రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులు హల్ చల్ చేస్తున్నాయి. అయితే వాస్తవ పరిస్థితి వేరేలా ఉంది. సర్కార్ ఏదో మాయ చేస్తోందన్న చర్చ జరుగుతోంది. రుణమాఫీ పేరిట రైతుభరోసాను ఎగ్గొట్టేస్తుందన్న ఆందోళన రైతుల్లో మొదలైంది.
న్యూస్ లైన్ డెస్క్: రుణమాఫీ డబ్బులు పడగానే రైతుల కళ్లల్లో ఆనందమంటూ ప్రభుత్వ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టేశారు. అయితే దీని వెనక ఉన్న వాస్తవాలు మాత్రం వేరేలా ఉన్నాయి. రైతుల అకౌంట్లలో ఈపాటికి పడాల్సిన రైతుభరోసా డబ్బులు ఇంకా పడనే లేదు. కనీసం రైతుబంధు అయినా పడుతుందా అనుకుంటే అదీ లేదు. ఆ డబ్బులనే ఎగ్గొట్టి, రుణమాఫీ పేరిట అన్నదాతలకు కుచ్చుటోపీ పెడుతోందన్న చర్చ గ్రామాల్లో జరుగుతోంది. ఇంకోపక్క గత ప్రభుత్వం రుణమాఫీ చేయాల్సిన ఏడు వేల కోట్లనే సర్కార్ ఇప్పుడు చేస్తుందన్న చర్చ కూడా ఉంది. మరోసారి రైతాంగాన్ని రేవంత్ సర్కార్ మోసం చేస్తోందన్న విమర్శలు మొదలయ్యాయి.
రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులు హల్ చల్ చేస్తున్నాయి. అయితే వాస్తవ పరిస్థితి వేరేలా ఉంది. సర్కార్ ఏదో మాయ చేస్తోందన్న చర్చ జరుగుతోంది. రుణమాఫీ పేరిట రైతుభరోసాను ఎగ్గొట్టేస్తుందన్న ఆందోళన రైతుల్లో మొదలైంది. రుణమాఫీ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇది తమ ఘనత అంటూ గొప్పగా చెప్పుకున్నా.. ఎక్కడా రైతుభరోసా గురించి ప్రస్తావించకపోవడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. రుణమాఫీ సరే.. వానాకాలం పంట పెట్టుబడి ఏమైందని పలువురు ప్రశ్నిస్తున్నారు. రైతుభరోసా డబ్బులనే అటు తిప్పి.. ఇటు తిప్పి రుణమాఫీగా తమ ఖాతాల్లో వేస్తున్నారనే చర్చ జరుగుతోంది.
ఉదాహరణకు ఒక వ్యక్తికి నాలుగు ఎకరాలు ఉంటే.. రైతుభరోసా లెక్క ప్రకారం ఎకరాకు రూ.7500 చొప్పున రూ.30000లు పెట్టుబడిగా రావలసి ఉంటుంది. ఇది ఏడాదికి రెండు పంటలకు గానూ రూ.60000 అవుతుంది. తాజాగా లక్ష లోపు రుణమాఫీ పేరుతో ప్రభుత్వం తొలిదశ మొదలుపెట్టింది. ఆ లక్షలో రూ.30వేలు రైతుభరోసా డబ్బులే అని, అవి ఇవ్వకుండా రుణమాఫీ పేరుతో ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఇప్పుడప్పుడే రైతు భరోసా ఇచ్చే సూచనలు కూడా ఎక్కడా కనపడటం లేవని, ఆగస్టులోనైనా ఇస్తుందన్న భరోసా లేదని రైతులు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీది అంతా డంబాచారమేనని అంటున్నారు. ఇది మభ్య పెట్టడమేనని, ప్రభుత్వం ఒక పథకాన్ని పూర్తిగా పక్కకు నెట్టేసి, ఇంకొక దానికి డబ్బులు కేటాయిస్తోందంటూ మండిపడుతున్నారు.
ఇక రుణమాఫీపై జరుగుతున్న మరో చర్చ.. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన రుణమాఫీ డబ్బులనే ఇప్పటి రేవంత్ సర్కార్ ఇచ్చిందని. గత కేసీఆర్ ప్రభుత్వం 2014, 2018 రెండుసార్లు ఒక లక్ష లోపు రుణ మాఫీ చేసింది. 2014లో మొదటిసారి లక్ష లోపు రుణ మాఫీ చేయడానికి అయిన సొమ్ము సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో రూ. 16,000 కోట్లు కాగా, 2018 తరువాత లక్ష లోపు రుణ మాఫీ చేయడానికి కావాల్సిన నిధులు రూ.19,198 కోట్లు అని కేసీఆర్ ప్రభుత్వం అంచనా వేసింది. కాగా, దీనిలో రూ.12,000 కోట్లు రైతుల ఖాతాల్లో అప్పట్లో జమ చేసిందని రేవంత్ రెడ్డే స్వయంగా తన నోటితో చెప్పారు. ఇప్పుడు లక్ష లోపు రుణాలకు రూ. 7 వేల కోట్లు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. నిధులు ఇంతగా ఎందుకు తగ్గాయనే దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అసలు వాస్తవం ఏంటంటే.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించినట్లు లక్ష లోపు రుణాలు మాఫీ చేయడానికి రూ.19,198 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసిన దాంట్లో రైతుల ఖాతాలో వేసిన సొమ్ము రూ.12 వేల కోట్లు పోగా మిగిలిన రూ. 7 వేల కోట్ల నిధులు ఇప్పుడు ఇస్తున్నట్లుగా కనిపిస్తుందని పలువురు అంటున్నారు. దీనిపై ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.