వ్యాపారులు దీని వెనుక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హస్తం ఉన్నట్లు జోరుగా చర్చించుకుంటున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: మోడల్ స్కూల్స్, గురుకులాల కిరాణం టెండర్లలో గోల్ మాల్ జరుగుతున్నట్లు సమాచారం. ఒక్క కాంట్రాక్టర్ కోసం అధికారులు రూల్స్ మార్చేసినట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో కేజీబీవీలు, ఆదర్శ స్కూళ్లకు పండ్లు, కూరగాయలు, కిరాణం, పాలు, గుడ్లు, చికెన్, మటన్ సప్లై చేసేందుకు నల్గొండ విద్యాశాఖ ఆఫీసర్లు ఇటీవల టెండర్లు పిలిచారు. గతేడాది డివిజన్ల వారీగా టెండర్లు పిలిచిన ఆఫీసర్లు ఈ సారి జిల్లా కేంద్రంగా పిలిచారు. అయితే నల్గొండ జిల్లాలోని 27 కేజీబీవీలు, 17 మోడల్ స్కూళ్లు, ఒక అర్బన్ స్కూలుకు కలిపి టెండర్లు పిలిచారు. కాగా, ఇందులో అత్యంత విలువైన కిరాణం టెండర్ ఏడాది మొత్తం కలిపినా రూ.2 కోట్లకు మించదు. కానీ ఒక కాంట్రాక్టర్‌కు మేలు చేసేందుకు వార్షిక టర్నోవర్ రూ. 10 కోట్లు, మూడేళ్ల అనుభవంతో పాటు మరో 10 కోట్లకు సాల్వెన్సీ సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధన తెచ్చారు. దీంతో కిరాణం టెండర్ ఒక్కరికే దక్కింది.
గతేడాది వరకు అన్ని శాఖలు వేర్వేరుగానే టెండర్లు పిలిచేవారు. కానీ ఇప్పుడు అన్ని గురుకులాలకు కలిపి ఒకటే టెండర్ పిలిచారు. కూరగాయలు, పాలు, గుడ్లు, చికెన్, మటన్‌కు మాత్రమే టెండర్‌ను పిలిచిన ఆఫీసర్లు కిరాణ సామానుకు మాత్రం పిలవడంలేదు. ఈ విషయంపై అధికారల నుంచి వివరణ కోరగా పైఆఫీసర్లు చెప్పడం వల్లే కిరాణం టెండర్ పిలవలేదని, అన్నింటికీ కలిపి ఒకటే నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పారని అన్నారు. దీంతో వ్యాపారులు దీని వెనుక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హస్తం ఉన్నట్లు జోరుగా చర్చించుకుంటున్నారు. మంత్రి అనుచరుల కోసమే ఈ టెండర్లు ఒక్కరికే దక్కేలా చేశారని వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకునేలా చూడాలని వ్యాపారులు కోరుతున్నారు.