న్యూస్ లైన్ డెస్క్ : అక్రమ నిర్మాణాలు, హైడ్రా పేరుతో అడ్డగోలు వసూళ్ల కోసమే సీఎం రేవంత్ హైడ్రామా చేస్తున్నాడని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. చెరువులను ఆక్రమించి కట్టారన్నా ఆరోపణలతో సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు, బిగ్ షాట్స్, సామాన్యులు అనే తేడా లేకుండా అందరిపై హైడ్రా కొరడా ఝుళిపిస్తున్నామని చెప్పుకునే సీఎం రేవంత్ కళ్లకు నిరుపేదలు, వికలాంగుల నివాసాలు కనిపించడం లేదా అని డీకే అరుణ ఫైర్ అయ్యారు.
మహారాష్ట్ర, హర్యాణా, జార్ఖండ్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ఖర్చు కోసం డబ్బులు కావాలి కాబట్టి.. రేవంత్ సర్కార్ హైడ్రా పేరుతో.. హైడ్రామా చేసి డబ్బులు వసూలు చేస్తోందని ఆమె ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై విపక్షాలు ప్రశ్నిస్తాయని.. హామీలను, రుణమాఫీని, రైతు భరోసాను మరిపించేందుకు హైడ్రా పేరుతో డ్రామాలాడుతున్నారని డీకే అరుణ అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పట్టాలిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లు కూలగొడుతుందని మండిపడ్డారు. ప్రభుత్వం కూల్చేసిన నిరుపేదలకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.