వరద బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుండటాన్ని సీఎం ఓర్చుకోలేకే ఖమ్మంలో దాడులకు రౌడీ షీటర్లను పురమాయించారని ఆయన అన్నారు. ఈ దాడిని సీఎం కార్యాలయం పర్యవేక్షించిందని ఆరోపణలు చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణా రావు డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. వరద బాధితులకు ఆహార ప్యాకెట్లు ఇవ్వడానికి వెళ్లిన బీఆర్ఎస్ నేతల బృందంపై మంగళవారం కాంగ్రెస్ అల్లరి మూకలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు అడిషనల్ డీజీ మహేష్ భగవత్‌కు మెమోరాండం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వివేకానంద్.. రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందనడానికి నిన్న ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై జరిగిన దాడులే నిదర్శనమని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లో ఖమ్మంలో తమపై దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. వరద బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుండటాన్ని సీఎం ఓర్చుకోలేకే ఖమ్మంలో దాడులకు రౌడీ షీటర్లను పురమాయించారని ఆయన అన్నారు. ఈ దాడిని సీఎం కార్యాలయం పర్యవేక్షించిందని ఆరోపణలు చేశారు. దాడిలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలకు పోలీసులు అండగా నిలిచారని తెలిపారు.
పోలీసులు ప్రేక్షక పాత్ర వహించిన తీరును మహేష్ భగవత్‌కు చెప్పామని ఆయన అన్నారు. దాడులకు పాల్పడ్డ వారి వివరాలు పోలీసులకు అందజేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోని విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చామని అన్నారు. వెంటనే నిందితులను అరెస్టు చేయాలని, ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాలని ఆయన కోరినట్లు తెలిపారు. శాంతి భద్రతలు పరిరక్షించేలా వెంటనే స్పందించాలని చెప్పమని వివేకానంద్ అన్నారు.