గాలిమోటర్ ఖర్చే తడిసి మోపెడు..!


Published Mar 01, 2025 12:31:45 PM
postImages/2025-03-01/1740812505_uttamkumarreddyjpg700x350xt.jpg

గాలిమోటర్ ఖర్చే
తడిసి మోపెడు..!

గంటకు లక్షన్నర, రోజుకు రూ. 8 లక్షలు
7 రోజుల్లో హెలికాప్టర్ ఛార్జీలే రూ. 56 లక్షలు 
తిండి, సిబ్బంది ఖర్చులు అదనం
బేగంపేట నుంచి ఉ|| 10.30 గంటలకు బయలుదేరడం
అదే రోజు సా|| 6 గంటలకు తిరుగు ప్రయాణం 
ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన తర్వాత..
ఇష్టమొచ్చినట్టు మంత్రుల హెలికాప్టర్ తిరుగుళ్లు!
ప్రతీరోజూ కొంతమంది మీడియా ప్రతినిధులకు ఛాన్స్
అక్కడే గెస్ట్ హౌజ్‌లు ఉన్నా.. హైదరాబాద్‌కు చక్కర్లు 

హైలెట్‌బాక్స్: ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం తర్వాత రాష్ట్ర మంత్రుల తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. సహాయక చర్యలపై నిమగ్నం కావలసిన నేతలు.. హెలికాఫ్టర్లలో చక్కర్లు కొట్టడానికే పరిమితమయ్యారన్న చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌, నాగర్ కర్నూల్ మధ్య రాకపోకలు సాగిస్తూ భారీ మొత్తంలో ప్రజాధనాన్ని వృథా చేశారు. ఈ ఏడు రోజుల్లో దాదాపు 20 సార్లకు పైనే హెలికాఫ్టర్లలో తిరిగారు. మంత్రులకు హెలికాఫ్టర్ ప్రయాణాలపై ఉన్న సోయి, అందులో చిక్కుకున్న కార్మికుల ప్రాణాలపై లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

తెలంగాణం, పొలిటికల్ డెస్క్(ఫిబ్రవరి 28): ఎస్ఎల్‌బీసీ ప్రమాదం ఫిబ్రవరి 22న చోటుచేసుకుంది. ఆరోజు నుంచి జిల్లా అధికార యంత్రాంగమంతా అక్కడే ఉంది. రెస్క్యూ టీమ్స్ తమకు శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి. అందులో చిక్కుకున్న ఎనిమిది మందిని క్షేమంగా బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో నిరంతరాయంగా పని చేస్తూనే ఉన్నారు. దురదృష్టవశాత్తు ఆ ప్రయత్నాలేవీ ఫలితాలను తీసుకురావడం లేదు. అయితే సందట్లో సడేమియా అన్నట్టుగా రాష్ట్ర మంత్రులు హెలికాఫ్టర్ ప్రయాణాలు చేస్తూ ప్రజల సొమ్మును మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నారు. దేశమంతా ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తుంటే, వీళ్లు మాత్రం తమ తిండికి, ప్రయాణాలపైన మాత్రమే దృష్టిపెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

ప్రమాదం జరిగిన రోజు నుంచి నేటి వరకు ప్రతిరోజూ ఉదయం 10.30 గంటలకు ఠంచనుగా హెలికాఫ్టర్‌లో బయలు దేరడం.. మళ్లీ తిరిగి సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవడం ఓ పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతున్నారు. వీరి ప్రయాణం ఖర్చులకే రోజుకు 8 లక్షల రూపాయలు అయిపోతున్నాయి. దాదాపు ఏడు రోజులకు లెక్క వేసుకుంటే రూ. 56 లక్షలు ఖర్చు అయ్యింది. అంతేకాదు సిబ్బందికి, భోజనాలకు అదనంగా ఖర్చు పెడుతున్నారు. భోజనాల ఏర్పాట్లలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదన్న చర్చ కూడా జరుగుతోంది. చేపల పులుసు వగైరాలతో చక్కగా భోజనాలు కానిస్తున్నారట. ఇదిలా ఉంటే, వీళ్లు వెళ్లడమేకాక, తమతో పాటు అనుకూల మీడియాకు చెందిన ప్రతినిధులను కూడా తీసుకు వెళుతున్నారు. తమకు అనుకూలంగా మీడియాలో బాకాలు ఊదించుకుంటున్నారన్న విమర్శలు వినపడుతున్నాయి. 

మంత్రులు ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే, ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే స్టే చేసేవారిని, అవసరమైనప్పుడు మాత్రమే హైదరాబాద్‌కు వచ్చేవారన్న చర్చ జరుగుతోంది. అక్కడ ప్రభుత్వ గెస్ట్ హౌజులు ఉండగా, ప్రత్యేకంగా హెలికాఫ్టర్‌లో హైదరాబాద్‌కు రావడం ఎందుకన్న ప్రశ్నను పలువురు లేవనెత్తుతున్నారు. అక్కడ మంత్రుల రక్షణకు తగినంత సెక్యురిటీ ఉండగా, పిలిస్తే పలికే కాంగ్రెస్ కార్యకర్తలు ఉండగా ప్రతిరోజూ ఈ తిరుగుళ్లు ఎందుకు? అన్నది చర్చనీయాంశంగా మారింది. లక్షల రూపాయలను వృథా చేసేకంటే స్థానికంగా ఉండి, ఎస్‌ఎల్‌బీసీ కార్మికుల్లో, అలాగే కుటుంబ సభ్యుల్లో భరోసా కల్పించే ప్రయత్నం చేయొచ్చు. కానీ, మంత్రులు మాత్రం నగరానికి రావడం, పోవడం చేస్తూ, ఎస్ఎల్‌బీసీ ప్రమాదంపై తమ అశ్రద్ధను బయటపెట్టుకుంటున్నారని పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : hyderabad congress begumpet-airport uttamkumarreddy

Related Articles