మా పనులకు అడ్డొస్తే .. ఎవ్వరినీ వదిలిపెట్టం..!


Published Apr 02, 2025 11:32:35 AM
postImages/2025-04-02/1743573755_1903614ssr3908.webp

మా పనులకు అడ్డొస్తే .. 
ఎవ్వరినీ వదిలిపెట్టం 
HCUలో పేమెంట్ బ్యాచ్ నిరసన
రెచ్చగొట్టి అరాచకం చేస్తున్నారు
ప్రైవేట్ చేతుల్లోకి పోయిన భూమిని కాపాడినం
ఆ భూముల్లో సాప్ట్‌వేర్ కంపెనీలు తీసుకొస్తాం
మీడియాతో మంత్రులు భట్టి, పొంగులేటి, శ్రీధర్ బాబు
HCU భూములపై మంత్రులతో సీఎం రివ్యూ

తెలంగాణం, హైదరాబాద్ (ఏప్రిల్ 1) : ప్రకృతిని కాపాడేందుకు HCUలో జరుగుతున్న ఆందోళనపై సర్కార్ తీవ్ర ఆరోపణలు చేసింది. నిరసనలు చేస్తుంది విద్యార్థులు కాదని, విద్యార్థుల ముసుగులో ఉన్న పేమెంట్ బ్యాచ్ అంటూ మంత్రులు ఆరోపించారు. యూనివర్శిటీలో ప్రభుత్వం చేస్తున్న పనులకు అడ్డొస్తే ఎవ్వరినీ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. సెక్రటేరియట్ లో మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా  భట్టి విక్రమార్క మాట్లాడుతూ ‘‘హెచ్‌సీయూ నుంచి భూములను లాక్కొని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏవో వెంచర్లు, ప్లాట్లు వేసి అమ్ముకునేందుకు ప్రయత్నిస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రైవేట్ సంస్థల్లో ఉన్న భూములను కాపాడి ప్రభుత్వం తీసుకుందని అక్కడ సాప్ట్ వేర్ కంపెనీలు తీసుకురావడానికి కష్ట పడుతున్నామన్నారు. మేము ఈ రాష్ట్రానికి ఏం చేసినా అది మంచే చేస్తామని, రాష్ట్రానికి సంపద సృష్టిస్తామని తెలిపారు. ఈ 400 ఎకరాలను కాపాడి.. అక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఒక కార్యాచరణ రూపొందించామన్నారు. హైటెక్‌ సిటీ, హైటెక్‌ సిటీ ఫేజ్‌-2, నాలెజ్డ్‌ సిటీ వంటి వాటి ద్వారానే ఉపాధి పెరిగింది. అదే విధంగా యువతకు భారీ ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని భట్టి విక్రమార్క తెలిపారు.  

పేమెంట్ బ్యాచ్ నిరసనలు

HCUలో నిరసనలు చేస్తుంది విద్యార్థులు కాదని, విద్యార్థుల ముసుగులో ఉన్న పేమెంట్ బ్యాచ్ అని, బీఆర్ఎస్ పార్టీ పేమెంట్ ఇచ్చి అక్కడ ఒక బ్యాచ్ తో నిరసనలు చేయిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని, ఇందులో యూనివర్శిటీ భూమి లేదని అన్నారు. గతంలోనే ప్రభుత్వం, వర్శిటీ మధ్య భూ మార్పిడి ఒప్పందం జరిగిందని చెప్పుకొచ్చారు. 400 ఎకరాల ల్యాండ్ కేసు మేం కోర్టులో గెలిచామని దీనిని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. భూములు చదును చేస్తుంటే పర్యావరణానికి ప్రమాదమని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.  మూగ జీవాలు చనిపోయాయని సోషల్ మీడియాలో పాత ఫొటోలు సర్క్యూలేట్ చేస్తున్నారని, ఈ కుట్ర వెనక బీఆర్ఎస్ నేతలే ఉన్నారని ఆరోపించారు. విద్యార్థుల ముసుగులో అధికారులపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణానికి, మూగ జీవాలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా భూమి చదును పనులు చేస్తున్నామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 

అడ్డొస్తే ఊరుకోం: మంత్రి శ్రీధర్ బాబు

ప్రభుత్వ పనులకు అడ్డు తగిలితే ఎవ్వరినీ వదిలిపెట్టబోమని మంత్రి శ్రీధర్ బాబు వార్నింగ్ ఇచ్చారు. 
రాష్ట్ర ప్రభుత్వం యూనివర్శిటీ భూములను ఒక్క అంగుళం కూడా తీసుకోవడం లేదని, ప్రభుత్వానికి చెందిన భూములు మాత్రమే తీసుకుంటున్నామని అన్నారు. ఈ విషయంలో విపక్షాలు, కొన్ని సంఘాలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. వారం రోజుల క్రితమే హెచ్సీయూ వీసీ, రిజిస్ట్రార్ తో సమావేశమై  ఆ భూములు ప్రభుత్వానివే అని స్పష్టం చేశామని తెలిపారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ భూములపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అవన్నీ అబద్దాలని అన్నారు. అక్కడ ఉన్న రాక్ ఫార్మేషన్స్, లేక్ లు, పీకాక్స్ ఇతర వన్యప్రాణులను కాపాడడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. 400 ఎకరాల ప్రభుత్వ భూమిని న్యాయస్థానాల తీర్పుకు అనుగుణంగానే తీసుకుంటున్నామని, విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని చెప్పారు

HCU భూములపై సీఎం రివ్యూ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్ధుల ఆందోళనలు ఉద్రిక్తంగా మారడంతో మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భూముల వ్యవహారంపై చర్చించారు. అయితే విద్యార్ధుల ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతుండటంతో ఎలా ముందుకు వెళ్లాలని, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనే అంశంపై ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.

newsline-whatsapp-channel
Tags : congress-government ministerponguletisrinivasreddy bhattivikramarka

Related Articles