రైల్వే వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టింపు లేదని నిత్యం జరుగుతున్న రైలు ప్రమాదాల వల్ల అర్థం చేసుకోవచ్చు. మొన్నటి కాంచన్ జంగా రైలు ప్రమాద ఘటన మరువక ముందే యూపీలో చండీగఢ్ – డిబ్రూగఢ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం చోటు చేసుకుంది.
న్యూస్ లైన్ డెస్క్ : యూపీలోని గోండా జిల్లాలో చండీగఢ్ – డిబ్రూగఢ్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలుతప్పింది. గురువారం మధ్యాహ్నం 2:40 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డట్టు యూపీ డిప్యూటీ సీఎం బ్రజేశ్ తెలిపారు.
బుధవారం రాత్రి చండీగఢ్ నుంచి అస్సాంలోని డిబ్రూగఢ్ కి బయల్దేరిన ఎక్స్ ప్రెస్ యూపీలోని జులాహీ రైల్వే స్టేషన్ కి కొన్ని కిలోమీటర్ల దూరంలో పట్టాలు తప్పింది. నాలుగు ఏసీ బోగీలుసహా..మొత్తం 12 బోగీలు పట్టాలు తప్పి.. పక్కకు ఒరిగిపోయాయి. ఊహించని ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానాకు తరలించారు. ప్రమాదం వల్ల ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 13 రైళ్లను అధికారులు దారి మళ్లించారు. కొన్ని సర్వీసులను రద్దు చేశారు.