రెండు లక్షల రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ వెంటనే స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: రెండు లక్షల రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ వెంటనే స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతు రుణమాఫీ, వరద సాయంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చక వచ్చిన సమస్యలను పరిష్కరించక ప్రజలను గందరగోలంలోకి నెడుతున్నారని మండిపడ్డారు. 9 నెలల పరిపాలనలో రైతు రుణమాఫీపై అర్దం లేని, స్పష్టతలేని నిర్ణయాలతో రైతన్నని మోసం చేస్తున్నారని అన్నారు. రుణమాఫీ 49 వేల కోట్లు చేస్తామని చెప్పి చివరికి 31,000 అని చెప్పి బడ్జెట్లో 26 వేల కోట్లు కేటాయించి 18 వేల కోట్లు విడుదల చేసి రైతులకు పదివేల కోట్లు మాత్రమే చేరవేశారని తెలిపారు.
ముఖ్యమంత్రి మంత్రుల మాటలకు పొంతన లేదని రైతు రుణమాఫీ పై వెంటనే స్పష్టత ఇవ్వాలన్నారు. రెండు లక్షల పైన రుణం ఉంటే బ్యాంకులో కట్టాలని చెబితే రైతులు అప్పు సబ్బు చేసి రెండు లక్షల పైన ఉన్న రుణం కట్టారని ఇప్పటికి రెండు లక్షల రుణమాఫీ కాలేదన్నారు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి రుణం కట్టొద్దని అనడం విడ్డూరంగా ఉందని, ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకర్లు రైతులను ఇబ్బందులు పెట్టి రెండు లక్షల పైన కడితేనే మాఫీ వస్తుందని చెప్పి రుణం కట్టించుకున్నారని అన్నారు. ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి మోసం చేయడమే కాకుండా ప్రస్తుతం కూడా అధికారంలోకి వచ్చి మోసం చేయడం దేశ చరిత్రలో తెలంగాణలోనే ఇది ప్రథమం అన్నారు.