రుణమాఫీపై తలపెట్టిన వరంగల్ కృతజ్ఞత సభలో ఆయన పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
న్యూస్ లైన్ డెస్క్: ఓవైపు రాజీవ్ గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహాల వివాదం నడుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నెల 24న తెలంగాణలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పర్యటించాల్సి ఉంది. రుణమాఫీపై తలపెట్టిన వరంగల్ కృతజ్ఞత సభలో ఆయన పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఇప్పటికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.
రైతులు ఆగ్రహంతో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవ యాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తెలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మరో 3 రోజుల్లో జరగవలసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది.
మరోవైపు వరంగల్‌లో జరగాల్సిన సభను రాహుల్ కారణంగా ఇప్పటికే రెండు సార్లు రద్దు చేశారు. మొదట తొలి విడత రుణమాఫీ నిధులను విడుదల చేసినప్పుడు జులైలో రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్‌లో సభ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అప్పుడు రద్దు కావడంతో ఆగస్ట్ 15 అన్నారు చివరికి ఆగస్ట్ 24 అన్నారు. అయితే, ఈ సారి కూడా రాహుల్ తెలంగాణకు వచ్చే అవకాశం లేనట్లే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీ అగ్రనేతలను ఈ సభకు ఆహ్వానించేందుకు ఇప్పటికే రేవంత్ రెడ్డి రెండు సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చినప్పటికీ ఏం లాభం లేకుండా పోయింది. ఈ రెండు సార్లూ హైకమాండ్ ఆయనకు మొండిచేయి చూపించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఆయనకు సోనియమ్మ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సారి రాహుల్ గాంధీ హ్యాండ్ ఇస్తున్నందుకు రేవంత్ ఏం సాకు చెప్పబోతున్నారో చూడాలి.