Political Polls: దక్షిణ తెలంగాణలో ఎవరిది పైచేయి?

ఉత్తర తెలంగాణతో పోల్చుకుంటే దక్షిణ తెలంగాణ కాస్త భిన్నమైనది. భౌగోళికంగా, సామాజికంగా నెలకొన్న పరిస్థితులు రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి

Political Polls: దక్షిణ తెలంగాణలో ఎవరిది పైచేయి?
X

కాంగ్రెస్‌కు రుణమాఫీ ప్రకటన కలిసొస్తుందా?

మహబూబ్ నగర్‌‌ను రేవంత్ గెలిపించుకుంటాడా?

కేసీఆర్ పర్యటనలతో వచ్చిన మార్పు ఏంటి?

బీఆర్ఎస్ పార్టీ విజయానికి బాటలు వేసిందా?

నాగర్ కర్నూల్‌లో ఆర్ఎస్‌పీ మేజిక్ చేస్తారా?

బీజేపీ పొజిషన్ ఏంటి?

రైతులు, మహిళలు ఎటువైపు చూస్తున్నారు?

న్యూస్ లైన్ తెలుగు/తెలంగాణం స్పెషల్ రిపోర్ట్

హైలెట్ బాక్స్: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ తెలంగాణమంతా కాంగ్రెస్ గాలి వీచిన విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మొదలుపెడితే కింద ఉమ్మడి మహబూబ్ నగర్ వరకు ఒక్క హైదరాబాద్ తప్ప మిగిలిన జిల్లాల్లో స్పష్టమైన మెజార్టీ హస్తం పార్టీ సాధించింది. అయితే ఈ జోరు నేటి పార్లమెంట్ ఎన్నికల్లో కనబడుతుందా? అన్నదానికి సమాధానమే ఈ కథనం. తాజాగా వెలువడుతున్న సర్వేలు చెబుతున్నది ఎంత వరకు నిజం? జనం నాడు మార్పు కోరి ఓట్లు వేయగా.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఏం అనుకుంటున్నారు? రేవంత్ సర్కార్ పాలనపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? పొలంబాట, బస్సు యాత్ర, రోడ్ షోలతో నియోజకవర్గాల్లో పర్యటించిన కేసీఆర్ ప్రభావం ఏమేరకు ఉండనుంది? నీళ్ల కొరత, కరెంట్ కోతలతో రైతులు పడుతున్న బాధలు ఏమేరకు ఓటింగ్‌ను ప్రభావితం చేయనున్నాయి? కాంగ్రెస్, బీఆర్ఎస్ పోరులో బీజేపీ ఉనికిలో అసలు ఉంటుందా? బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకోనుంది.? ఉత్తర తెలంగాణలో చూపించినట్టుగా దక్షిణ తెలంగాణలో కమలం పార్టీ ప్రభావం చూపగలదా? ఏ పార్టీకి ఓటర్లు షాక్ ఇవ్వనున్నారు? తదితర అంశాలన్నిటిపై మా న్యూస్ లైన్ తెలుగు/తెలంగాణం పత్రిక నిర్వహించిన అధ్యయనంలో ఏం తేలిందన్న దానిపై మేము సేకరించిన సమాచారాన్ని లోతైన విశ్లేషణతో మీ ముందు పెడుతున్నాం.

తెలంగాణం, పొలిటికల్ డెస్క్: ఉత్తర తెలంగాణతో పోల్చుకుంటే దక్షిణ తెలంగాణ కాస్త భిన్నమైనది. భౌగోళికంగా, సామాజికంగా నెలకొన్న పరిస్థితులు రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇది జనాలకు మరింత అవగాహనకు కూడా వచ్చింది. తాజా పరిస్థితుల్లో ఇక్కడి రాజకీయ వాతావరణంలో నాటికి నేటికీ చాలా మార్పులు వచ్చాయి. పొలిటికల్ సినారియో పూర్తిగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంత ఈజీగా కాంగ్రెస్‌కు పరిస్థితులు లేవన్నది మా విశ్లేషణల్లో తేలింది. రైతుల కష్టాలు, కరెంట్ కోతలు, గ్రామాల్లో కాంగ్రెస్ నాయకుల అరాచకం తదితర అంశాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గ్రౌండ్‌లో కాంగ్రెస్ పరిస్థితి కష్టంగానే ఉంది. మొత్తం దక్షిణ తెలంగాణలో ఒకటి, రెండు చోట్ల తప్ప పెద్దగా ప్రభావం చూపకపోవచ్చనే స్పష్టమవుతుంది. కొన్ని చోట్ల బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీలో కాంగ్రెస్ మూడోస్థానానికి లేదా ప్రేక్షక పాత్రకు పరిమితం అయ్యేలా ఉంది.

