ఇళ్లను కూల్చవద్దని కాళ్ల మీద పడ్డా వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడే ప్రభుత్వం తమకు పట్టాలు ఇచ్చిందని చెబుతున్నా వినిపించుకోకుండా తమ ఇళ్లను కూల్చేశారని వెల్లడించారు.
న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే జిల్లాల్లో కూడా హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. అయితే, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లి సమీపంలోని ఆదర్శనగర్‌లో ఇళ్లను గురువారం తెల్లవారుజామున కూల్చేశారు.
రాత్రి రెండు నుంచి మూడు గంటల సమయంలో హఠాత్తుగా బుల్డోజర్లు తీసుకొని వచ్చిన అధికారులు.. తమ ఇళ్లను కూల్చేశారని బాధితులు వాపోతున్నారు. ఇళ్లను కూల్చవద్దని కాళ్ల మీద పడ్డా వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడే ప్రభుత్వం తమకు పట్టాలు ఇచ్చిందని చెబుతున్నా వినిపించుకోకుండా తమ ఇళ్లను కూల్చేశారని వెల్లడించారు.
అయితే, అధికారులు తమ ఇళ్లను కూల్చేయడంతో చేసేదేమీ లేక.. ఇళ్లు కూల్చేసిన స్థలంలోనే టెంట్లు వేసుకొని ఉంటున్నారు. ఉన్నపళంగా ఇళ్లను కూల్చేస్తే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. ఇళ్లు లేక పోవడంతో పిల్లాజెల్లా రోడ్డునపడ్డామని వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే టెంట్లు వేసుకొని నివసిస్తున్న వారికి BRS నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టిఫిన్లు అందించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. దీంతో అక్కడికి చేరుకున్న BRS కార్యకర్తలు ఇళ్లు కోల్పోయిన వారికి టిఫిన్లు అందించారు.