రైతుభరోసాలో కోతలు..!


Published Feb 13, 2025 12:59:59 PM
postImages/2025-02-13/1739431799_WhatsAppImage20250213at12.46.44PM.jpeg

రైతుభరోసాలో కోతలు

రేవంత్ సర్కార్ నయా గోల్‌మాల్..!

రైతులకు మరో నయవంచన

ఉన్న భూమి కంటే తక్కువ పడుతున్న పైసలు

అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరకు రైతుల పరుగులు

మాకేం తెల్వదంటున్న అధికారులు..!

కోతలు పెట్టడంపై ఆగ్రహం

రేవంత్ సర్కార్ పై రైతన్నలు కన్నెర్ర

 

 

‘‘ రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు అయితే ఎగనామం.. లేదంటే పంగనామం అన్నట్లుగానే ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే  అమలు చేసింది కొన్ని పథకాలే అయితే వాటిలోనూ కోతలు పెడుతూ కోతల ప్రభుత్వంగా పేరు తెచ్చుకోంది. ఇప్పుడు మరోసారి కోతలతో రైతులను పరేషాన్ చేస్తోంది. ఎన్నికల ముందు రైతుభరోసా రూ.15వేలు ఇస్తామని చెప్పి అందులో రూ.3వేలు కోతలు పెట్టింది. సాగుకు యోగ్యమయ్యే భూములకు మాత్రమే అంటూ మెలికిపెట్టి మరికొంత భూములకు రైతుభరోసా ఎగ్గొట్టింది. ఆఖరికి ఇప్పుడు ఇచ్చే రూ.12వేలలోనూ కోతలు పెడుతోంది. రైతులకు ఉన్న భూమి కంటే తక్కువ భూమికే రైతు భరోసాను ఇచ్చి చేతులు దులుపుకుంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.‘‘

 

తెలంగాణం, బ్యూరో (ఫిబ్రవరి 12): రేవంత్ రెడ్డి సర్కార్ రైతుభరోసా విషయంలో రైతులను మరోసారి నయవంచన చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతుభరోసా పేరిట ఎకరాకు రూ.15వేలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత ఎకరాకు రూ.12వేలే ఇస్తామని మాట మార్చింది. ఇప్పటికే ఒక పంటకు రైతుభరోసాను ఎగ్గొట్టిన ప్రభుత్వం, ఇప్పుడు ఇస్తున్నవాటిలోనూ కోతలు పెడుతోంది. ఉన్న భూమి కంటే తక్కువ భూమికి డబ్బులిస్తూ కొత్త మోసానికి తెరలేపింది. దీంతో ఖాతాల్లో డబ్బులు తక్కువ పడడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరకు పరుగులు పెట్టినా ఫలితం దక్కడం లేదు. అధికారులను అడిగినా సరైన సమాధానం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు మొదలై నెలలు దాటినా తర్వాత రైతు భరోసా వేసినా వాటిలోనూ కోతలు పెట్టడం ఏంటని నిలదీస్తున్నారు. ఓ వైపు ఇప్పటికే పండించిన సన్న వడ్లకు ఇస్తామన్న బోసన్ రాలేదు, ఇప్పుడు రైతుభరోసాలోనూ కోతలు పడుతుండటంతో రైతన్నలు కన్నీళ్లు పెడుతున్నారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటూ రేవంత్ సర్కార్ మోసం చేస్తోందంటూ రైతన్నలు కన్నెర్ర చేస్తున్నారు.

 

 

 

ఉన్న భూమి : 1.17 ఎకరాలు

భరోసా వచ్చింది: ఎకరం

 

సిద్ధిపేట జిల్లాకు చెందిన పలువురు రైతులు తమకు ఉన్న భూమి కంటే తక్కువ భూమికి రైతు భరోసా పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘనపూర్‌కు చెందిన ముక్కెర రాజుకు ఎకరం 17గుంటల భూమి ఉంది. దీంతో  అతని ఖాతాలో రూ.8,550 రైతుభరోసా పడాల్సి ఉంది. కానీ కేవలం రూ.2,550 మాత్రమే పడింది. అంటే కేవలం 17 గుంటల భూమికి మాత్రమే డబ్బులు పడి ఎకరాం భూమికి రైతుభరోసా ఎగనామం పెట్టారు.

 

ఉన్న భూమి :  1.11 ఎకరాలు

భరోసా వచ్చింది: 3గుంటలకు

 

రాంపూర్ కు చెందిన దేవర అనిల్ కుమార్ స్వామి అనే రైతుకు ఎకరం 11గుంటల పట్టా భూమి ఉంది.

రూ.7,650 రైతు భరోసా పడాల్సి ఉండగా కేవలం రూ.450 మాత్రమే పడింది, అంటే కేవలం 3గుంటలకు మాత్రమే పడి ఎకరాం 8 గంటల భూమికి ఎగనామం పెట్టారు.

 

ఉన్న భూమి :  1.28 ఎకరం

భరోసా వచ్చింది: 30 గుంటలు

 

నుగునూరుకు చెందిన రైతు డాకూరి భాస్కర్ రెడ్డికి ఎకరం 28గంటల పట్టా భూమి ఉంది. దీంతో అతనికి రూ.10,200 రైతు భరోసా పడాల్సి ఉండగా, కేవలం రూ.4500 మాత్రమే పడింది. ఈ లెక్కన 30 గుంటల భూమికే రైతు బంధు వేసింది రేవంత్ రెడ్డి సర్కార్.

 

ఉన్న భూమి :  1.8 ఎకరం

భరోసా వచ్చింది: 35 గుంటలు

 

బుద్ధిపడగ గ్రామానికి చెందిన రైతు ముక్కెర కరుణాకర్ పేరిట ఎకరం 8గంటల భూమి ఉంది. రూ.7,200 రైతు భరోసా పడాల్సి ఉండగా  కేవలం రూ.5,325 మాత్రమే పడింది. రూ.1875 తక్కువ పడింది.

 

ఉన్న భూమి :  26గుంటలు

భరోసా వచ్చింది: 15 గుంటలు

 

రాంపూర్‌కు చెందిన గోవిందారం వెంకటవ్వ పేరిట 26 గుంటల పట్టా భూమి ఉంది. రూ.3,900 రైతు భరోసా పడాల్సి ఉండగా రూ.2,250 మాత్రమే పడింది. దీంతో ఆమెకు రూ.950లు రైతు భరోసా తక్కువ పడింది.

newsline-whatsapp-channel
Tags : revanth-reddy congress farmers government

Related Articles