కోల్‌కతా హత్యాచార ఘటన కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా ఆర్జీ కార్ దవాఖాన మెడికల్ కాలేజీ వైద్యురాలిపై లైంగికదాడి, హత్య కేసును సుమోటోగా సుప్రీంకోర్టు స్వీకరించింది.
న్యూస్ లైన్ డెస్క్: కోల్‌కతా హత్యాచార ఘటన కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా ఆర్జీ కార్ దవాఖాన మెడికల్ కాలేజీ వైద్యురాలిపై లైంగికదాడి, హత్య కేసును సుమోటోగా సుప్రీంకోర్టు స్వీకరించింది. ఈ నెల 20న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారధ్యంలోని బెంచ్ విచారించనుంది. ఆదివారం ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయవాదులు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించాలని కోరారు. ‘క్రూరత్వంతో మూగబోయిన బాధితులకు ఈ కేసులో న్యాయ వ్యవస్థ ద్వారానే న్యాయం జరుగుతుందని యావత్ దేశం చూస్తోంది. ఇతరులకు సేవ చేయడానికి జీవితాన్ని అంకితం చేసిన యువ వైద్యురాలి మరణానికి తగిన న్యాయం చేకూర్చాలి. భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’ అని లేఖలో పేర్కొన్నారు.
ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఇప్పటికే సీబీఐ విచారణ కొనసాగుతుంది. కాగా, సీబీఐ విచారణ జాబితాలో మాజీ ప్రిన్సిపాల్ సందీప్‌తో పాటు మరో 40 మంది పాత్ర ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడు సంజయ్‌రాయ్ మానసిక స్థితిని వైద్యులు విశ్లేషించనున్నారు. ఈ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోని శాంతి భద్రతలపై కేంద్ర హోం శాఖ దృష్టి సారించింది.