తెలంగాణలో..
బుల్డోజర్ రాజ్యం..!
UoH భూముల్లోకి జేసీబీలు
ఆదివారం రాత్రి నుంచి 30 జేసీబీలతో పనులు
400 ఎకరాల భూమి చదును
రాత్రంతా భయంతో అరిచిన పక్షులు
చెల్లాచెదురైన జింకలు, నెమళ్లు
అడ్డుకోబోయిన విద్యార్ధులపై లాఠీఛార్జ్
విద్యార్ధినీల జుట్టుపట్టి లాక్కెళ్లిన పోలీసులు
బట్టలు చినుగుతున్నా పట్టించుకోని వైనం
‘‘ కొద్దిరోజుల కిందటి దాకా విద్యార్థుల చదువులు.. పక్షుల కిలకిల రావాలతో పలకరించిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఇప్పుడు పోలీసుల బూట్ల చప్పులు, జేసీబీల మోతలు వినిపిస్తున్నాయి. విద్యార్ధుల పాఠాలు వినబడాల్సిన దగ్గర, వాళ్లపై జరిగిన లాఠీ దెబ్బలు, ఆర్తనాదాలు మార్మోగుతున్నాయి. జేసీబీల దాటికి గూడు చెదరడంతో అక్కడ నివసిస్తున్న నెమళ్లు, పక్షులు, మూగజీవాల అరుపులు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. మనసులేని సర్కారు దెబ్బకు గూడుచెదిరిన పక్షులు కన్నీళ్లు పెడుతున్నాయి. చెంగుచెంగున ఎగిరే జింకలు జీవం లేకుండా పడి ఉన్న దృశ్యాలు మనసును కలచివేస్తున్నాయి.
తెలంగాణం, హైదరాబాద్ (మార్చి 31) : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రణరంగంగా మారింది. రెండో రోజు కూడా విద్యార్ధులు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం నుంచి గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ప్రభుత్వం చదును చేస్తుండటంతో అడ్డుకుపోయిన విద్యార్ధులపై పోలీసులు రెచ్చిపోయారు. ఇష్టానుసారంగా దాడులు చేశారు. లాఠీఛార్జీలు చేసి చితకబాదారు. బట్టలు చినుగుతున్నా, కొట్టిన దెబ్బలకు రక్తాలు కారుతున్నా అవేవి పట్టించుకోకుండా, జుట్టు పట్టుకొని మరీ లాక్కెళ్లారు. ఆడవాళ్లను సైతం బలవంతంగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆదివారం మధ్యాహ్నం కొన్ని జేసీబీలే రాగా.. ఆదివారం రాత్రి 30 జేసీబీలు తెప్పించి చెట్లను తొలగించి చదునుచేసే పనులు మొదలు పెట్టారు. దీంతో రాత్రి ఆ పనులను అడ్డుకునేందుకు వెళ్లిన వారిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పెద్ద సంఖ్యలో క్యాంపస్ గేటు వద్దకు చేరుకున్న విద్యార్థులు రేవంత్ రెడ్డి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్రి నిర్వహించి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విద్యార్థుల నుంచి పోలీసులు సీఎం దిష్టిబొమ్మను లాగేసుకున్నారు. దీంతో "పోలీస్ గో బ్యాక్" "రేవంత్ రెడ్డి ముర్దాబాద్", "గూండాయిజం నై ఛలేగా" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇన్ని రోజులు పచ్చని చెట్లతో, వేలాది పక్షులకు, జింకలకు నెలువుగా ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు నిర్మానుశ్యంగా మారిపోయింది. పిల్లల పాఠాలు వినబడాల్సిన పవిత్రమైన చోటులో విద్యార్ధుల ఆవేదనలు, అక్కడ భూముల్లో ఉంటున్న పక్షులు, మూగజీవాల ఆర్తనాదాలు మారు మోగిపోతున్నాయి.
భూముల అమ్మకాన్ని మొదట్నుంచి యూనివర్సిటీ విద్యార్ధులు అడ్డుకుంటున్నారు. అక్కడ ఎంతో వృక్షసంపదతో పాటు జింకలు, నెమళ్లు అనేక జీవరాసులు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని అమ్మొద్దంటూ అడ్డుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై కొన్ని రోజులుగా ఫైట్ చేస్తున్నారు. ఈ అంశంపై కోర్టులోనే పిల్ దాఖలు చేశారు. ప్రస్తుతం కోర్టులో ఈ కేసు ఉండగానే ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో వరుస సెలవులను దృష్టిలో పెట్టుకొని భూముల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారంతో పాటు సోమ, మంగళవారం రంజాన్ హాలీడే కావడంతో వరుసగా కోర్టుకు సెలవులు ఉన్నాయి. దీంతో ఇదే అదునుగా భావించిన సర్కార్ ఆదివారం నుంచి యూనివర్సిటీలోకి ఒకేసారి దాదాపు 30కి పైగా జేసీబీలను తీసుకొచ్చి భూములను చదును చేసింది.
