కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలల్లో శాంతి భద్రతలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు.
న్యూస్ లైన్ డెస్క్: జైనూర్ ఘటనలో బాధితురాలికి జరిగిన ఘటన అందరం ఖండించాలని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలల్లో శాంతి భద్రతలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఘటనలు జరిగేందుకు ఆస్కారం ఇస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1900కి పైగా మహిళలపై దాడులు జరిగాయి అన్నారు. హైదరాబాద్‌లో మహిళల కోసం షీ టీమ్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఇలాంటి ఘటనల పరిష్కారం కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్ట్‌లు ఏర్పాటు చేయాలని సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. బాధితురాలు జీవ శవంలా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం పరామర్శలకు పరిమితం అవుతోందని, న్యాయం జరిగేలా చూడట్లేదని మండిపడ్డారు. ఘటనకు కారకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. మాజీ మంత్రి మల్లరెడ్డి మాట్లాడుతూ తెలంగాణను కాంగ్రెస్ అతలాకుతలం చేస్తోందని ధ్వజమెత్తారు. రుణమాఫీ కాలేదని రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత మాటలు చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఓట్లు వేస్తారు.. కానీ నిలబెట్టుకోలేదని అన్నారు. ఎక్కడ చూసినా దౌర్జన్యం అక్రమాలు జరుగుతున్నాయి అని మల్లరెడ్డి పేర్కొన్నారు.