సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి, పారితోషికం ఇవ్వకుండా మోసం చేయడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడిన క్యాస్టింగ్ డైరెక్టర్ ప్రసాద్‌పై కేసు నమోదైంది. 21 ఏళ్ల ఓ యువ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి, పారితోషికం ఇవ్వకుండా మోసం చేయడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడిన క్యాస్టింగ్ డైరెక్టర్ ప్రసాద్‌పై కేసు నమోదైంది. 21 ఏళ్ల ఓ యువ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సదరు యువనటికి ఓ చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ఇప్పిస్తానని ప్రసాద్ సంప్రదించాడు. ఆమె 2025 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంది. అయితే, షూటింగ్ పూర్తయిన తర్వాత ఆమెకు ఇవ్వాల్సిన రూ. 90,000 రెమ్యునరేషన్‌తో పాటు, ప్రయాణ ఖర్చులు రూ. 38,000 (మొత్తం రూ. 1.28 లక్షలు) ఇవ్వకుండా ప్రసాద్ కాలయాపన చేశాడు. ఓ రోజు డబ్బులు ఇస్తానని నమ్మించి ఫిబ్రవరి 18న బంజారాహిల్స్‌లోని ఒక ప్రముఖ నిర్మాత కార్యాలయం వద్దకు ఆమెను పిలిపించాడు. అక్కడ ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని, డోర్లు లాక్ చేసి అసభ్యంగా ప్రవర్తించాడు. తనకు లొంగిపోతేనే ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు ఇప్పిస్తానని, లేదంటే కెరీర్ నాశనం చేస్తానని బెదిరించాడు. అతడి నుంచి తప్పించుకున్న బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లికి చెప్పగా, ఆమె ప్రసాద్‌ను ఫోన్‌లో ప్రశ్నించింది. అయితే ఆమెను కూడా ప్రసాద్ దుర్భాషలాడటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 318(4) (చీటింగ్), సెక్షన్ 75 (లైంగిక వేధింపులు),క్రిమినల్ బెదిరింపుల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.