మా భూములు మాకేనని...!
సర్కారుపై హెచ్సీయూ విద్యార్థుల జంగ్ సైరన్
మంగళవారం మరింత పెరిగిన ఉద్రిక్తతలు
గేటువైపు దూసుకొచ్చిన విద్యార్థులు
పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే నిరసన
నాలుగు డిమాండ్లతో నిరవధిక సమ్మెకు పిలుపు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
మేం గుంట నక్కలమే అంటూ ప్లకార్డులు
మద్దతుగా వచ్చిన పలు విద్యార్థి సంఘాలు
గేటు బయటే అరెస్ట్ చేసిన పోలీసులు
ఓయూలో బీఆర్ఎస్వీ నిరసన
‘‘ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో సర్కార్ నిర్బంధకాండ నడుస్తోంది. ప్రకృతిని కాపాడాలని విద్యార్ధులు ఫైట్ చేస్తుంటే అరెస్టులు, లాఠీఛార్జీలతో విద్యార్ధుల ఉద్యమాన్ని అణిచివేస్తోంది. అయితే పోలీసుల అరెస్టులను లెక్క చేయకుండా విద్యార్ధులు నిరసనలు కొనసాగిస్తున్నారు. 400 ఎకరాల భూమిపై ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు నిరవధిక సమ్మె చేపడతామని పిలుపునిచ్చారు. అటూ విద్యార్ధుల ధర్నాకు వివిధ రాజకీయ పార్టీలతో పాటు విద్యార్ధి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.‘‘
తెలంగాణం, హైదరాబాద్ (ఏప్రిల్ 1) : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధులు కదం తొక్కడంతో రణరంగంగా మారింది. ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన 400 ఎకరాల భూములపై వెనక్కి తగ్గాలంటూ చేపట్టిన నిరసనలు మంగళవారం కూడా కొనసాగాయి. విద్యార్ధుల ధర్నాకు రాజకీయ పార్టీలు, వివిధ విద్యార్ధి సంఘాల నాయకులు మద్దతు తెలపడంతో సెంట్రల్ యూనివర్శిటీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. యూనివర్శిటీలోని విద్యార్ధులు బయటకు వెళ్లకుండా, బయట ఉన్నవాళ్లు లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ‘‘ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. HCU విద్యార్థుల నిరసన పోలీసులు నిర్బంధించడంతో.. యూనివర్సిటీ లోపలనే HCU భూములు అమ్మొద్దు అంటూ ఆందోళనకు దిగిన విద్యార్థులు ధర్నాకు దిగారు.
బీజేపీ, సీపీఎంకు చెందిన నేతలు యూనివర్శిటీ ముట్టడికి తరలివచ్చారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్శిటీ ముందు బీజేపీ, సీపీఎం నాయకులు ఆందోళన చేస్తున్న సమయంలోనే లోపల నుంచి విద్యార్ధులు బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని బయటికి రాకుండా అడ్డుకున్నారు. మళ్లీ లోపలికే పంపించారు. బయట ధర్నా చేస్తున్నవారిని వెంటనే అడ్డుకోవడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామంటూ హెచ్చరించారు. ధర్నా చేస్తున్న విద్యార్ధులను బలవంతంగా అరెస్ట్ చేశారు. ఆడపిల్లలు అని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లి
పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఇది మా హక్కు...
విద్యార్ధులు యూనివర్శిటీలో విద్యార్ధులు క్లాసులు బహిష్కరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూనివర్శిటీలో గుంట నక్కలు ఉన్నాయన్న సీఎం వ్యాఖ్యలకు నిరసనగా ప్లకార్డులు ప్రదర్శించారు. ‘‘మేము గుంట నక్కలమే.. ఇది మా డెన్.. మా భూమి.. మా హక్కు‘‘ అంటూ ఆర్ట్ తో ర్యాలీ నిర్వహించారు. అటూ యూనివర్శిటీ లోపల బైఠాయించారు. పాటలు పాడుతూ ఆందోళనలు చేశారు.
నిరవధిక సమ్మెకు పిలుపు...
400 ఎకరాల భూమిపై విద్యార్ధులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. క్లాసులను బహిష్కరించారు. 4 డిమాండ్లతో లేఖను విడుదల చేశారు. 1) యూనివర్సిటీ దగ్గర ఉన్న పోలీసులు, క్యాంపస్ లో ఉన్న జేసీబీలను వెంటనే వెనక్కి పంపించాలని,2) ఈ భూమిపై యూనివర్శిటీదే అని వ్రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని, 3) ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంకు సంబంధించిన మినిట్స్ ను విడుదల చేయాలని 4) భూమికి సంధించిన డాక్యుమెంట్స్ పారదర్శకంగా ఉండాల చూడాలని డిమాండ్ చేస్తూ లేఖ విడుదల చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు ధర్నాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఓయూలో ధర్నా..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వేలం వేస్తున్నది HCU భూములను కాదని, హైదరాబాద్ ఊపిరితిత్తులని మండిపడ్డారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం HCUకి 2300 ఎకరాల భూమిని ఇస్తే, ఇప్పుడు అదే పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ భూములను అమ్మాలని చూస్తున్నారని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పాలన చేతకాక, పన్నులు రాబట్టక లేక భూములను అమ్మి జీతాలు ఇవ్వాలని చూస్తున్నారని, ఇలాంటి చేతగాని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు "ప్రభుత్వ భూమి ఒక గుంట కూడా అమ్మకుండా చూస్తాం" అని చెప్పి, ఇప్పుడు యూనివర్సిటీ భూములు ఎలా అమ్ముతున్నాడని ప్రశ్నించారు. ఉద్యోగాలు భర్తీ చేయడం, పథకాలు ప్రజలకు అందించడం చేతగాక, ఈరోజు భూములను కాపాడాలని నిరసన తెలియజేసిన విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి రాష్ట్రంలో ఒక నిర్బంధకాండ కొనసాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల వేలం ప్రక్రియను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, విద్యార్థుల మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలని లేదంటే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసన ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని శ్రీనివాస్ హెచ్చరించారు.