హైడ్రాపై రాష్ట్ర బీజేపీ నేతలు ఆగమాగం అవుతున్నారట. ఏం మాట్లాడారో..? ఏం మాట్లాడుతున్నారో..? ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదనే చర్చ జరుగుతోంది. హైదరాబాద్ లో హైడ్రా పేరుతో
న్యూస్ లైన్ డెస్క్:హైడ్రాపై రాష్ట్ర బీజేపీ నేతలు ఆగమాగం అవుతున్నారట. ఏం మాట్లాడారో..? ఏం మాట్లాడుతున్నారో..? ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదనే చర్చ జరుగుతోంది. హైదరాబాద్ లో హైడ్రా పేరుతో పేదోళ్ల గుడిసెలు కూలగొడుతుంటే మొన్నటిదాంక బీజేపీకి చెందిన నేతలు బండి సంజయ్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు చాలా మంది ఆహా.. ఓహో.. అద్భుతం అంటూ ఆకాశానికెత్తారు. కూలగొట్టడం కరెక్ట్ అంటూ సర్కార్ ను నెత్తిన పెట్టుకుని కాపాడారు. కాంగ్రెస్ వాళ్ల కంటే ఎక్కువగా రేవంత్ సర్కారును కాపాడుతూ వచ్చారు బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులు. వందలాది మంది పేద ప్రజలు రోడ్డునపడుతున్నా.. కనీసం వాళ్లను ఆదుకోవాలని ఏ ఒక్కరూ మాట్లాడిన పాపాన పోలేదు. హైడ్రాకు మద్దతుగా మాట్లాడిన బీజేపీ లీడర్ల బైట్ వేసుకోవాలి.
దొరక్కపోతే స్పాట్ వేసుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయాయి కాబట్టే కమలం నేతలెవరూ హైడ్రాను వ్యతిరేకించలేదనే ప్రచారం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కారుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోంది కాబట్టే.. ఎవరూ ఏం మాట్లాడటం లేదనే చర్చ నడిచింది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఏ ఒక్క అంశంపై వారు మాట్లాడకపోవడానికి కారణం కూడా అదేననే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా కమలం రూటు మారింది. నిన్నటి దాకా రేవంత్ సర్కారున నెత్తికెత్తుకున్నోళ్లు.. ఇప్పుడు నేలమీద పడేసింత పనిచేస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరు.. హైడ్రాను విమర్శించడం మొదలుపెట్టారు. ఆహా.. ఓహో.. అన్నోళ్లు.. అంతా వరస్ట్ అంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు.
మొన్నటిదాంక కూల్చాలని చెప్పినోళ్లే, ఇప్పుడు కూలుస్తుంటే చూస్తూ ఊరుకోబోమని, అడ్డుపడతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొన్నటి దాకం కాంగ్రెస్ పనులన్నింటికి మద్దతు ప్రకటించిన బీజేపీ నేతలు... ఇప్పుడు సడెన్ గా ఎందుకు ప్రశ్నించడం మొదలుపెట్టారనేది చర్చనీయాంశంగా మారింది. హైడ్రా అద్భుతమంటూ మాట్లాడిన వాళ్లు.. ఇప్పుడు దాన్ని ఎందుకు తప్పుపడుతున్నారనేది చాలామంది అంతుపట్టడం లేదట. అయితే.. సడెన్ గా ప్లేటు ఫిరాయించి, రేవంత్ పై రాళ్లేయడానికి కారణాలు లేకపోలేదట. రాష్ట్రంలో బీజేపీ ఉనికి లేకుండా పోతోందనే ప్రచారం ఇటీవల మొదలైంది. కాంగ్రెస్ పై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత.. బీఆర్ఎస్ కు అనుకూలంగా మారుతోందనే చర్చ మొదలైంది. హైడ్రా, మూసీ బాధితులు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆపీసుకు కాకుండా.. రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్ కు క్యూ కట్టారు. అక్కడే అసలు కథ మొదలైందంటున్నారు.
బాధితులంతా బీఆర్ఎస్ పార్టీనే తమను కాపాడగలుగుతుందని మాట్లాడుతుండటం.. అవి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. ఢిల్లీలో ఉన్న కమలం బాసులు కస్సుమన్నారట. తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారును కాటేయొద్దని చెప్పాం కానీ.. అప్పుడప్పుడు బుసకొట్టాలి కదా.. అని చీవాట్లు పెట్టారట. మాంసం తిన్నామని బొక్కలు మెడలో వేసుకుంటామా.? అని సీరియస్ అయ్యారట. మీరు చేష్టల వల్ల.. రేవంత్ రెడ్డి సర్కారుతో మనకు దోస్తీ ఉందని అందరికి తెలిసిపోయేలా ఉందని ఢిల్లీ పెద్దలు చాలా సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఇదే జరిగితే పార్టీ మొత్తమే కనుమరుగయ్యే ప్రమాదం ఉందని చీవాట్లు కూడా పెట్టారట. దీంతో తెలంగాణలోని కమలం నేతలందరు స్టాండ్ మార్చుకుని సర్కారుపై ఉత్తుత్తి దండయాత్ర మొదలుపెట్టారనే చర్చ జరుగుతోంది.
పార్టీని బతికించుకునేందుకే బీజేపీ నేతలు ఇప్పుడు హైడ్రా గురించి మాట్లాడుతున్నారనే ప్రచారం కూడా ఉంది. మరి ఈ ఆగ్రహావేశాలు ఎన్ని రోజులు చూపిస్తారు? హైడ్రాపై ఎన్ని రోజులు పోరాటం చేస్తారనేది మాత్రం తెలియడం లేదని.. బీజేపీలోని కిందిస్థాయి నాయకులు కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.