మావోయిస్టులతో ఆ స్కెచ్ ?

తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిన నేతలు.. లొంగిపోయారు. వారికి రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ వేస్తున్నారు. పునరావాస ప్యాకేజీలు ఇస్తున్నారు. సానుభూతి వెనకాల రాజకీయ కోణం ఉందా..? వారికి ప్రజల్లో ఉన్న సానుభూతిని తాను క్యాష్ చేయాలనుకుంటున్నారా..?


Published Mar 04, 2026 03:00:00 PM
postImages/2026-03-04/1772612789_MAVOMARKSREVANTHLABHAM.jpg

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మావోయిస్టులపై సానుభూతి చూపిస్తున్నారు. లొంగిపోడానికి రెడీగా ఉన్న వారికి రెడ్ కార్పెట్ వేస్తున్నారు. వారికి పునరావాస ప్యాకేజీలు ఇస్తున్నారు. అయితే.. దీని వెనకాల రాజకీయ కోణం ఉందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి మాజీ మావోయిస్టు అగ్రనేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించి రాజకీయ భవిష్యత్ ఇవ్వాలనుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయిని రాజకీయ వర్గాలంటున్నాయి. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న వ్యతిరేకతను ఈ విధంగా పూడ్చుకోవాలని చూస్తున్నారట. మావోయిస్టులపై ప్రజల్లో ఎంతో కొంత సానుభూతి ఉంటుందని.. బీజేపీ పూర్తిగా వ్యతిరేకం అయింది కాబట్టి తమకు అనుకూలంగా మార్చుకునేందుకు లొంగుబాట్లకు ఎక్కువ ప్రాధాన్యం తెలంగాణలో కల్పించారని భావిస్తున్నారు. 

రేవంత్ రెడ్డి మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి అత్యంత ఆకర్షణీయమైన పునరావాస ప్యాకేజీలను ప్రకటించడం వెనుక స్పష్టమైన రాజకీయ సంకేతాలు ఉన్నాయని అంటున్నారు. గతంలో మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన అగ్రనేతలను, వారి భావజాలంతో ప్రభావితమైన వర్గాలను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. కేవలం.. ఆర్థిక సాయంతోనే కాకుండా, వారిని గౌరవప్రదంగా సమాజంలో కలిపే ప్రయత్నం చేయడం ద్వారా ఒక రకమైన సామాజిక మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం జరుగుతోందని పొలిటికల్ అనాలిస్టులు అంచనా వేస్తున్నారు.

 

BJP మావోయిస్టు భావజాలాన్ని, లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ ట్రీమిజాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ క్రమంలో మావోయిస్టుల పట్ల సానుకూల ధోరణిని ప్రదర్శించడం ద్వారా కాంగ్రెస్ ఒక భిన్నమైన రాజకీయ మార్గాన్ని ఎంచుకుంది. తెలంగాణ సమాజంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మావోయిస్టుల పట్ల ఇప్పటికీ ఎంతో కొంత సానుభూతి ఉంటుంది. ఈ వర్గాలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా బీజేపీ హిందుత్వ ఎజెండాకు వ్యతిరేకంగా ఒక బలమైన సామాజిక కూటమిని నిర్మించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

 

ఇటీవల మాజీ మావోయిస్టు అగ్రనేతలతో రేవంత్ రెడ్డి స్వయంగా సమావేశమవ్వడం, వారి రాజకీయ ఆకాంక్షల పట్ల సానుకూలంగా స్పందించినట్లుగా ప్రచారం జరుగుతోంది. మాజీ మావోయిస్టులను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్‌ కు రెండు రకాల లాభం చేకూరుతుంది. ఒకటి, వారికున్న కేడర్ బలం పార్టీకి తోడవుతుంది. రెండు, అట్టడుగువర్గాల గొంతుకగా కాంగ్రెస్ తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది. అయితే, ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందనేది భవిష్యత్తులో జరిగే ఎన్నికలే నిర్ణయిస్తాయి.

 

మరోవైపు.. తెలంగాణలో రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేత ఉంది. దీంతో పాటు అనేక ఎన్ కౌంటర్లు చేసిన ఆరోపణలు ఉన్నాయి. అయినా సరే.. కామ్రేడ్లు హస్తం వైపుకే మొగ్గు చూపారు. ప్రస్తుతం అడవిలో ఉండి సాయుధ పోరాటం చేసే పరిస్థితి లేకపోవడంతో వారు బతకాలంటే ఏదో ఒక పార్టీలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. అలా వచ్చిన వారికి కాంగ్రెస్ పార్టీలో అవకాశం కల్పింది.. తమపై వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. మరి చూడాలి... సాయుధ పోరాటం వదలి జనాల్లోకి వచ్చిన మాజీ మావోయిస్టులు ఏ మేరకు రాబడతారో..

newsline-whatsapp-channel
Tags : kcr revanth-reddy brs congress maoists gusagusa gusa-gusa political-gusagusa

Related Articles