ఖమ్మంలో కాంగ్రెస్ గుండాల దాడికి గురైన పార్టీ సీనియర్ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ఖమ్మంలో కాంగ్రెస్ గుండాల దాడికి గురైన పార్టీ సీనియర్ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ ఎన్ని దాడులకు తెగబడిన ప్రజలకు అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, వరద ప్రవాహంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచిన బీఆర్ఎస్ నేతలను ఆయన అభినందించారు. ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గుండాల దాడిని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి వాహనాలపై దాడి కాంగ్రెస్ అసహనానికి నిదర్శనం అన్నారు. సంఘటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ దాడులకు బెదరం.. బీఆర్ఎస్‌కు ఇలాంటి దాడులు కొత్త కాదని కేటీఆర్ అన్నారు.
రెండు రోజుల ముఖ్యమంత్రి పర్యటనతో వరద బాధితులకు ఒరిగింది శూన్యం అని, మొక్కుబడిగా వెళ్లి తూతూమంత్రంగా రూ. పది వేలు ప్రకటిస్తారా అని మండిపడ్డారు. ఎంత మందికి సాయం చేశారో.. ఎన్ని కుటుంబాలను ఆదుకున్నారో వివరాలు వెల్లడించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బాధితుల ఆర్తనాదాలు వినకుండా ప్రచార రథంపై ఊరేగిన సీఎంను చూసి జనం అసహ్యించుకుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కూడా వరద బాధిత ప్రాంతాల్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి అని, కాంగ్రెస్ పరిపాలనా వైఫల్యం వారిని ఎల్లకాలం వెంటాడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.