పల్లెపోరు అయిపోయింది. పురపోరులోనూ సత్తా చాటాం. ఇక ఫోకస్ అంతా జీహెచ్ఎంసీ ఎన్నికలపైనే. గ్రేటర్ పరిధిలో తమకు అనుకూలంగా ఉండడంతో ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తోంది కారు పార్టీ. అందుకోసం గులాబీ బాస్ రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారట. ఎలాగైనా సరే ఈ సారి మేయర్ పీఠం దక్కించుకోవాలని భావిస్తున్నారట. అందుకే ఇప్పటి నుంచే ప్లాన్స్ వేస్తున్నారట కేసీఆర్. అందుకోసం చేయాల్సిన గ్రౌండ్ వర్క్ ను మొదలు పెట్టారట. అసలు కారు స్ట్రాటజీ ఏంటీ..?
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అంతోఇంతో సత్తా చాటాం. పురపోరులోనూ కాస్త పరువు కాపాడుకున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటినా రెండు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలవలేకపోయారు. ఈసారి కాస్త రూట్ మార్చాల్సిందేనంటున్నారు గులాబీ బాస్ కేసీఆర్. గ్రేటర్ మీద పట్టు సాధించాల్సిందేనంటున్నారు. ఇందుకోసం ఇక పూర్తిగా GHMC ఎన్నికలపైనే ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయింది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ. గ్రేటర్ పరిధిలో కొత్తగా ఏర్పాటైన మూడు కార్పొరేషన్లకు ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా తిరిగి జెండా పాతాల్సిందేనని ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ చేస్తోందట కారు పార్టీ.
త్వరలోనే జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై అప్పుడే స్పెషల్ ఫోకస్ పెట్టింది ప్రతిపక్ష బీఆర్ఎస్. బల్డియా ఎన్నికల్లో కచ్చితంగా తమదే పైచేయి కావాలని కసి మీదుంది. తెలంగాణకు గుండె లాంటి గ్రేటర్ హైదరాబాద్ లో వన్ థర్డ్ అసెంబ్లీ సీట్లు ఉంటాయి. దీంతో GHMCతో పాటు కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోందట గులాబీదళం. గ్రేటర్ పై పట్టు కోల్పోతే మళ్లీ అధికారంలోకి రావడం కష్టమని భావిస్తున్నారట గులాబీ బాస్ కేసీఆర్. అందుకే GHMC ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే పూర్తి ప్రిపరేషన్ లో పడిపోయిందట. ఎక్కడిక్కడ లీడర్లను అలర్ట్ చేసి.. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జ్ లను అప్రమత్తం చేసి రెగ్యులర్‌గా ఫీల్డ్ లోనే ఉండాలని సూచించారట పార్టీ పెద్దలు.
అయితే.. మరో వారం, పది రోజుల్లో ఇంచార్జ్ లను కూడా ప్రకటించనున్నారు కేసీఆర్. దాంతో ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పనిచేసేలా వ్యూహరచన కూడా రెడీ చేస్తున్నారట. గ్రౌండ్ వర్క్ చేయాలని ప్రిపేర్ చేస్తున్నారు. గ్రేటర్ ప్రజల్లో ప్రభుత్వం మీదున్న వ్యతిరేకత, గతంలో తమ సర్కార్ హయాంలో చేసిన అభివృద్ధి, మళ్లీ అధికారంలోకి వస్తే చేసే పనులను ప్రజలకు వివరించి.. GHMCలో తిరిగి పాగా వేయాలని భావిస్తున్నారట గులాబీ లీడర్లు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ, హైదరాబాద్ నగర పరిధిలో మాత్రం బీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది.
జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 24 అసెంబ్లీ స్థానాలకు గాను బీఆర్ఎస్ అత్యధికంగా 15 ఎమ్మెల్యేలను గెలుచుకుంది. ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ గెలుపొందింది. అంతే కాకుండా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికీ బీఆర్ఎస్ కు 12 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో వారిదే పైచేయిగా ఉంది.
ఇటు 2016లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 150 డివిజన్లకు గానూ 99 డివిజన్లలో గెలుపొంది రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత 2020 వచ్చేసరికి 56 కార్పొరేట్ సీట్లను సొంతం చేసుకుని ఎంఐఎంతో కలిసి మేయర్ సీటును కైవసం చేసుకుంది. అప్పుడు కాంగ్రెస్ కు కేవలం రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లోను తమకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాస్త ఎంఐఎంకు ఎడ్జ్ ఉండే అవకాశం ఉన్నా.. సైబరాబాద్, మల్కాజ్ గిరి కార్పొరేషన్లలో మాత్రం.. తమకు గెలుపు అవకాశాలు ఉంటాయని లెక్కలు వేసుకుంటున్నారట.
సైబరాబాద్ పరిధిలో తాము చేసిన అభివృద్ధి, మల్కాజ్ గిరి పరిధిలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా పక్కా ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు.. హైదరాబాద్ చుట్టుపక్కాల ఉన్న మున్సిపల్ స్థానాల్లో సత్తా చాటడంతో గులాబీ నేతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారట. గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అందుకు సిద్దంగా ఉండాలని, గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటి నుంచే గ్రేటర్ ఎన్నికలకు సన్నద్దం అవుతున్నట్లు సమాచారం. మొత్తానికి రానున్న అసెంబ్లీ ఎన్నికలకు వయా గ్రేటర్ రూట్ మ్యాప్ ప్లాన్ చేస్తోంది గులాబీదళం