కడ్పుల కత్తులు పెట్టుకోని కండ్లమీద నవ్వులు కుర్పిస్తరు అంటరు గదా. అగో గా శిత్రం చూస్తుంటె కాంగ్రెస్ ల మస్తు కానొస్తది అంటుర్రుల్లా సోషల్ మీడియాల. మరి అంతగానం ఏం చూశి అంటుర్రా అంటె..ఒక ఫోట్వ సూపెడ్తుర్రు. చూస్తరా మీరు గూడ ఎట్ల.
ఇగో గిదేనుల్లా గా శిత్రమైన ఫోట్వ. ఆహా. ఓహో అనిపిస్తున్నది గదా. సీఎం రేవంత్ సార్ కు ఏదో పుట్టిన రోజు శుభాకాంక్షలో, పెళ్లి రోజు శుభాకాంక్షలో, సీఎం అయ్యి రెండేండ్లు దాటి మూడో ఏడాదిలోకి అడుగు పెట్టిర్రనో, అదీ ఇదీ అని చెప్పెటందుకు పొయ్యిర్రో అనుకునేరు. గదేం కాదుల్లో. ఈ నడ్మ రేవంత్ సారు ఒక ఆరు రోజుల పాటు సద్వు సద్వుకోని వచ్చిండు గదా. మరి..సార్ బడికి పొయ్నట్లు. బస్తాతో కుట్టిన సంచి భుజానికేస్కోని పొయ్నట్లు. పల్క బల్పం పట్టుకోని రాశ్నట్లు ఎక్కడ కనపడలే. అన్ని మంచు ఫోట్వలే కానొచ్చినయ్. సర్టిఫికెట్ గూడ ఒక రోజు ముందే వచ్చింది. సరే ఏదన్న కానీ గానీ.
ఎవ్వలైన తెల్వందే గదా సద్వుకోనొస్తరు. సార్ గూడ లీడర్ షిప్ క్వాలిటీస్ మీద సద్వుకోనొచ్చిండట. అంటే..సార్ కు లీడర్ షిప్ క్వాలిటీస్ లెవ్వని జనాలంత అంటుంటె తెల్షుకున్నడా, కేటీఆర్ సార్ మాటి మాటికి పొడుస్తనే ఉంటడు గదా. నేను సద్వుకున్నరా భయ్..నువ్వు సద్వుకోకుండ తిర్గితె నన్నేం చేయమంటవ్ అంటున్నడని పొయ్యి సద్వుకుండా అనేటిది..ఆయ్నకే తెల్వాలె అంటుర్రు బయట. ఇగీ శిత్రం సూడుర్రి. ఆహా. అందరున్నరు గదా. పొంగులేటి సార్ కు తీరలేదు. నేను రాను పోర్రి అన్నడో అంటుర్రు. సురేఖక్కనేమో ఇటు దిక్కు నిలబడ్డది. ఫార్మాలిటీకి పొయ్నట్లున్నది అక్క. ఆ నడ్మ లొల్లులయ్యే గదా. ఇటు వివేక్ సార్ గూడ అంతే ఉన్నడు గదా. మంత్రి పదవి ఇయ్యకుంట శానాళ్లు తిప్పలు పెట్టిండు గదా రేవంత్ సారు. అటు చూస్తె అజారుద్దీన్ సారు గూడ కొనకొచ్చిండు. ఈయ్నిచ్చిన మంత్రి పదవి ఎప్పుడు పోతదో తెల్వని టెన్షన్ ల ఉన్నడు గావచ్చు సారు. ఇగ తుమ్మల సారేమో..నా శిష్యుడు సీఎం అయిండు. లీడర్ షిప్ క్వాలిటీస్ మీద సద్వుకోనొచ్చిండు. నేను గూడ సద్వుకోని సీఎం గావాలె అనుకుంటుండు గావచ్చు. మొఖంల ఏదో ఉర్కులాట కానొస్తున్నది. ఇగ ఉత్తమ్ సారేమో...గివేం విషెస్సు..ఆయ్న సద్వుకున్న ఆరు రోజుల సద్వుకు విషెస్ చెప్పుడేంది..దానికి గీ ఫోట్వలేంది అని మొఖం అటు దిక్కు తిప్పుకున్నడు గావచ్చు అంటుర్రు. ఏమోనుల్లా. ఏం సద్వులో ఏం కతనో గానీ. దానికి విషెస్ చెప్పెటందుకు ఇంత మంది పోవుడే శిత్రంగున్నది. పోతే పోనీలే..సార్ కు అంతనో ఇంతనో సద్వొచ్చింది, నేను గూడ పలానా చోట సద్వుకున్నా అని చెప్పుకుంటడిగ అని..కామెంట్లు చేస్తుర్రుల్లా బయట.