జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని తక్షణమే కేంద్రం ఆర్థిక సాయం చేయాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరుతూ లేఖ రాస్తానని రేవంత్ వెల్లడించారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో పెరుగుతున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష సమావేశానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
అన్ని జిల్లాల కలెక్టరేట్లలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు జరిగిన నష్టంపై అధికారులు స్పందించాలని అన్నారు. వరదనష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదికఇవ్వాలని రేవంత్ సూచించారు. అత్యవసర సేవల కోసం పోలీస్ బెటాలియన్లకు.. ఎన్‌డీఆర్‌ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు.
జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని తక్షణమే కేంద్రం ఆర్థిక సాయం చేయాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరుతూ లేఖ రాస్తానని రేవంత్ వెల్లడించారు. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు పరిహారం పెంచాలని రేవంత్ రెడ్డి అన్నారు.
వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు ఆర్ధిక సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లలకు తక్షణ సాయం కోసం రూ.5 కోట్ల నిధులను రేవంత్ రెడ్డి విడుదల చేశారు.