ఆయనో కేంద్ర మంత్రి. కీలక శాఖ కూడా ఆయన ఆధీనంలోనే ఉంది. దేశంలో ఎంత పెద్ద పని కావాలన్నా ఇట్టే చేసుకోవచ్చు. కానీ తీరా ఆయన నియోకవర్గంలో చేస్తున్న పనులు చూసి అక్కడి జనం షాక్ అవుతున్నారట. ఇంత పెద్ద మనిషి ఇదేనా చేసిందీ అంటూ ముక్కన వేలు వేసుకుంటున్నారట. ఇంతకీ ఎవరా మంత్రి ? ఏంటా కథ
జీ. కిషన్ రెడ్డి.. సికింద్రాబాద్ ఎంపీ.. కేంద్ర గనుల శాఖ మంత్రి. అయితే.. తెలంగాణ నుంచి వరుసగా రెండోసారి మంత్రి అయ్యారు. కానీ, సొంత నియోజకవర్గంలో కూడా పనులు చేయించుకోలేకపోతున్నారు. కేంద్రమంత్రిగా దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నా.. సొంత పార్లమెంట్ పరిధిలో మాత్రం పనుల కావాలంటే రాష్ట్ర ప్రభుత్వపైనే ఆధార పడుతున్నారు. ఆయన అభివృద్ధి చేసే ఛాన్స్ ఉన్నా.. చేయకపోవడంపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేంద్ర మంత్రిగా ఉంటూ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారి తీసింది. తన నియోజకవర్గంలోని అంబర్ పేట ఫ్లై ఓవర్ కింద సర్వీస్ రోడ్డు నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని కిషన్ రెడ్డి కోరారు. కేంద్ర ప్రభుత్వం 265 కోట్లతో అంబర్ పేట క్రాస్ రోడ్డు వద్ద 1.5 కిలోమీటర్ల పొడవైన ఫ్లై ఓవర్ నిర్మించిందన్నారు. ఫ్లై ఓవర్ కు అవసరమైన భూసేకరణ ఇంకా పూర్తి కాకపోవడంతో కింద సర్వీస్ రోడ్డు నిర్మాణం ఆగిపోయిందన్నారు. ఈ ఫ్లైఓవర్ 2018లోనే మంజూరు అయినప్పటికీ భూసేకరణ పూర్తి కాకుండా మధ్య దళారులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి భారీగా నిధులు వస్తున్నాయని.. 12 యేళ్లలో దాదాపు 12 లక్షల కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని చెబుతున్నారు. అలాంటి వ్యక్తి ఒక చిన్న రోడ్డు కోసం సీఎంకు లేఖ రాయడంపై చర్చ జరుగుతోంది. ప్రజలకు హామీలు ఇచ్చినా అభివృద్ధి పనులు మాత్రం కనిపించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు ఇంకా అలాగే ఉండటంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సొంత ప్రాంతంలోనే అభివృద్ధి పనులు చేయించుకోలేని నాయకుడు రాష్ట్రం గురించి ఎలా మాట్లాడతారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మరింత వేడెక్కుతోంది. కేంద్ర మంత్రి ఆయన చాలా చేయాలని.. కానీ, ఏమీ చేయడం లేదంటున్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో అభివృద్ధి పనుల విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఇంకా పూర్తిగా అమలు కాలేదనే ఆరోపణలు స్థానిక స్థాయిలో వినిపిస్తున్నాయి. ప్రాథమిక సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాల్లో రహదారుల పరిస్థితి దారుణంగా ఉందని, పలు కాలనీల్లో మురుగు నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రంలో మంత్రి పదవి ఉన్నప్పటికీ సొంత నియోజకవర్గానికి తగిన నిధులు తీసుకురాలేకపోయారనే ప్రశ్నలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కేంద్ర పథకాల ద్వారా అభివృద్ధి పనులు వేగంగా జరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఆ దిశగా స్పష్టమైన పురోగతి కనిపించడం లేదని కొందరు స్థానిక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి మూడో స్థానంలో నిలిచారు. అది కిషన్ రెడ్డి ఎంపీ పరిధిలోనే ఉంది. అక్కడ కూడా ఆయన ఏం చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ప్రత్యర్థి రాజకీయ పార్టీలు కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ కిషన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. సొంత ప్రాంతంలోనే ప్రజా సమస్యలను పరిష్కరించలేని నాయకుడు రాష్ట్ర రాజకీయాలపై ఎలా విమర్శలు చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కిషన్ రెడ్డి అనుచరులు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని, కేంద్ర పథకాల ద్వారా నియోజకవర్గానికి నిధులు తీసుకువచ్చారని చెబుతున్నారు. కొన్ని పనులు పరిపాలనా ప్రక్రియల కారణంగా ఆలస్యం అవుతున్నాయని కూడా వారు వివరణ ఇస్తున్నారు.
మొత్తానికి సొంత నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై వచ్చిన ఈ విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ప్రజల సమస్యల పరిష్కారానికి మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.