ఆయన పుట్టినరోజునే "రథ సప్తమి"గా జరుపుకుంటారు. దీన్నే సూర్య జయంతి, అచల సప్తమి, విధాన సప్తమి అనే పేర్లతోనూ పిలుస్తారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే సప్తమి తిథిని "రథ సప్తమి"గా వ్యవహారిస్తారు. ముఖ్యంగా ఈ పర్వదినాన సూర్యుడు ఏడు గుర్రాలపై దక్షిణాయనం నుంచి ఉత్తరాయనం వైపు ప్రయాణం సాగిస్తాడు. అందుకే ఈ నెల నుంచి ఆరు నెలలు మంచి రోజులని అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలమని చెబుతారు. రథసప్తమి పూజలు కంటే రథసప్తమి స్నానం గొప్పదంటారు పెద్దలు.
హిందూ పురాణాల ప్రకారం, కశ్యప మహర్షి, అదితి దేవి దంపతులకు సూర్య భగవానుడు జన్మించాడు. ఆయన పుట్టినరోజునే "రథ సప్తమి"గా జరుపుకుంటారు. దీన్నే సూర్య జయంతి, అచల సప్తమి, విధాన సప్తమి అనే పేర్లతోనూ పిలుస్తారు.
ఎంతో పవిత్రమైన పర్వదినంగా భావించే రథ సప్తమి నాడు చేసే ప్రత్యేకమైన స్నానం ఏడు జన్మల పాపాలు, దోషాలు, దరిద్రాలను తొలగింపజేస్తుందంటారు. ఈ పవిత్రమైన స్నానం కోసం ఏడు జిల్లేడు ఆకులు, 7 రేగి పళ్లు తీసుకోవాలి. స్నానం చేసే ముందు వాటిని తలపై ఉంచుకొని తలస్నానం చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల పాపాలు పోతాయని నమ్మకం.
* స్నానమాచరించాక సూర్యుడిని ఆరాధించాలి. ఇందుకోసం మీ ఇంటి ఆవరణలో సూర్య కిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గులు వేసుకోవాలి.
* ఆ తర్వాత మీకు వీలైతే చిక్కుడు ఆకులు, చిక్కుడు పూలు, చిక్కుడు కాయలు వీటిని కలిపి ఒక మండపం లాగా పెట్టి పూజచేసుకోవాలి.
* ఇవన్నీ కుదరకపోతే మీ పూజ మందిరంలో ఒక తమలపాకు తీసుకుని దానిపై తడి గంధంతో గుండ్రంగా ఒక రూపు గీయండి. దానిని సూర్యభగవానుడిగా భావించాలి. గోధుమలతో చేసిన ప్రసాదం స్వామి వారికి నైవేద్యం పెట్టాలి.
మీకు వీలైతే ఆవు పాలతో పాయసం చేసి సమర్పిస్తే ఇంకా మంచిది. అలాగే, కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథాన్ని తయారు చేసి, ఆ రథానికి పూజ చేసి, ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగించాలి. ఈ రోజు గొడుగు, చెప్పులు దానం చేస్తే మంచిది.