ఇందులో భాగంగానే నగరంలోని ప్రధాన రహదారులపై ఉన్న స్తంభాలకు ఉన్న అనవసరమైన కేబుళ్లు తీసేయాలని నిర్ణయించారు.
న్యూస్ లైన్ డెస్క్: కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు TSPDC సీఎండీ ముషారఫ్ ఫరూకీ కీలక ఆదేశాలు జారీ చేశారు. కరెంట్ స్తంభాలపై ఉన్న అనవసరమైన కేబుల్స్, ఇతర వస్తువులను వెంటనే తొలగించాలని ఆయన ఆదేశించారు. లేదంటే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కేబుల్‌ల తొలగింపుపై కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు సమాచారం ఇచ్చేందుకు ఈ నెలలో పలు మార్లు సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నగరంలోని ప్రధాన రహదారులపై ఉన్న స్తంభాలకు ఉన్న అనవసరమైన కేబుళ్లు తీసేయాలని నిర్ణయించారు.
కాగా, కొంతమంది కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు సమావేశాల్లో ఒప్పందాలు చేసుకున్నప్పటికీ తొలగింపు ప్రక్రియలో సహకరించలేదని తెలుస్తోంది. మరోవైపు GHMC పరిధిలో స్తంభాలకు వేలాడుతున్న కేబుల్స్, కేబుల్ బండిల్స్, వివిధ టెలికాం పరికరాలు కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కేబుల్ నిర్వహణ సరిగా లేకపోవడంతో సామాన్య ప్రజలు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.
దీంతోపాటు స్తంభాలకు తీగలు తెగిపోవడంతో వాటి నిర్వహణ పనుల్లో విద్యుత్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను తగ్గించడానికి అనవసరమైన కేబుళ్లు తీసేయాలని ముషారఫ్ ఫరూకీ ఆదేశించారు. కేబుళ్లను తొలగించడానికి కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కొంత సమయం ఇవ్వాలని ఆయన సూచించారు. అయినప్పటికీ తొలగించకపోతే TSPDC సిబ్బందితో కేబుళ్లను పూర్తిగా తీసేస్తామని ఫరూకీ స్పష్టం చేశారు.