Jagadish reddy: ఇకపై రైతులకు ఫ్రీ కరెంటు లేనట్టే 2024-06-30 17:15:48

న్యూస్ లైన్ డెస్క్: ఇకపై రైతులకు ఫ్రీ కరెంటు(free current) ఉండదని మాజీ విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish reddy) అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌(Telangana bhavan)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగాన్ని(electricity sector) ప్రైవేటీకరణ చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. విద్యుత్ బిల్లుల వసూలును ప్రైవేట్ కంపెనీలకు అప్పగించే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయాలు తీసుకుంటుందని వెల్లడించారు. 

విద్యుత్ బిల్లుల వసూలును ఆదానీ(Adani)కి అప్పగించెందుకు 
కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రమంతటా విద్యుత్ బిల్లుల వసూలు ప్రైవేట్ చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉందని జగదీష్ రెడ్డి హెచ్చరించారు. అదే జరిగితే విద్యుత్ సబ్సిడీలు(current subsidy), రైతులకు ఉచిత కరెంటు ఉండవని అన్నారు. రైతుల విద్యుత్ మోటార్లకు కూడా మీటర్లు పెడతారని అన్నారు. గతంలో కేసీఆర్(KCR) ప్రభుత్వంపై కూడా చాలా ఒత్తిడి తెచ్చారని.. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించలేదని తెలిపారు. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) కనుసన్నల్లోనే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోడీ, అదానీ విధానాలను తెలంగాణలో రేవంత్ అమలు చేస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ సంస్థ అనేది ప్రజల ఆస్తి, కానీ దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వమీ చెప్పింది. ఓల్డ్ సిటీలో 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు వచ్చే కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. ఓల్డ్ సిటీలో 45 శాతం మాత్రమే కరెంటు బిల్లులు వసూలు అవుతున్నాయని, అందుకే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అక్కడి ప్రజలను అవమానించే విధంగా రేవంత్ రెడ్డి చర్యలు ఉన్నాయని విమర్శించారు. 

సింగరేణి బొగ్గు గనులను వేలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
పాల్గొన్నారు. శ్రావనపల్లి బొగ్గు గనిని వేలం నుండి ఎందుకు తొలగించలేదని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఎప్పుడూ వేలంలో పాల్గొనలేదని గుర్తుచేశారు. సింగరేణి బొగ్గు గనులను లీజుకు తీసుకున్న కంపెనీలను అనుమతించేది లేదని బీఆర్ఎస్ ఎప్పుడో స్పష్టం చేసిందని అన్నారు. విద్యుత్ బిల్లుల వసూళ్లపై కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనం కనిపిస్తుందని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇదే కొనసాగితే విద్యుత్ ఉద్యోగుల పాత్ర నామమాత్రంగా
మారే అవకాశం వుందని ఆయన హెచ్చరించారు. ప్రయివేటు వాళ్లకు అప్పగిస్తే విద్యుత్ వ్యవస్థ నాశనమవుతుందని అన్నారు.