వరంగల్ : ఇక్కడ కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్, బీజేపీ నుంచి ఆరూరి రమేశ్ బరిలో ఉన్నారు. వీరిలో పోటీ బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధానంగా కనపడుతుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, తన ఎమ్మెల్యేలు, మంత్రులతో విస్తృత ప్రచారం చేయించినా.. పోటీ మాత్రం ఆ రెండు పార్టీలదేనంటున్నారు స్థానికులు. బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, బీఆర్ఎస్ అభ్యర్థిగా టికెట్ దక్కించుకుని, చివరి క్షణంలో పార్టీ మారడం ఆయన కుమార్తె కావ్యకు మైనస్‌గా మారాయన్న టాక్ వినపడుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్‌పై ఉద్యమ నాయకుడన్న సానుభూతి ఉండగా, కేసీఆర్‌పై ఉన్న అభిమానం కలిసి వస్తుందంటున్నారు. ఆరూరి రమేశ్‌పై ఆధిక్యత కనబర్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

మహబూబాబాద్: ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ కూడా పోటీ ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, బీజేపీ నుంచి సీతారామ్ నాయక్ ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత బలరామ్ నాయక్ పోటీ పడుతున్నారు. గత రెండు దఫాలుగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు అవకాశం కల్పించారు. అయితే ఈసారి మాత్రం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. మాలోత్ కవితకు అన్నీ కలిసి వస్తే మరోసారి పార్లమెంట్‌లో అడుగు పెట్టే అవకాశం ఉంది.

నల్లగొండ: రావి నారాయణ రెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం లాంటి మహామహులు ప్రాతినిథ్యం వహించిన స్థానం ఇది. ఒకనాటి కమ్యునిస్టుల కంచుకోట కాంగ్రెస్ పార్టీకి బలమైన స్థానంగా మారింది. ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించి ఎంపీ అయ్యారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కంచకర్ల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘవీర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు అనుకూలతలు ఎక్కువగా ఉన్నా.. బీఆర్ఎస్ పార్టీకి అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా రైతుల్లో నెలకొన్న అసంతృప్తి తమకు కలిసి వస్తుందని కారు పార్టీ భావిస్తోంది. అలాగే కేసీఆర్ నిర్వహించిన పొలంబాట, రోడ్ షోలు తమకు అనుకూలమైన పరిస్థితులను తీసుకు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు.

భువనగిరి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తమదైన ప్రభావం చూపే కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో ఇక్కడ గెలుపు ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండగా, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్, బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్ పోటీ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆత్మీయుడైన ఉన్న చామల గెలుపును కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇక బీసీ కార్డుతో బలమైన పోటీ ఇస్తోంది బీఆర్ఎస్. ఒక పక్కన అగ్రనేతల ప్రచారంతో పాటు.. క్యామ మల్లేష్ ఆత్మీయ సమ్మేళనాలు విజయవకాశాలను మెరుగుపరుస్తున్నాయన్న టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే, బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ మాత్రం ప్రధాని మోడీ ఛరిష్మా, కేంద్రం పథకాలను మాత్రమే నమ్ముకున్నారు.

ఖమ్మం: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గెలుపు నల్లేరుపై నడక అనేలా మాట్లాడుకునే ఏకైక స్థానం ఇది. ఇక్కడి నుంచి పోటీ చేయడానికి హస్తం పార్టీలో చాలామంది ఉత్సాహం చూపిన విషయం తెలిసిందే. అయితే అధిష్ఠానం చివరి నిమిషంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురామ్ రెడ్డికి టికెట్ కేటాయించింది. ఇక్కడ ఆయన గెలుపు ఈజీ అన్న టాక్ వినపడుతోంది. కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకు ఉండటంతో పాటు, పార్టీలో కీలక నేత అయిన పొంగులేటికి అభ్యర్థి గెలుపును భుజస్కంధాలపై వేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఖమ్మం కోట కాంగ్రెస్ కంచుకోట అని చమత్కరిస్తున్నారు ఆ పార్టీ నేతలు.

మహబూబ్ నగర్: సీఎం రేవంత్ రెడ్డి ఈ స్థానంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇక్కడ గెలుపును తన గెలుపుగా ఆయన భావిస్తున్నారు. తమ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలని ఏ నియోజకవర్గానికి కేటాయించనంత సమయాన్ని కేటాయించారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ దీనిలో అసెంబ్లీ సెగ్మెంట్ కావడంతో భారీగా నిధులు ప్రకటించారు. అవకాశం దొరికినప్పుడల్లా మహబూబ్ నగర్‌లో పర్యటించి వంశీచంద్ గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నించారు. అయితే పోటీ మాత్రం ప్రధానంగా బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మధ్య ఉంది. స్థానిక ఓటర్లు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా పోటీని చూస్తున్నారని స్పష్టం అయ్యింది. ఈ రసవత్తర పోరులో కమలం పార్టీ, కారు పార్టీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. విజేత కోసం చివరి నిమిషం వరకు వేచి చూడాల్సి వస్తుంది.

నాగర్ కర్నూల్: ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. బీఆర్ఎస్ అభ్యర్థిగా రిటైర్డ్ ఐపీఎస్, గురుకులాలను అత్యున్నతంగా తీర్చిదిద్దిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో ఉండటంతో అందరిలో ప్రత్యేకమైన ఆసక్తి ఈ స్థానంపై నెలకొంది. పలువురు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతుండటం విశేషం. కులాలు, మతాలకు అతీతంగా ఆయన క్యాంపెయిన్‌లో జనం పాల్గొంటున్నారు. దీంతో ఆయన గెలుపు ఖాయమనే టాక్ వినపడుతోంది. ఇక్కడ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు రవి ఉండగా, బీజేపీ నుంచి భరత్ ప్రసాద్ ఉన్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల పోటీ నామమాత్రమే కానుంది. వార్ వన్ సైడ్ అయ్యిందన్నది ఇక్కడి ఓటర్ల మనోగతం.

Tags:
Next Story
Share it