లిక్కర్ పాలసీలో నిబంధనలను ఉల్లంఘించారని 2022 జులైలో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్ ఆరోపణలు చేశారు. ఇందులో సౌత్ గ్రూప్ ప్రమేయం ఉందని అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: గత కొంత కాలంగా దేశ రాజీయాల్లో లిక్కర్ పాలసీ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పలువురు కీలక రాజకీయ నేతలు కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇందులో మనీష్ సిసోడియాకు బెయిల్ రావడంతో ఆయన ఇటీవల విడుదలయ్యారు. అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా ఈడీ కేసులో బెయిల్ మంజూరైంది. ఇక తాజాగా, కవితకు కూడా ఈడీ, సీబీఐ వేసిన కేసుల్లో ఈరోజు తుది విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ ఇచ్చింది. అయితే, ఈ లిక్కర్ పాలసీ కేసు ఏంటి.. ఇందులో ఇంతమందిని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు అనే వివరాలు తెలుసుకుందాం..
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 2021లో లిక్కర్ పాలసీని తీసుకొచ్చారు. దీని ప్రకారం లిక్కర్ రిటైల్ అమ్మకాల నుంచి ప్రభుత్వం తప్పుకొని లైసెన్స్ కలిగిన ప్రయివేట్ సంస్థలకు లిక్కర్ అమ్మకాలు జరిపే అవకాశం ఉంటూంది. బ్లాక్ మార్కెట్‌ను పూర్తిగా తీసేయడానికి, ప్రభుత్వ ఆదాయం పెంచడానికి ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు కేజ్రీవాల్ తెలిపారు. అయితే, లిక్కర్ పాలసీలో నిబంధనలను ఉల్లంఘించారని 2022 జులైలో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్ ఆరోపణలు చేశారు. ఇందులో సౌత్ గ్రూప్ ప్రమేయం ఉందని అన్నారు. ఈ గ్రూప్‌లోనే BRS ఎమ్మెల్సీ కవిత, వైసీపీ మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అరబిందో ఫార్మాకు చెందిన శరత్ రెడ్డిల పాత్ర కూడా ఉందని అన్నారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ దర్యాప్తు ప్రారంభిచింది.
2022 డిసెంబర్ 11న కవిత ఇంట్లోనే సీబీఐ విచారణ జరిగింది. లిక్కర్ పాలసీ కేసులో CRPC 160 కింద 7 గంటల పాటు సీబీఐ వాంగ్మూలం నమోదు చేసింది. అయితే, ఇదే కేసులో విచారణకు హాజరు కావాలని ఈ ఏడాది మార్చి నెలలో కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. మార్చి 11న కవితతో ఈడీ విచారణ జరిపింది. ఆ తరువాత మార్చి 15న ఆమెను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 16, 20, 21న ఢిల్లీలో విచారణ జరిగింది. తన ఎనిమిది ఫోన్లని కవిత ఈడీకి సమర్పించారు. ఈడీ, సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో కవిత పేరును కూడా చేర్చారు.
ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ 50 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ ఏడాది జనవరి 5న కవితకు మరోసారి ఈడి నోటీసులు పంపించింది. ఫిబ్రవరి 21న కవితకు సీబీఐ నోటీసులు పంపించింది. ఫిబ్రవరి 26న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. ఆ సమయంలోనే తొలిసారిగా కవితను ఈ కేసులో నిందితురాలిగా పేర్కొన్నారు. అప్పటి నుండి ఢిల్లీలోని తీహార్ జైలు కష్టడీలోనే కవితను ఉంచారు. ఈ కేసులో బెయిల్ కోసం కవిత పలు మార్లు పిటిషన్ దాఖలు చేయగా.. ఢిల్లీ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. అయితే, పిటిషన్ దాఖలు చేసిన ప్రతిసారీ వాయిదాల పర్వంతోనే విచారణ జరగడం గమనార్హం.
ఇక ఈరోజు ఢిల్లీలోని సుప్రీం కోర్టులో జరిగిన తుది విచారణలో సెక్షన్ 45 ప్రకారం కవితకు బెయిల్ వచ్చింది. జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్ బెంచ్ విచారణ జరిపించింది. కవిత తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదిస్తున్నారు. ఇరువైపుల వాదనలు విన్న తరువాత ఈడీ, సీబీఐ దాఖలు చేసిన రెండు కేసుల్లో సుప్రీం కవితకు బెయిల్ మంజూరు చేసింది.