రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విద్యుత్ కమిషన్ కి కొత్త చైర్మన్ గా జస్టిస్ మదన్ బీ లోకూర్ ని నియమించింది.
న్యూస్ లైన్ డెస్క్ : విద్యుత్ కొనుగోలుపై నియమించిన విచారణ కమిషన్ చైర్మన్ నరసింహ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాడని ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు ఆయనను తప్పించిన విషయం తెలిసిందే. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విద్యుత్ కమిషన్ కి కొత్త చైర్మన్ గా జస్టిస్ మదన్ బీ లోకూర్ ని నియమించింది. జస్టిస్ నరసింహారెడ్డిని స్థానంలో లోకూర్ కు బాధ్యతలు అప్పగించింది. గతంలో లోకూర్ ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగానూ సేవలందించారు.
తెలంగాణ – ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల మధ్య విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిటీ వేసింది. అయితే.. విచారణ పూర్తి కాకముందే తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం నరసింహారెడ్డదిని తప్పించి.. ఆ స్థానంలో ఇంకొకరికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. ఇందుకు గానూ.. సోమవారం వరకు కోర్టు ప్రభుత్వానికి గడువు ఇచ్చింది. గడువు నిన్నటితో ముగియడంతో ప్రభుత్వం ఈరోజు కొత్త చైర్మన్ నియమాకాన్ని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.