అంశాన్ని నినాదంగా మార్చేశారు. అదే ఆయుధంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ని ప్రతిపక్ష బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుండగా.. ఇప్పటికే చాలా చేశామని, రుణమాఫీ లాంటివి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఆలస్యమయ్యాయని కాంగ్రెస్ వాదిస్తోంది. ఈ క్రమంలో హరీష్ రావు, రేవంత్ రెడ్డి మధ్య సవాళ్ల యుద్ధం కూడా నడుస్తున్న విషయం తెలిసిందే. ఒట్టు అనే దాన్ని తారకమంత్రంగా రేవంత్ రెడ్డి ఓట్ల కోసం వినియోగిస్తున్నారు. అయితే ఎంతవరకు ఓట్లు రాలుస్తాయో చూడాలి మరి.!

Tags:
Next Story
Share it