రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచిపోయింది. దీంతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో తిరగాలంటే కూడా భయపడిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం గ్రామపంచాయతీలో నిధులు
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచిపోయింది. దీంతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో తిరగాలంటే కూడా భయపడిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం గ్రామపంచాయతీలో నిధులు లేకపోవడంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే ఆగిపోతున్నాయి. అంతేకాదు ఇంతకుముందున్న సర్పంచులు, కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు చెల్లింపు కాలేదు. దీంతో చాలామంది ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను, మంత్రులను అడ్డుకుంటున్నారు.
అంతేకాకుండా వర్షాకాల సీజన్ కాబట్టి చాలా నియోజకవర్గాల్లో ప్రజలు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే బెడ్స్ లేక అనేక ఇక్కట్లు పడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏదో చేస్తుందని ప్రజలు ఓటేస్తే చివరికి అభివృద్ధిని మూలన పెట్టి హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని ప్రజా సమస్యలు పట్టించుకోవడంలేదని అంటున్నారు. ఇదే తరుణంలో తాజాగా కాంగ్రెస్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని పలువురు మహిళలు నిలదీశారు.
ఆయన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామానికి వెళ్తున్న సమయంలో రోడ్డుపై మహిళలు నిలదీసి గ్రామంలో డ్రైనేజీలు, రోడ్లు సరిగా లేవని ప్రశ్నించారు. పరిసరాల పరిశుభ్రంగా లేకపోవడంతో ప్రజలంతా జ్వరాల బారిన పడుతున్నారని కనీసం ఏ ఒక్క అధికారి కూడా మమ్మల్ని పట్టించుకోవడంలేదని వారి బాధను ఎమ్మెల్యే ముందు వెల్లబోసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తా అని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.