Harish rao: కుక్కకాటు ఘటనలకు సర్కార్ బాధ్యత వహించాలి

ఒక్కరోజే వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లో పసికందు మృతదేహాన్ని కుక్కలు పీక్కతినడం, హైదరాబాద్ శివారులోని నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో మరో దివ్యాంగ చిన్నారి మర్మాంగాలపై కుక్కల దాడి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నాలుగేళ్ల చిన్నారి కుక్కల దాడిలో గాయాలపై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి వంటి ఘటనలు చూసి కూడా ప్రభుత్వం చలించకపోవడం అమానవీయమని హరీష్ రావు విమర్శించారు.
 


Published Aug 10, 2024 02:22:30 PM
postImages/2024-08-10/1723279950_siddipetmla.jpg

న్యూస్ లైన్ డెస్క్: కుక్కకాటు ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణమని అన్నారు. ఒక్కరోజే వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లో పసికందు మృతదేహాన్ని కుక్కలు పీక్కతినడం, హైదరాబాద్ శివారులోని నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో మరో దివ్యాంగ చిన్నారి మర్మాంగాలపై కుక్కల దాడి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నాలుగేళ్ల చిన్నారి కుక్కల దాడిలో గాయాలపై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి వంటి ఘటనలు చూసి కూడా ప్రభుత్వం చలించకపోవడం అమానవీయమని హరీష్ రావు విమర్శించారు.

బ్రతికున్న మనుషులను సైతం కుక్కలు చంపి పీక్కుతిన్న సంఘటనలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయని అన్నారు. మరోవైపు చిన్నారులపై కుక్కల దాడులు నిత్యకృత్యం అవుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కుక్కల దాడుల్లో మనుషులు చనిపోవడం అనేది ఒక సాధారణ అంశంగా ప్రభుత్వం భావిస్తుండటం దుర్మార్గమని.. కుక్క కాటు కేసులు నమోదైన మొదట్లోనే తగిన చర్యలు తీసుకొని ఉంటే గడిచిన ఎనిమిది నెలల కాలంలో 343 కుక్కకాటు సంఘటనలు జరిగి ఉండేవి కావని అన్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదని తెలిపారు. 

రాష్ట్రంలో 3,79,156 వీధి కుక్కలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైకోర్టుకు తెలిపింది. కానీ వీటి సంఖ్య ఇంతకు రెట్టింపు ఉంటుంది అని ప్రజలు భావిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. మున్సిపల్ టౌన్లలో పురపాలక శాఖ వైఫల్యం వల్ల వీధి కుక్కల నియంత్రణ లేకుండా పోయిందని తెలిపారు. సరైన నిధుల కేటాయింపు లేక కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేసే వ్యవస్థ కూడా అసలు సరిగా పనిచేయడం లేదు. దీనివల్ల వీధి కుక్కల సంతానం విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. 

ప్రభుత్వం వెంటనే కుక్కకాటు దాడులు అరికట్టే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకు జరిగిన కుక్కకాటు సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారికి, గాయపడిన వారికి నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. ప్రభుత్వం హాస్పిటళ్లలో  ద్వారా కుక్కకాటు బాధితులకు తక్షణ వైద్యం అందేలా చూడాలి, యాంటీ రేబీస్ మందులు అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు.  వీధి కుక్కల నియంత్రణ కోసం సమగ్ర కార్యాచరణ అమలు చేయాలి. క్రమం తప్పకుండా మానిటర్ చేస్తూ సంఖ్య పెరగకుండా చూసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

newsline-whatsapp-channel
Tags : dogs news-line newslinetelugu telanganam congress-government street-dogs harishrao

Related Articles