భారీ బందోబస్తు
విద్యార్ధుల ఆందోళన నేపథ్యంలో యూనివర్సిటీ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వందలాది మంది పోలీసులు కాపలా కాస్తున్నారు. మీడియాను కూడా లోపలికి అనుమతించకుండా కట్టడి చేస్తున్నారు. అటూ లోపల ఉన్న విద్యార్ధులను సైతం బయటకు రాకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. 48గంటలుగా తమను బందీలుగా పెట్టారంటూ విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహిళా విద్యార్ధిని
ఢిల్లీలో ఎంతో పొల్యూషన్ ఉంది. డెవలప్మెంట్ కోసం అన్ని బిల్డింగ్ లు కట్టి ఇప్పుడు మనం జీవించే పరిస్థితి కూడా లేదు. హైదరాబాద్ ను సీఎం రేవంత్ రెడ్డి మరో ఢిల్లీ చేయాలి అనుకుంటున్నారా.?. రీసెంట్ గా ఎయిర్ క్వాలీటీ ఇండెక్స్ రిపోర్టు ప్రకారం వరల్డ్ లోనే మోస్ట్ పొల్యూషన్ సిటీ ఢిల్లీగా మారింది. హైదరాబాద్ ను కూడా అలా చేస్తారా..?. చెట్లు, జీవరాశులను కూడా నాశనం చేయాలని చూస్తున్నారు. అలా చేయాలి అనుకున్నవాళ్లే అసలైన గుంట నక్కలు.
లీగల్ గా భూమి యూనివర్సిటీది అయినా, ప్రభుత్వానిదే అయినా అది పబ్లిక్ దే. రాత్రివేళ పనులు చేస్తుంటే అక్కడ ఎన్నో జీవరాశులు అరుస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే వేలం ప్రక్రియను ఆపాలి. మేం ప్రకృతిని కాపాడాలని కోరితే రెండు రోజులుగా మమ్మల్ని కొడుతూనే ఉన్నారు. మేం ఫైట్ చేస్తే టియర్ గ్యాస్ ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఎన్నుకున్న పాలనలా లేదు.. దొరల పాలన అనుకుంటున్నారేమో. ఇలాంటి వాటిని మేం సహించేది లేదు. రాజ్యాంగం ప్రకారమే మేం కొట్లాడుతున్నాం.. కొట్లాడుతూనే ఉంటాం.
విద్యార్ది
వేలం పాటతో కార్పొరేట్ కంపెనీలకు అమ్మాలని ప్రభుత్వం చూస్తోంది. పండుగ సమయంలో 30 జేసీబీలు పంపి భూమి చదును చేస్తుంటే చూద్దామని వెళ్తే వెంటనే పోలీసులు మాపై దాడి చేశారు. అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. క్యాంపస్‌లో ఏం జరుగుతుందో బయటకు తెలిసేందుకే మేం ధర్నా చేస్తున్నాం. యూనివర్సిటీ భూముల్లో పులులు, సింహాలు లేకపోవచ్చు. కానీ జాతీయ పక్షులు జీవిస్తున్నాయి. వందలాది జింకలు ఉన్నాయి. 234 రకాల పక్షులు ఉన్నాయి. జింకలు చంపితే జైలుకు పంపిస్తారు. అలాంటిది ఈ ప్రభుత్వం వందలాది జింకలను జీవితాలను నాశనం చేస్తుంటే ఏం శిక్ష వేయాలి.
విద్యార్ధిని
50 జేసీబీలతో రాత్రి మొత్తం పనులు జరగడంతో పక్షులు మొత్తం అరుస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి అన్నీ వీడియోలు మేం తీశాం. వీడియోలు తీస్తుంటే కొన్ని మావి గుంజుకున్నారు. ప్రస్తుతం దీనిపై కోర్టులో పిల్ దాఖలు చేశాం. ఓ వైపు కేసు నడుస్తుండగానే ఇంత అర్జెంట్ గా చేయాల్సిన అవసరం ఏముంది. రాత్రి, పగలు పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పనికి వందలాది మంది పోలీసులు కాపలా ఉన్నారు. కోర్టు హాలీడేస్ ఉన్న సమయంలో ఇలా చేయడం దారుణం. కనీసం మీడియాను లోపలికి రానివ్వడం లేదు. మమ్మల్ని బయటకు వచ్చి మాట్లాడనివ్వడం లేదు. ఏమన్న అంటే అది ప్రోటోకాల్ అని చెబుతున్నారు.
పాపం..పక్షులు
మూగజీవాలు ఉన్నాయన్న కనికరం లేదు. పక్షులు భయంతో అరుస్తున్నా పట్టింపు లేదు. సర్కార్ కు కావాల్సింది ఒక్కటే. అక్కడి భూముల్లోని రాళ్లు, చెట్లను తొలగించడం. జేసీబీల సాయంతో వాటిని తొలగిస్తూనే ఉన్నారు. దీని కారణంగా చెట్ల మీద పక్షులు పెట్టుకున్న గుళ్లు నేలమట్టమయ్యాయి. జేసీబీల సౌండ్ కు నెమళ్లు, మూగజీవాలు భయంతో రాత్రంతా అరుస్తూనే ఉన్నాయి. అయినా కనీసం కనికరం లేకుండా వాటిని భయపెడుతూనే పనులు సాగించారు. నెమళ్ళు, పక్షుల అరుపులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాటి అరుపులు హృదయాన్ని కలచివేస్తున్నాయి.