సచివాలయం ముందట తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో ఏర్పాటు చేస్తున్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టాపనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: సచివాలయం ముందట తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో ఏర్పాటు చేస్తున్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టాపనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయం అస్తవ్యస్తంగా ఉండేదని, కాగా అగ్ని ప్రమాదం జరిగితే కూడా ఫైర్ ఇంజన్ రాని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కేసీఆర్ సచివాలయ పునర్నిర్మానం చేద్దామనుకున్నారని తెలిపారు. తెలంగాణ పౌరుషం, తెలంగాణ వైభవాన్ని చాటేలా నూతన సచివాలయం నిర్మించాలనుకున్నారని అన్నారు. తెలంగాణ భవిష్యత్తు తరాలకు అందించేలా అద్భుతమైన డిజైన్‌తో ముందుకు తీసుకువెళ్లారని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్‌కి అద్భుతమైన నివాళి అందించేలా మహనీయుడి అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని సచివాలయానికి పెట్టుకున్నామని తెలిపారు. సచివాలయంలో కూర్చుని పాలించే ప్రతి పాలకుడికి అమరవీరుల త్యాగాలని స్ఫూర్తిని జ్వలింపచేస్తూ.. స్ఫూర్తినిచ్చేలా ఒక అద్భుతమైన అమర జ్యోతి స్మారకాన్ని నిర్మించామన్నారు.
తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతికైన తెలంగాణ తల్లిని అక్కడే ప్రతిష్టించాలన్న ఉద్దేశంతో ఒక ఐలాండ్ క్రియేట్ చేయడం జరిగిందన్నారు. దశాబ్ది ఉత్సవాల్లోనే అక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్టించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ కుసంస్కార పార్టీ, అందుకే తెలంగాణ తల్లికి కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడుతుందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అనడు.. మహనీయుడు అంబేద్కర్‌కి కనీసం పూలదండ వేయడు, కనీసం లైటింగ్ ఏర్పాటు చేయడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరజ్యోతిని ఇప్పటిదాకా ప్రజల కోసం ఓపెన్ చేయలేదని, రాజీవ్ గాంధీ అవమానించిన మాజీ సీఎం అంజయ్య పేరుతో ఉన్న పార్కు ఇప్పుడు లుంబిని పార్క్ అయిందని తెలిపారు. అదే అంజయ్య పార్కు ఎదురుగా ఆయనను అవమానించిన రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారన్నారు. గత పది సంవత్సరాలలో మేము ఏనాడు కూడా పేర్ల మార్పు పైన ఆలోచించలేదన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీకి, రాజీవ్ గాంధీ స్టేడియం, రాజీవ్ రహదారి, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇలా ఎన్ని పేర్లు ఉన్నా వాటిని మేము ఏనాడు మార్చడానికి ప్రయత్నం చేయలేదని కేటీఆర్ అన్నారు. కానీ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత బాధతో ఈ మాట చెప్పాల్సి వస్తుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అధికారంలోకి రాగానే అక్కడి నుంచి తరలిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలి అంటే గాంధీభవన్‌లోనో, రేవంత్ రెడ్డి ఇంట్లోనో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకోవాలని సూచించారు. వందలాదిమంది తెలంగాణ ప్రజల ప్రాణాలు తీసిన కాంగ్రెస్ పార్టీ.. మరోసారి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్కకు పెట్టి రాహుల్ గాంధీ విగ్రహాన్ని పెడుతుందన్నారు. మన పోరాటమే అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం అన్నారు. మళ్లీ నాలుగేళ్లలో తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో మన ప్రభుత్వం వస్తుందని, ఇప్పుడు పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగించి.. కాంగ్రెస్ పార్టీ కోరుకున్నచోటికి పంపిస్తామన్నారు. ఈరోజు తెలంగాణ తల్లికి కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానం తెలంగాణ మరిచిపోదు అని, ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగానే ప్రాంతీయంగా తెలంగాణ మహనీయుడి పేరును అంతర్జాతీయ విమానాశ్రయానికి పెడతామన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి, అమరవీరుల త్యాగాలకు అవమానపరిచేలో రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్న కాంగ్రెస్ పార్టీ తీరు మార్చుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటికే రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ విగ్రహాలు సరిపోయినన్ని ఉన్నాయి అన్నారు. ఢిల్లీకి గులాములుగా ఉన్న మీకు తెలంగాణ పౌరుషం కలిగిన బిడ్డగా చెబుతున్నా.. వాటిని మార్చే దిశగా ఆలోచన చేస్తామన్నారు.