పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రజలు గుర్రుగా ఉన్నారు. పాలన పగ్గాలు చేపట్టి రెండేళ్లు దాటినా.. ఇంకా అడ్మినిష్ట్రేషన్ పై సరైనా పట్టు సాధించలేకపోయారు. నిర్మించాల్సిన ప్రభుత్వం కూలగొడుతుండడంతో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కూల్చివేతల్లో ప్రజాస్వామ్య దారి మరిచిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వ్యతిరేకతను ఎందుకు గుర్తించలేకపోతున్నారని గాంధీ వర్గాల్లో చర్చిస్తున్నారు. అదే ప్రభుత్వానికి మైనస్ గా మారుతోందా..?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ప్రస్తుతం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. చెరువుల పరిరక్షణ, మూసీ పునరుజ్జీవం వంటి ఉన్నత లక్ష్యాలతో మొదలైన ఈ ప్రస్థానం, క్షేత్రస్థాయిలో అమలు తీరు, ప్రతిపక్షాల వ్యూహాలతో ప్రభుత్వానికి ప్రతికూలంగా మారుతోందని గాంధీభవన్ లో చర్చ నడుస్తోంది. రాష్ట్రంలోని ప్రతిపక్షాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి విమర్శలు రావడం సంచలనంగా మారింది.
ప్రభుత్వం తొలుత హైడ్రాతో హైదరాబాద్ లోని చెరువుల ఆక్రమణలను తొలగించి ప్రజల ప్రశంసలు పొందింది. అయితే.. ఆ తర్వాత విమర్శలు ఎదుర్కొంది. అదే సమయంలో బఫర్ జోన్ లో ఉన్న పేదల పలు ఇళ్లను కూల్చివేసింది. దాంతో తిరుగులేని విమర్శలు అందుకుంది. అయినా.. సరే వెనక్కి తగ్గకుండా కూల్చివేతలకే ప్రాధాన్యత ఇచ్చింది. ఇటీవల ఖమ్మం జిల్లాలో ఆక్రమణల తొలగింపు, ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం చేపడతారని ప్రచారం జరుగుతున్న కూల్చివేతలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించడం చట్టబద్దమే అయినప్పటికీ, బాధితుల ఆవేదనను ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమవుతున్నాయి. పేదల ఇళ్లను కూల్చుతున్నారు అనే ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లడం కాంగ్రెస్ వ్యూహాత్మక లోపంగా కనిపిస్తోంది.
ఏ ప్రభుత్వానికైనా ఆక్రమణల తొలగింపు అనేది కత్తిమీద సాము వంటిది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం చెబుతుంది. మానవీయ కోణాన్ని విస్మరించడంతో సామాన్యుల్లో అభద్రతా భావం పెరుగుతోంది. ముఖ్యంగా మధ్య తరగతి, పేద వర్గాల ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నారనే భావన ఉంది. అది దీర్ఘకాలంలో ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతోంది. ఖమ్మంలోనూ, హైదరాబాద్ మూసీ తీరంలోనూ బాధితుల నిరసనలు ఉధృతం కావడం, వారికి ప్రతిపక్ష నేతలు అండగా నిలవడం ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. దీనిని ప్రతిపక్షాలు క్యాష్ చేసుకుంటున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.. ప్రజలకు అండగా ఉండి బలపడేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రతిపక్షాలు.
ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నది అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్లుగా ఉంది. అంటే, ప్రభుత్వం చేస్తున్న పనికంటే దానిపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారమే ఎక్కువగా వినిపిస్తోంది. ప్రభుత్వం తన ఉద్దేశాలను ప్రజలకు స్పష్టంగా వివరించడంలో వెనకబడిందనేది రాజకీయ వర్గాల అభిప్రాయం. అదే సమయంలో వారు చేస్తున్నది కూడా రియల్ ఎస్టేట్ కోసమే అంటూ విమర్శలు ప్రతిపక్షాలు జనాల్లోకి తీసుకెళ్లేందుకు ముందుంటున్నారు. కూల్చివేతలకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేది. అందులో భాగంగా పునరావాస ప్యాకేజీలను ప్రకటించి, ప్రజలతో మమేకమైన ఉంటే వ్యతిరేకత తగ్గేది. ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశం లేకుండా పోయేది అన్నది గాంధీ భవన్ వర్గాల వాదన. కానీ, యంత్రాలతో నేరుగా రంగంలోకి దిగడంతో ప్రతిపక్షాలకు ప్రభుత్వం అస్త్రాలను అందించినట్లయిందని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం యంత్రాంగం, రాజకీయ విభాగం మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అధికారులు కేవలం నిబంధనల ప్రకారమే వెళ్తారు. కానీ, రాజకీయ నేతలు ప్రజల నాడిని పట్టుకోవాలి. మూసీ ప్రాజెక్ట్ తో కలిగే ప్రయోజనాలను వివరించడం కంటే, కూల్చివేతల వార్తలే ఎక్కువగా హైలైట్ కావడం వెనక ప్రభుత్వ వైఫల్యం ఉందని రాజకీయా వర్గాలు భావిస్తున్నాయి.
కూల్చివేతలు చేస్తున్న ప్రతీసారి బాధితుల పక్షాన నిలబడుతోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. రేవంత్ సర్కార్ పేదల ఇళ్లను కూలుస్తున్నా రాహుల్ గాంధీ మౌనంగా ఉండడంపై విమర్శలు చేస్తున్నారు. కూల్చివేతలు జరిగిన ప్రతిసారీ దాని వెనకాల ఉన్న అంతర్యాన్ని ప్రజల ముందు పెడుతోంది కారు పార్టీ. దీంతో కాంగ్రెస్ పార్టీ గుక్కతిప్పుకోలేకుండా చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో సొంత పార్టీలోనూ విమర్శలు వస్తున్నాయి.
ముందు ముందు కీలక ప్రాజెక్టులు చేపట్టాలంటే ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చిుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు పొలిటికల్ ఎనాలిస్ట్ లు. కేవలం కూల్చివేతలు అనే ముద్ర పడకుండా, పునర్మిర్మాణం, సుందరీకరణ అనే సానుకూల అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పుకుంటున్నారు. బాధితులకు ఇచ్చే పరిహారం ఇవ్వడంతో పాటు వారిని ఒప్పించడం మంచి శ్రేయస్కరం అంటున్నారు. లేని పక్షంలో, ఈ కూల్చివేతల వ్యతిరేక ప్రచారం కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ రాజకీయ మూల్యాన్ని మిగిల్చే ప్రమాదం ఉంది.